ఎన్నికల వరకు కృష్ణులు.. ఎన్నికల తర్వాత నికృష్టులా?

తనని ప్రోత్సహించే కృష్ణులు , కృష్ణారెడ్డిలని.. ఈయనేమో అర్జున్ రెడ్డి అని అనుకుంటున్నారా?
ప్రతివారికి మనస్సాక్షి .. జగన్మోహన్ రెడ్డికి మాత్రం సాక్షి దినపత్రిక
చెట్ల వల్ల ప్రాణభయం ఎందుకో అర్థం కాలేదు
మద్యం అలవాటు ఉన్న ఒక్కొక్కరిపై 60 వేల రూపాయల అదనపు భారం
జగన్ వ్యాఖ్యలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా

 

ఎన్నికల వరకు కృష్ణుల్లా కనిపించే ప్రజలు ఆ తరువాత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నికృష్టుల్లా కనిపిస్తారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘు రామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డి గొర్రెల కాపరి పాత్రలోకి మారిపోయి, ప్రజలందరినీ గొర్రెలని భావిస్తారని మండిపడ్డారు . అందుకే ఆయన అందరి నెత్తిన చేతిని పెడుతుంటారన్నారు.

ప్రజలంతా శ్రీకృష్ణులని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి తనని తాను అర్జునుడితో పోల్చుకుంటున్నారన్న ఆయన, తనని ప్రోత్సహించే కృష్ణులు , కృష్ణారెడ్డిలని ఈయనేమో అర్జున్ రెడ్డి అని అనుకుంటున్నారా? అంటూ ప్రజలు అపహాస్యం చేస్తున్నారన్నారు.ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…

ఎన్నికల వరకైనా ఎమ్మెల్యేలను నికృష్టుల్లా కాకుండా కృష్ణుల్లా చూసుకోవాలన్నారు.

అడిగిన సమయంలో వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని వైయస్ అర్జున్ రెడ్డిని కోరుతున్నానని అపహాస్యం చేశారు. పురాణ ఇతిహాస పాత్రలను అపహాస్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతరులను కౌరవులుగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.

జగన్మోహన్ రెడ్డి మాటలను విశ్వసించడానికి ప్రజల సిద్ధంగా లేరు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను విశ్వసించడానికి ప్రజల సిద్ధంగా లేరని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 99% హామీలను పూర్తి చేసి మీ బిడ్డ ఓట్లు అడగడానికి వస్తున్నాడని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడితేనే ఓట్లు వేయమని మహిళలను కోరడం విచిత్రంగా ఉంది. గతంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అత్యంత పారదర్శకంగా ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ రియంబర్స్మెంట్ ను కాలేజీ యాజమాన్యాలకు చెల్లించేవారు.

ఫీజు, హాస్టల్ రీయింబర్స్మెంట్ చెల్లింపులో ఆరు నెలల పాటు ఆలస్యం అయినప్పటికీ, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధించేవి కావు. విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లను అందజేసేవని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో చూసుకోమని ఓట్లు వేయాలని చెత్త, సొల్లు వాగుడు వాగుతున్నారు. విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి నాలుగు విడతలుగా డబ్బులు వేస్తే , వారి కాలేజీ యాజమాన్యానికి ఫీజులు చెల్లించాలట. తల్లుల ఖాతాలలో డబ్బులు పడగానే, ఆ డబ్బుల కోసం భర్తలు, భార్యలను హింసించిన సంఘటనలే అధికమని మహిళలు అంటున్నారు.

గతంలో 50 రూపాయలకు లభించే క్వాటర్ మద్యం సీసా ధరను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 200 రూపాయలకు పెంచారు . తమ ఖాతాలలో డబ్బులు పడగానే వాటిని చూసి మేమేమైనా శునకానందం పొందాలా జగన్మోహనా? అంటూ మహిళ లోకం ప్రశ్నిస్తోంది. గతంలో నేరుగా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించే ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ రియంబర్స్మెంట్ ను తల్లుల ఖాతాలలో జమ చేయడం వల్ల, మద్యం డబ్బుల కోసం వారు తమ భర్తల చేతుల్లో చావు దెబ్బలు తినేలా చేయడం మినహా, జగన్మోహన్ రెడ్డి వారికి చేసింది ఏమిటని మహిళా మణులు ప్రశ్నిస్తున్నారన్నారు.

