– నేను నోరు విప్పితే ఇబ్బంది పడేది బీఆర్ఎస్ నాయకులే
– మా వల్లే జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు
– మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ ప్రణాళికలు వేయలేదా?
– హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: ‘‘నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బంది పడతారు. నాటి విషయాలన్నీ నేను ఇప్పుడు బయటపెట్టాలా? మూసీ ప్రక్షాళన కోసం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రణాళికలు వేయలేదా? బీఆర్ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల’’ని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత, అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.
బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలని, జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడానికి తామే కారణమని, మజ్లిస్ మద్దతు కారణంగానే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. ఎన్నికల సమయంలో కేవలం 24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని, కానీ అప్పుడు బీఆర్ఎస్ వాళ్లకు అహంకారం ఉందని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
ఎక్కువ మంది సంతానం ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు, చెబుతున్నారని.. కానీ అదే విషయాన్ని తాను చెబితే మాత్రం రాద్ధాంతం చేసేవారన్నారు. బాగా పని చేస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభమని ఒవైసీ మండిపడ్డారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని, అసెంబ్లీ, లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గుతుందన్నారు.
మూసీపై బీఆర్ఎస్ ప్రణాళిక చేస్తే తాను వద్దని కూడా చెప్పానని, ఆనాటి విషయాలు ఇప్పుడు బయటకు చెప్పమంటారా? నేను నోరు విప్పితే ఇబ్బంది పడేది బీఆర్ఎస్ నాయకులే అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లను కూల్చకుండా ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని ఒవైసీ అన్నారు.