Suryaa.co.in

Telangana

సోలార్ విద్యుత్ పై కేంద్ర సర్కారు కక్ష

-నిలిచిపోయిన 40 గిగావాట్ల ప్రాజెక్టులు
-భవిష్యత్ లో సబ్సిడీలు పూర్తిగా ఎత్తేసే కుట్రలు
-( వై.సతీష్ రెడ్డి , తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ )

పునరుత్పాధక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాల్సిన కేంద్రప్రభుత్వం.. దాన్ని పూర్తి పక్కనపెట్టే కుట్రలు చేస్తోంది. పునరుత్పాధక శక్తిలో ప్రధానమైన సోలార్ విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు కేంద్ర సర్కారు కుట్రలు చేసినట్టుగా కనిపిస్తోంది. సోలార్ విద్యుత్ పరికరాల మీద ట్యాక్సులు, సుంకాలు పెంచుతూ ఆసక్తి ఉన్న వినియోగదారులన సోలార్ కు దూరం చేస్తోంది.

మోడీ సర్కారు సోలార్ పరికరాల మీద జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచింది. తర్వాత సోలార్ పరికరాల మీద దిగుమతి సుంకాన్ని పెంచింది. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ పై ఇచ్చే సబ్సిడీని తగ్గిస్తూ పోతున్నది. ప్రస్తుతం గృహ వినియోగానికి ఒక కిలోవాట్ పీక్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే 21,320 రూపాయల సబ్సిడీ ఉంది. కానీ ఈ నెల 15 తర్వాత అది 14,588 రూపాయలకు తగ్గిపోనుంది. 5కిలోవాట్ పీక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం 74,560 రూపాయల సబ్సిడీ ఉంది.

ఈ నెల 15 తర్వాత అది 58,352కు తగ్గనుంది. అంటే దాదాపు 16,208 రూపాయల భారం వినియోగదారులపై పడనుంది. అదే 10 కిలోవాట్ పీక్ సోలార్ వ్యవస్థకి ప్రస్తుతం 1,21,160 రూపాయల సబ్సిడీ వస్తుండగా.. ఈ నెల 15 తర్వాత అది 94,822 రూపాయలకు తగ్గనుంది. అంటే వినియోగదారులపై 26,338 భారం పడనుంది. అపార్ట్ మెంట్లకు ప్రస్తుతం కిలోవాట్ పీక్ సోలార్ వ్యవస్థకు 10,660 రూపాయల సబ్సిడీ ఉంది.

కానీ ఈ నెల 15 తర్వాత అది 7,294 రూపాయలకు పడిపోనుంది. 3 కిలోవాట్ పీక్ ప్యానల్స్ కి 28,680 రూపాయల సబ్సిడీ ఉండగా… ఈ నెల 15 తర్వాత అది 21,882 తగ్గనుంది. ఇది వినియోగదారులకు తీవ్ర భారం కానుంది. కేంద్ర ప్రభుత్వ తీరుతో ఇప్పటికే సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారు. కరోనాకు ముందు సోలార్ ప్యానల్స్ పై అదనపు భారం లేదు. కానీ కరోనా కారణంగా ఆ సమయంలో పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత గతేడాది కేంద్రం జీఎస్టీతో పాటు, దిగుమతి సుంకం పెంచింది. దీంతో ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి. ధరాభారంతో ప్రస్తుతం దాదాపు 40 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఫలితంగా 2022 వరకు 175 గిగావాట్ల పునరుత్పాధక శక్తిని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది.

రెన్యూయెబుల్ ఎనర్జీని ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇలా ట్యాక్సులు పెంచేసి, సబ్సిడీలు ఎత్తేసి సోలార్ విద్యుత్ ను పూర్తిగా తొక్కేసే ప్రయత్నం చేస్తోంది. ఓ వైపు పునరుత్పాధక శక్తికి కోత పెడుతూ.. మరోవైపు సోలార్ విద్యుత్ ఎగుమతి చేస్తామని కేంద్రం ప్రగల్బాలు పలుకుతోంది. దేశీయంగా తయారీదారులను ప్రోత్సహించేందుకే ట్యాక్సులు పెంచుతున్నామని కేంద్రం సాకులు చెబుతోంది. కానీ.. అంతిమంగా ఇది వినియోగదారుడిపై తీవ్ర భారం మోపుతోంది. ట్యాక్సుల కారణంగా పరికరాల ధరలు పెరిగి, సబ్సిడీ కూడా తగ్గుతుండటంతో సోలార్ వినియోగదారులు దూరమయ్యే ప్రమాదముంది.

పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఇలా సోలార్ విద్యుత్ కు అడ్డంకులు సృష్టించి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. మరో రెండు మూడేళ్లలో సోలార్ పై పూర్తిగా సబ్సిడీ ఎత్తేసే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి. పునరుత్పాధక శక్తిలో అతి ముఖ్యమైన సోలార్ ను ప్రోత్సహించేలా సబ్సిడీని పెంచాలి. జీఎస్టీ, దిగుమతి సుంకాలను వెంటనే తగ్గించాలి.

LEAVE A RESPONSE