జగన్మోహన్ రెడ్డి దొంగ బటన్ నొక్కినప్పటికీ, మహిళల ఖాతాలలో ఆరు నెలల వరకు డబ్బులు జమ కావడం లేదు. అయినా బటన్ నొక్కాను… బటన్ నొక్కానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ది మనోధైర్యమో, లేకపోతే బుద్ధిహీనతో అర్థం కావడం లేదు. మనోధైర్యం అని అంటేనే సూటబుల్ గా ఉంటుందని, ఆయన మనోధైర్యానికి నా జోహార్లన్న రఘురామ కృష్ణంరాజు, జనాలు గుడ్డిగా తన మాటలను విశ్వసిస్తారని భావిస్తున్న ఆయన గుడ్డి నమ్మకానికి నా హాట్సాఫ్ అని చెప్పారు.

ప్రతివారికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందని, జగన్మోహన్ రెడ్డికి మాత్రం సాక్షి దినపత్రిక ఉన్నది కానీ మనస్సాక్షి లేదన్నారు. తమ బ్యాంకు అకౌంట్లను చూసుకొని ఏ ఒక్క మహిళ, ఓటు వేస్తుందని నేను అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి మాయలో మహిళలు ఎవరూ పడరనే నేను అనుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

ప్రభుత్వ ధనంతో ఏలూరు సమీపాన సిద్ధం సభ

ప్రభుత్వ ధనంతో ఏలూరు సమీపాన ఏర్పాటు చేసిన సిద్ధం సభకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే సమయానికి ట్రాఫిక్ ను నిలిపివేశారు. నేషనల్ హైవే డివైడర్లను తవ్వారు. నేషనల్ హైవే డివైడర్లను తవ్వడానికి అనుమతి తీసుకోవలసి ఉండగా, అటువంటిది ఏమీ చేయలేదు. ఏపుగా ఎదిగిన చెట్లను నేలమట్టం చేశారు. ముఖ్యమంత్రి కున్న ప్రాణభయంతో ఇన్నాళ్లు చెట్లను కొట్టివేస్తున్నారని అనుకున్నాం. కానీ ఎక్కడో హెలికాప్టర్లో దిగే జగన్మోహన్ రెడ్డి కి రోడ్డుకు ఇరువైపులా ఉండే చెట్ల వల్ల ప్రాణభయం ఎందుకో అర్థం కాలేదు.

చెట్ల మోడులపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలను ఏర్పాటు చేయడానికి, కొమ్మలను నరకడం దారుణం. కొమ్మలు విరిగిన చెట్ల పరిస్థితి రేపు ఈ ప్రభుత్వానికి రానుంది. చెట్ల మోడుల పై ఫోటోలను ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి అదే చెట్ల దుస్థితి ఎదురు కానుంది. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంత మంది మీ బిడ్డ కోసం వచ్చారని, సభికుల ఉద్దేశించి మీ బిడ్డ… మీ బిడ్డ అంటూ ఓ 200 సార్లు అని ఉంటారు. ఎందరికి ఆయన బిడ్డనో తెలియదు. జగన్మోహన్ రెడ్డి సొంత సహోదరిని వైకాపా కార్యకర్తలు వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డేమో ప్రజలందరికీ మీ బిడ్డనని చెప్పుకుంటున్నారు . ప్రజా బిడ్డ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మీకోసం 124 సార్లు బటన్ నొక్కానని, నాకోసం మీరు రెండుసార్లు బటన్ నొక్కలేరా అని ప్రశ్నిస్తున్నారంటూ రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు.

75 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలను, 25 పార్లమెంట్ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలను ఇవ్వడానికి రెండు సార్లు బటన్ నొక్కాలని, మీకు ఇంకా ఎక్కువే సంక్షేమాన్ని చేస్తానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీ… పార్లమెంట్ స్థానాల సంఖ్యను కూడా పేపర్ చూడకుండా చెప్పలేకపోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఒకపక్క ఆయన సోదరి , పిసిసి అధ్యక్షురాలు షర్మిల దడ, దడ బుల్లెట్ ట్రైన్ మాదిరిగా అనర్గళమైన ప్రసంగాన్ని చేస్తున్నారు. మరొకపక్క జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న పదాలకు కూడా పేపర్ చూస్తే తప్ప మాట్లాడలేని దుస్థితి నెలకొందని రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు.

