Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ గురుకుల బాట

– ఈ నెల 30 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట కార్యక్రమం
– గురుకుల, పాఠశాల విద్యను సంక్షోభంలోకి నెట్టిన రేవంత్ సర్కార్
– 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణం… 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు
– పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో విద్యార్థులను పొట్టన బెట్టుకుంటున్న ముఖ్యమంత్రి
– విద్యా శాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోతలేదు
– విద్యార్థులు చనిపోతున్న ఒక్క సమీక్ష కూడా నిర్వహించనీ ప్రభుత్వానికి ఉసురు తప్పదు
– గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన కమిటీ
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ
– కమిటీ నివేదికను పార్టీకి సమర్పిస్తుంది
– ఈ నివేదిక అంశాలను సభలో లేవనెత్తనున్న బీఆర్ఎస్
– బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద సంఘటనల నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈనెల 30 తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యాసంస్థల తో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను కాలేజీలను పరిశీలిస్తారన్నారు. ఈ గురుకుల బాట కార్యక్రమానికి ఎంఎల్ఏ, ఎమ్మెల్సీ, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులకు సహకారం అందించాలని కేటీఆర్ సూచించారు. బాలికల విద్యాసంస్థల్లో పార్టీ తరఫున విద్యార్థి విభాగం మహిళా నాయకులు, పార్టీ మహిళా నాయకులు సందర్శిస్తారని కేటీఆర్ తెలిపారు. జడ్పీ చైర్మన్లు ఎంపీపీలు, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మహిళా సీనియర్ నాయకులు గురుకుల విద్యాసంస్థలను సందర్శించి బాలిక సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని చెప్పారు.

గురుకులాల్లో విద్యార్థులు మరణించడం, విషాహారం కారణంగా విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్న ఘటనలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాలనను గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులకు చావులకు ఈ ముఖ్యమంత్రే కారణమవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాష్ట్ర వ్యాప్తంగా 48 విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు.

విద్యాసంస్థల్లో ఉన్న దుర్భరమైన పరిస్థితులను తట్టుకోలేక 23 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని…8 మంది అనుమానాస్పదంగా మృతి చెందారన్నారు. నలుగురు విషాహారం తిని…మరో 13 మంది ఆనారోగ్యంతో చనిపోయారన్నారు. అంతేకాకుండా గత ఏడాది కాలంలో 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని చెప్పారు.

886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన హాస్పిటల్ పాలు కాగా…నలుగురు విద్యార్థులు మరణించారన్నారు. వాంకిడి లో విషాహారం తిని శైలజ అనే విద్యార్థిని చనిపోయిన ఘటన మరవకముందే మహబూబ్ నగర్ జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగటం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవటం, కీలకమైన విద్యాశాఖను ఆయన తన దగ్గరే పెట్టుకొని నిర్లక్ష్యం చేస్తుండటం విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. మొదటి సంఘటన జరిగినప్పుడే ఈ ముఖ్యమంత్రి స్పందించి ఉంటే ఇంత మంది విద్యార్థుల ప్రాణాలు పోయి ఉండేవి కాదన్నారు. ఇంత జరుగుతున్న కూడా ఈ ముఖ్యమంత్రికి ఆ పిల్లల తల్లితండ్రులు కడుపుకోత కనిపించటం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఢిల్లీకి 28 సార్లు వెళ్లటానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చనిపోతుంటే కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించాలన్న సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు. పిల్లలకు సరైన అన్నం పెట్టటం, వారి బాగోగులు చూసుకోవటం కూడా చేతకాని దద్దమ్మ ప్రభుత్వమిదంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరితే బీఆర్ఎస్వి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. ఇది ప్రజాపాలన కాదు…విద్యార్థులను పొట్ట పెట్టుకుంటున్న పాపపు పాలన అని మండిపడ్డారు.

విద్యార్థుల చావులను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుతుందని అన్నారు. నిర్వహణ చేతకాక ఈ ప్రభుత్వం గురుకుల, పాఠశాల విద్యను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదవుకు దూరం చేసే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లైనా లేదా అని ప్రశ్నించారు. మొదటి సంఘటన జరిగినప్పుడే ఈ ముఖ్యమంత్రి స్పందించి ఉంటే విద్యార్థుల మరణాలు జరిగి ఉండేవి కాదన్నారు.

గురుకుల బాట కార్యక్రమం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన కేటీఆర్

గురుకుల విద్యాసంస్థల నిర్వహణలో అపారమైన అనుభవమున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా సభ్యులుగా డాక్టర్ ఆంజనేయులు గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారామ్ యాదవ్, వాసుదేవ రెడ్డి ఉంటారన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి విద్యా సంస్థల నిర్వహణ, అక్కడి సమస్యలపై సమగ్ర అవగాహన ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే గురుకుల బాటలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాసంస్థలతో పాటు కస్తూర్బా కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్ కాలేజీలను సందర్శించనున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. కమిటీ ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను సందర్శించి అక్కడి స్థితిగతులు, సౌకర్యాలను, పరిస్థితులను తెలుసుకోనుంది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఎదుర్కొంటోన్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయనుంది.

కమిటీ అందించే నివేదిక ఆధారంగా గురుకుల విద్యాసంస్థల సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి సూచిస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే వివిధ రూపాల్లో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

ఈ అంశాన్ని తాము రాజకీయం చేయాలని ప్రయత్నించటం లేదని చెప్పారు. విద్యార్థుల మరణాలను నివారించటం విఫలమవటం, వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్న దానిపై ప్రభుత్వమే ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. అదే విధంగా కమిటీ నివేదికలో ప్రస్తావించే అంశాలను తాము శాసన సభలో లేవనెత్తుతామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.

LEAVE A RESPONSE