– ఎంపీలు పార్లమెంటులో బిగ్గరగా అరిచి చెప్పాలన్న జేడీ
– ఆర్ధిక సంఘం పేరు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు
– ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు… ఆరంభం
– 15వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ ఎన్.కె.సింగ్ ని ఉటంకించిన జేడీ
– జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ట్వీట్
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, ఇదే సిసలైన ఆరంభం అని జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదని, కేంద్ర బీజేపీ చెపుతూ, ఆంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఆదివారం కేంద్రం వైఖరిపై ఘాటుగా ట్వీట్ చేశారు.
ఆర్ధిక సంఘం నిషేధం విధించిందని ప్రత్యేక హోదాపై తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోర్టేట్ ఆఫ్ పవర్ గ్రంధకర్త ఎన్.కె.సింగ్ ప్రత్యేక హోదాకు ఫైనాన్స్ కమిషన్ లు అడ్డంకి కాదని తేల్చి చెప్పారని వివరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని స్పష్టంగా ఎన్.కె.సింగ్ పేర్కొన్నారని జేడీ తన ట్వీట్ లో చెప్పారు.
పోర్టేట్ ఆఫ్ పవర్ పుస్తకాన్ని కొని, 228 పేజీలో ఆయన రాసిన పంక్తులను పార్లమెంటులో మన ఎంపీలు బిగ్గరగా అరిచి చెప్పాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. ప్రజలు, ప్రజాసంఘాలు, పార్టీలు, ప్రజాప్రతినిధులు అంతా ఐక్యంగా పోరాడితేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.