Suryaa.co.in

National

అద్వానీ…. బయటకు ఎలా కనిపిస్తారో..లోపల కూడా అంతే

‘భారతరత్న’ అందుకుంటున్న సందర్భంలో అద్వానీ గురించిన ఓ రెండు ముక్కలు (వినయ్ సీతాపతి రచన ఆధారంగా)

ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన ఏడాది తరువాత వాజ్ పేయి క్రియాశీలక రాజకీయాల నుంచి మెల్లగా తప్పుకోసాగారు. 2004 ఎన్నికల తర్వాత అద్వానీ మరోసారి పార్టీ అధ్యక్షులు అయ్యారు. 2005లో ఆయన తన పుట్టిల్లు నగరం పాకిస్తాన్లోని కరాచీ కి వెళ్లారు.అక్కడ ఆయన మహమ్మద్ అలీ జిన్నా స్మారక ఉద్యానవనాన్ని సందర్శించారు.జిన్నాని “హిందూ _ ముస్లిం ఐక్యతకు రాయబారి” అని అభివర్ణించారు(వాజ్ పేయి కి మల్లే లిబరల్ గా కనిపించడం అవసరం అని అనుకున్నారో,మరేమో గానీ).

ఇదే భావాన్ని వాజ్ పేయి అయితే సుతిమెత్తని, శ్రావ్యమైన కవితలో వినిపించేవాళ్ళు.కానీ అద్వానీ వాజ్ పేయి ‘వాద్యపరికరం’ లా తన వాద్యాన్ని వాయించాలని అనుకున్నారు. కానీ జరిగిందేమిటి ? అద్వానీని వెన్నుపోటుదారుడు అని ఆర్ఎస్ఎస్ ముద్ర వేసింది. పార్టీ పదవికి రాజీనామా చేయమంది. ‘వెన్నుపోటు దారుడు’ అని పిలిపించుకోవడం పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన ఒక సింధీ శరణార్థకి మరణం కన్నా దుర్భరం.”ఇవి నా రాజకీయ జీవితంలో అత్యంత దుర్భరమైన క్షణాలు”అన్నారు అద్వానీ.అయినా 2009 సార్వత్రిక ఎన్నికలు అద్వానీ నాయకత్వంలోనే వెళ్ళింది బిజెపి.ఓటమికి గురైంది.

2014 సార్వత్రిక ఎన్నికలకు బిజెపి పార్టీ ప్రచార సారధిగా నరేంద్ర మోడీ నియామకంతో పార్టీలో పెను పరిణామం చోటుచేసుకుంది.ఒకప్పటి జనసంఘ్ పార్టీ నుంచి ఇప్పటి భారతీయ జనతా పార్టీ దాకా పార్టీలో అనేక క్రియాశీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన లాల్ కృష్ణ అద్వానీ, పార్టీలో తన అన్ని పదవులకు రాజీనామా చేశారు.

ఆ రాజీనామా లేఖలో ఇలావుంది….

“గత కొంతకాలంగా పార్టీ పనిచేస్తున్న తీరుతోనూ,పార్టీ పయనిస్తున్న దిశతోను నేను కలిసి పని చేయటానికి ఇబ్బంది పడుతున్నాను.డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీన్దయాల్ జీ నానాజీ దేశముఖ్, అటల్ బిహారీ వాజ్ పేయిజీ తీర్చిదిద్దిన ఉన్నత సిద్ధాంతం కలిగిన పార్టీ ఇదే అని ఇప్పుడు నాకు అనిపించడం లేదు.ఏ పార్టీకైతే ఒకప్పుడు దేశ సౌభాగ్యం,ప్రజాశ్రేయస్సు మాత్రమే అంతిమ లక్ష్యమో ఆ పార్టీలా ఇప్పుడు బిజెపి నాకు కనిపించడం లేదు.మన నాయకుల్లో చాలామందికి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల లక్ష్యాలే పార్టీలో కనిపిస్తున్నాయి…”

అద్వానీకి పార్టీ వదిలి వెళ్ళవద్దని ఎన్నో రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.అద్వానీని గౌరవప్రదమైన స్థానంలో పార్టీ చూసుకుంటుందని(ప్రధాన మంత్రి పదవికి మోడీ అభ్యర్థిత్వం తప్ప)సంఘ్ పరివార్ నాయకులు చెప్పి చూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది.

ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎల్ కె అద్వానీకి,మురళీ మనోహర్ జోషికి పార్టీ టిక్కెట్ లభించలేదు.
పార్టీ కొంతమంది చేతులలో బందీ అయిపోయిందని వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో చెప్పినప్పటికీ,బహిరంగ విమర్శ చేయలేదు.మోడీ, షా మాత్రం వాళ్ల మనసులో ఏమున్నప్పటికీ బహిరంగంగా అద్వానీ,జోషి వంటి పెద్దలందరి పట్ల గౌరవం ప్రదర్శిస్తూ వచ్చారు.మోడీ ప్రధానమంత్రి అయిన ఏడాది తర్వాత భారత దేశంలో అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో వాజ్ పేయి ని ప్రభుత్వం గౌరవించింది.ఇక ఇప్పటికి అద్వానీ వంతుగా !

* వాజ్ పేయి ఆకర్షణలలో పడటం చాలా తేలిక.ఆయన త్వరగా సమ్మోహన పరుస్తాడు. కానీ అద్వానీ పట్ల ఆకర్షణ పెంచుకోవడం కష్టం.ఆయన రంగు రుచి వాసనా లేని దివ్యామృతం లాంటివారు. అందుకు బహుశా ఒక కారణం వాజ్ పేయితో పోలిస్తే, అద్వానీ అత్యంత క్రమశిక్షణ గల సైనికుడు.రాజకీయంగా వాళ్లకు వ్యతిరేకైనా, ఒక కాంగ్రెస్ నాయకుడు బయటకు తెలియని ఒక విషయం చెప్పాడు…
“అద్వానీ కన్నా వాజ్ పేయి మంచి నటుడు.వాజ్ పేయి కన్నా గొప్ప నటుడు మోడీ.కానీ అద్వానీ విషయం వేరు.ఆయన బయటకు ఎలా కనిపిస్తారో..లోపల కూడా అంతే” అని.

 

LEAVE A RESPONSE