నా అక్క, చెల్లెమ్మలు అంటున్న జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లి, తల్లిని ఎలా చూసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. తన సొంత చెల్లి, తల్లిని చూసుకున్నట్లే రాష్ట్రంలోని మహిళలందరినీ ఆయన చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి, అన్ని బస్సులను ఏర్పాటు చేసి… మూడు లక్షల మందికి మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చినప్పటికీ… ఇంత పేలవమైన సభనా? . అనుకున్నంత మంది జనం రాకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి అభినయం అనన్య అసాధారణమన్నారు.

సిద్ధం సభకు కేవలం 50 నుంచి 60 వేల మంది హాజరైనట్లు చెబుతున్నప్పటికీ, సభా ప్రాంగణంలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. సభకు హాజరైన వారికి మద్యం, డబ్బు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి బస్సులను ఎక్కించినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు మైక్ లో శబ్దం చేస్తుండగానే, సభికులు సభా ప్రాంగణాన్ని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా సభకు హాజరై, సభా ప్రాంగణానికి వెళ్లకుండా బస్సులో కూర్చుని మద్యం సేవిస్తున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోను మీడియా ప్రతినిధుల సమావేశంలో రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు.

హవ్వ… 99 శాతం హామీలను అమలు చేశారట..!

జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో 99% అమలు చేశానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఒక్క శాతం అమలు చేయకుండా ఎందులో వదిలివేశారో చెప్పాలన్న ఆయన, మధ్య నిషేధం కాకుండా నియంత్రణ అని మేనేజ్ చేద్దామని భావించినప్పటికీ ప్రజలు విశ్వసించనందుకు ఆ ఒక్క శాతాన్ని కేటాయించారా అంటూ అపహాస్యం చేశారు .

99 శాతం హామీలను అమలు చేశానని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం కంటే దగుల్బాజీ తనం మరొకటి లేదు. నవరత్నాలలో మద్య నిషేధానికి ఏ గ్రేడింగ్ ఇస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలి. నవరత్నాలలో ఒక్కొక్క దానికి 11% గ్రేడింగ్ ఇచ్చినా, కేవలం 89 శాతం మాత్రమే హామీలను అమలు చేసినట్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కోలుకోలేని విధంగా సందింటి రెడ్డి గారు అన్యాయం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని మూడున్నర ఏళ్ల పాటు ఎత్తేశారు.

ఆఖరికి కోర్టు జోక్యంతో ఇవ్వాలని నిర్ణయించి అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరును మార్చి జగనన్న విదేశీ విద్యా అని నామకరణం చేశారు. అంబేద్కర్ కు ఒక విగ్రహం పెట్టాం దానితో ఆయన సరిపెట్టుకుంటాడులే అనే ఉద్దేశంతో కాబోలు… అంబేద్కర్ పేరును తొలగించి, ఆ పథకానికి జగన్మోహన్ రెడ్డి తన పేరును పెట్టుకుని ఉంటారు. విదేశీ విద్య పథకానికి ఆఖరుకు కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అందుబాటులో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను జగన్మోహన్ రెడ్డి బ్రష్టు పట్టించారు. చివరకు కోర్టు ఆదేశాలతో మళ్లీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తరహాలో రాష్ట్రంలో కూడా పెళ్లి చేసుకున్న యువతులకు ఆర్థిక సహాయం 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతామని చెప్పారు. మూడున్నర ఏళ్ల పాటు వారికి రిక్త హస్తాన్ని చూపించారు. మూడున్నర ఏళ్ల తర్వాత కొత్త నిబంధనలను పొందుపరిచారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన యువతులకు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి, గత మూడున్నర ఏళ్ల నుంచి పెళ్లిళ్లు చేసుకున్న వారిలో పదవ తరగతి ఉత్తీర్ణులైన యువతులకు ఆర్థిక సహాయం చేస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఆసరా అనే పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఎస్సీలకు సహాయం చేస్తే, ఆ మొత్తాన్ని ఎస్సీ కార్పొరేషన్ లెక్కలలో చూపించారు. ఎస్సీ కార్పొరేషన్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులలో నుంచి ఈ మొత్తాన్ని లాగేస్తున్నారు. ఆసరా పథకం కింద 15 వేల రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేకంగా అందజేస్తానన్న జగన్మోహన్ రెడ్డి, వాళ్లకు ఇచ్చే స్కీమ్ నుంచి గుండు కొట్టించి అందజేయడం ఆశ్చర్యకరం. అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోని సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ అమలు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

