Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు రైల్వేశాఖ పచ్చజెండా

– సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు
– విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్‌
– కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయింపులు రూ.560 కోట్లకు పెంపు
– రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

న్యూ ఢిల్లీ : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌, వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. కడప-బెంగుళూరు రైల్వేలైన్‌ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాటా డిపాజిట్‌ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌, వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.

కొత్త రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ఈ అంశంపై రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు డీపీఆర్‌ సమర్పించాక కొత్త రైల్వేజోన్‌, రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటుకు పరిధి, ఇతర అంశాల గురించి చాలా విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఈ అంశాలను లోతుగా పరిశీలించడానికి సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటుచేశాం.

కొత్త జోన్‌ ఏర్పాటుకు ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళికలు చేపట్టాలని విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే ఓఎస్డీకి నిర్దేశించాం. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయ సముదాయం నిర్మాణానికి భూమిని ఎంపిక చేశాం. మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడానికి వీలుగా భూసర్వే, ప్రధాన కార్యాలయ సముదాయం లేఅవుట్‌, నివాస సముదాయ కాలనీ, ