Suryaa.co.in

Features

కుల ధ్రువీకరణ పత్రం

ఉదయం నుండి ఎదురుచూస్తున్నా విఆర్ఓగారి కోసం. రోజు రావటం, వారు రాలేదని మధ్యాన్నానికి ఉసూరంటూ ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా తిరిగివెళ్ళటం. అమ్మ  తన వైధవ్యానికి  , నిరక్షరాస్యతకి వగచి ఇంకా ఏకాగ్రతతో మొక్కేది పదేళ్ల నన్ను వృద్ధిలోకి తెమ్మని. మొత్తానికి ఐదోరోజు విఆర్ఓ గారి సంతకం చేయించుకొని, ఎంఆర్ఓ గారి సంతకం కోసం వెళ్ళాను. ఎన్నో పడిగాపుల అనంతరం, వారి పిలుపు. ఎంఆర్ఓ గారు అధికార స్వరంలో పేరు? అన్నారు. భయంతో చిన్నగా బాబు చెప్పాను. ఏ కులం, దేన్నో చూపుతూ అడిగారు. చిన్నగా ఇబ్బందిగా వారి పక్కకి జరిగి ఏదో చెప్పేలోగా ఛీ! దూరంగా నిలబడు! అగ్రవర్ణ దురంహంకార గర్జింపు. వామనుణ్ణి అయిపోయాను. నా మీద నాకే అసహ్యం, మనస్థాపం. సంతకమైన సర్టిఫికెటును పట్టుకొని, స్టాంప్ వేయించుకొని, ఇంటి దారి పట్టాను. ఎన్నోరోజులు అన్నం సహించలేదు. సహాయం కావాలనే/చేయాలనే సిస్టం. సిస్టంలో పనిచేసేవారికె గౌరవం లేకపోవటం దౌర్భాగ్యం. బడుగువర్గ ఆఫీసర్ని పెట్టి ఉండాల్సింది ఈ పోస్టులో. చిన్నగా ఒక నిర్ణయానికి వచ్చాను, నా కుల ధ్రువీకరణ పత్రాన్ని అవసరపడని వస్తువులు దాచే పాత ట్రంకుపెట్టి తీసి, అడుగున భద్రంగా దాచాను . ఆ సర్టిఫికెట్ అవసరం లేకుండా తరువాత బాగా చదివి, జీవనపదంలో పైకెక్కి , ఆ పత్రం అవసరం లేని ప్రపంచంలో నేను నేనుగా, మనిషిగా బ్రతుకుతున్నాను. ట్రంకువంక చూస్తూ, తొందరలో అలాంటి ప్రపంచం అంతటా విస్తరిల్లాలని ఆకాంక్షిస్తూ!

– కామేష్ బద్రి, ( అట్లాంటా, అమెరికా)

LEAVE A RESPONSE