ఇప్పటివరకు సిపిఎస్ రద్దు చేసింది లేదు… ఓ పి ఎస్ అమలు చేసింది లేదు. ప్రతి ఏడవది జనవరి ఒకటో తేదీన డీఎస్సీ ని నిర్వహిస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఆ మాటే మరిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల వారిని జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఇప్పుడు, 99 శాతం హామీలను అమలు చేశానని పేర్కొనడం సిగ్గుచేటని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.

బాదుడే బాదుడన్న జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువగానే ప్రజలను బాదారు

గత ప్రభుత్వం ప్రజలని పన్నుల భారంతో బాదుడే బాదుతోందన్న జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను బాదుతోన్న తీరు మామూలుగా లేదని రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 8సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే , విద్యుత్ చార్జీలను పెంచబోనని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, అడ్డగోలుగా విద్యుత్ చార్జీలను పెంచడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించినప్పుడు తమ ఇంటికి వచ్చే విద్యుత్ బిల్లు ఎంత? ఇప్పుడు వస్తున్న విద్యుత్ బిల్లు ఎంత అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. అలాగే మద్యం సేవించే అలవాటు ఉన్న వారికి రోజుకు క్వార్టర్ చొప్పున తాగిన పడుతున్న అదనపు భారం ఎంతో లెక్క కట్టాలి. గత ప్రభుత్వ హయాంలో లభించే ధరకు, ప్రస్తుతం లభిస్తున్న ధరకు పోల్చి చూస్తే రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న ఒక్కొక్కరిపై 60 వేల రూపాయల అదనపు భారం పడుతుంది. ముఖ్యమంత్రి అమ్మబడి, చెల్లి జడ అంటూ ఎంతగా ఒక కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఏడాదికి 30 నుంచి 40 వేల రూపాయలు లభించడం లేదు. ఒకవేళ అదే కుటుంబంలో ఎవరైనా పెన్షన్ కు అర్హులైతే, వారికి అదనంగా మరో 30 వేల రూపాయలు లభిస్తుంది.

ప్రజలకు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని అంతా మద్యం ద్వారానే తిరిగి రాష్ట్ర ప్రభుత్వం వారి వద్ద నుంచి రెండింతలు ఎక్కువగానే దోచుకుంటుంది. విద్యుత్ బిల్లులు, మద్యం దోపిడీ మాత్రమే కాకుండా, ప్రతి ఏటా ఇంటి పన్నులను 15% పెంచాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా చెత్త పన్ను ఉండనే ఉంది. రాష్ట్రంలో ఆస్తుల విలువలు పడిపోయినప్పటికీ, రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రం అమాంతం పెంచి వేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 31,800 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడిచిపెట్టకుండా దోచుకున్నదని రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు.

జగన్మోహన్ రెడ్డి తీరు చూసి తల పట్టుకున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయోగించారని తెలుసుకున్న కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తల పట్టుకున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అంగన్వాడీలు గౌరవ వేతనంతో పని చేసే ఉద్యోగులని పార్లమెంటులో కేరళకు చెందిన ఎంపీ ప్రేమ్ చంద్రన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.

అయితే, రాష్ట్రంలోని అంగన్వాడీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన విషయాన్ని వ్యక్తిగతంగా ఆమెను కలిసిన సమయంలో నేను చెప్పాను. దానికి నేను ఏమి చెప్పగలనని… రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం విషయ పరిజ్ఞానం ఉండాలి కదా అని ఎదురు ప్రశ్నించి స్మృతి ఇరానీ, తల పట్టుకున్నారన్నారు

 

Leave a Reply