కనుమరుగైన నేతలకు పునరావాస కేంద్రంగా ‘బీఆర్ఎస్’

– తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్

దేశ రాజకీయాలంటూ కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… ప్రజలు పట్టించుకోరని అన్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. తెలంగాణలోనే ఏమీ చేయని వ్యక్తి ఇక జాతీయ రాజకీయాల్లో ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. ‘టీఆర్ఎస్’ ను ఎప్పుడైతే… ‘బీఆర్ఎస్’ అని ప్రకటించారో… అప్పుడే టి ఆర్ ఎస్ అస్తిత్వం చచ్చిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ఆ పార్టీ ఎక్కడ ఉన్నా.. దోచుకోవడం, దాచుకోవడం తప్ప, ప్రజలకు ఉపయోగమేమీ ఉండదని పేర్కొన్నారు. కేవలం తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే ‘బీఆర్ఎస్’ పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారని… ఇక ‘బీఆర్ఎస్’ పార్టీ, దేశంలోని అవుట్డేటెడ్ పార్టీలు, కనుమరుగైన రాజకీయ నేతలకు పునరావాస కేంద్రంగా మారుతుందే తప్ప, ఆ పార్టీ పీకేది ఏమీ లేదని వెల్లడించారు. ఎంతసేపు ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ అండ్ బ్యాచ్ కు … గుజరాత్ మోడల్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమై ఉంటుందని… ఇప్పటికీ అర్థం కాకుంటే టిఆర్ఎస్ నేతలు, కళ్ళుండి చూడలేని కబోదులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఎన్వి సుభాష్ వెల్లడించారు.

గుజరాత్ లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కేసీఆర్ సహా ప్రత్యర్ధులు డబ్బు సంచులను పంపినా… రికార్డ్ విక్టరీ తో అక్కడి ప్రజలు బిజెపిని గెలిపించి, వీళ్ళ చెంప చెల్లు మనిపించారని… ఇప్పటికైనా ఈ దొంగల ముఠాకు బుద్ధి వచ్చి, తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. దేశం కోసం, ధర్మం కోసం రోజులో 18 గంటలు పనిచేస్తున్న ప్రధాని మోదీ మేనియా ముందు, మీ పప్పులు ఉడకవని, ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని కేసీఆర్ అండ్ బ్యాచ్ ను హెచ్చరించారు ఎన్వి సుభాష్.

మీరు ‘టీఆర్ఎస్’ ను ‘బీఆర్ఎస్’ చేసుకున్నా… ఏమి చేసుకున్నా… మీకు ‘వీఆర్ఎస్’ తప్పదని… లిక్కర్ స్కామ్లలో, అవినీతి కేసులలో… మీరు జైలుకు పోక తప్పదని జోష్యం చెప్పారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్.