Suryaa.co.in

Telangana

బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సింగరేణి జాగృతి రైల్ రోకో పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 17న రైల్ రోకో నిర్వహించిన తీరుతామన్నారు. సోమవారం తన నివాసంలో సింగరేణి జాగృతి రూపొందించిన రైల్ రోకో పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.

బీసీ సమాజం, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ, కౌన్సిల్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు వేర్వేరు బిల్లులు పాస్ చేసిందన్నారు. ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన రైల్ రోకో చేసి తీరుతామని తేల్చిచెప్పారు.కార్యక్రమంలో సింగరేణి జాగృతి నాయకులు వెంకట్, నరేశ్ నేత, శ్రీనివాస్, భువనచంద్ర, సిద్దిఖ్ షేక్, అనిల్, శ్రీకాంత్ రెడ్డి, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కాలరీస్ సంస్థలో ఇంటర్నల్ సర్వేయర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సింగరేణిలో పని చేస్తున్న కార్మికులు సర్వేయర్ కోర్సు పూర్తి చేసి డీజీఎంఎస్ నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారని తెలిపారు.

భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా, పట్టణాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం ఆ ఐదు గ్రామాల ప్రజలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని తెలిపారు. ఐదు గ్రామాలను విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ ఇవ్వడాన్ని ‘ఎక్స్’ వేదికగా స్వాగతించారు.

2014లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ చీకటి ఆర్డినెన్స్ ఇచ్చిందని, దీంతో భద్రాచలం పట్టణానికి పక్కనే ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్టణం, గుండాల గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయని తెలిపారు. ఫలితంగా భద్రాచల శ్రీ సీతారామ స్వామి ఆలయ భూములు ఏపీలోకి వెళ్లిపోయాయి, ఐదు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం సహా ఇతర అవసరాల కోసం నిత్య నరకం అనుభవిస్తున్నారని అన్నారు.

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి 8 మంది మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE