Suryaa.co.in

Andhra Pradesh Telangana

అమరావతి-హైదరాబాద్‌ మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించండి

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో రహదారులు నిర్మించాలని విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతి-హైదరాబాద్‌ మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని.., ఎన్‌హెచ్‌ 30ని అమరావతి వరకు పొడిగించాలని కేంద్రాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం అమరావతి – హైదరాబాద్‌ మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని.., ఎన్‌హెచ్‌ 30ని అమరావతి వరకు పొడిగించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లోక్‌సభలో రహదారి, రవాణా శాఖ బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన కేసినేని ఏపీలోని జాతీయ రహదారుల్లో 433 బ్లాక్‌స్పాట్స్‌ గుర్తిస్తే.. ఇప్పటివరకు 76 మాత్రమే సరిదిద్దారని అన్నారు.రాష్ట్రంలో 10 వేల కోట్ల విలువైన 37 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయని.. తక్షణం వాటిని వేగవంతం చేయాలని కోరారు.ఎన్‌హెచ్‌ 30 విజయవాడ నుంచి ప్రారంభమై ఉత్తరాఖండ్‌కు వెళ్తుందని తెలిపారు.సుదీర్ఘమైన జాతీయ రహదారి ఇదేనన్న నాని.. క్రితం సారి తమ నాయకుడు చంద్రబాబు ఈ రహదారిని అమరావతితో కలపాలని ప్రతిపాదించినట్లు గుర్తు చేశారు.

ప్రస్తుతం ఈ జాతీయ రహదారి ముగిసే ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి కేవలం 10-12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నందున.. ఈ అనుసంధానానికి పెద్ద ఖర్చు కూడా కాదని అభిప్రాయపడ్డారు.కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల వంతెన, మిగిలిన రోడ్డు నిర్మిస్తే అది రాష్ట్ర రాజధానికి అనుసంధానమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి తక్షణం దానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి దేశంలోనే అత్యంత రద్దీ రహదారి అని.. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ రహదారిని 6 వరుసలకు పెంచాలన్నారు.విభజన చట్టం ప్రకారం అమరావతి-హైదరాబాద్‌ మధ్య గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన కేశినేని.. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి గడ్కరీ ఏపీకి మద్దతు ఇస్తున్నారని కొనియాడారు.

కేంద్ర బడ్జెట్‌లో 5 శాతం మొత్తాన్ని రహదారులు, రవాణశాఖకు కేటాయించేలా చేసిన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరికి అభినందనలు తెలిపారు. ఈ శాఖకు ఇంత పెద్ద మెుత్తంలో బడ్జెట్‌ కేటాయింపులు చేయటం చరిత్రలో ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు.అదే క్రమంలో రహదారి భద్రతకూ ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.

ప్రపంచంలో ఎక్కడాలేనన్ని రోడ్డు ప్రమాదాలు మన దేశంలోనే జరుగుతున్నాయన్న ఆయన.. బడ్జెట్‌లో రహదారి భద్రతకు కేవలం రూ.229 కోట్లు మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. మనుషుల ప్రాణాలు అన్నింటి కంటే విలువైనవి కాబట్టి రహదారి ప్రమాదాలకు గురైన వారిని రక్షించడానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.

జాతీయ రహదారుల నిర్వహణ కోసం కేవలం 1.4 శాతం కేటాయింపులు మాత్రమే చేశారన్న నాని… ప్రపంచ స్థాయి రోడ్లు నిర్మించినా వాటి నిర్వహణను వదిలేస్తే ప్రమాదాలు, వాహనాల రిపేర్లు అధికంగా ఉంటాయన్నారు.రవాణ ఖర్చులు ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్‌లోనే అధికంగా ఉన్నాయని…ఆ ఖర్చును తగ్గించాలంటే రహదారుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని కేశినేని నాని డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE