– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్య
తెల్లవారక ముందే రాష్ట్రంలో ఏదో ఒక దురదృష్టకర సంఘటన, దాడో, హత్యో ,అత్యాచారమో దళిత, గిరిజన కులాలపై చూడాల్సి వస్తుందని, అయినా ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంటుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆక్రోశం వ్యక్తం చేశారు.
బుధవారం బాపట్ల జిల్లా వేటపాలెం లో జరిగిన గిరిజన యువకుడు నవీన్ ను 9 మంది వ్యక్తులు చావబాది, మూత్రం తాగించిన అనాగరిక సంఘటనపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగిన దుర్మార్గ సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడాల్సి వస్తుందని విచారం వ్యక్తంచేశారు. బాధితుడు నవీన్ ఆస్పత్రిలో చేరినా మెడికో కేసు నమోదు చేయలేదని,స్వయంగా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, ఆఖరికి తల్లి స్పందనలో ఫిర్యాదు చేస్తే పోలీసుల్లో చలనం వచ్చిందన్నారు.
నిందితులందరినీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్ర పూర్తిగా అటకెక్కాయని, రక్షించాల్సిన పోలీసులు రక్షించలేకపోతున్నారని పేర్కొన్నారు. పోలీసులు అంటే ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికార పార్టీ నాయకులకు మాత్రమే రక్షణ కల్పించడం కాదని, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిజిపికి సూచించారు.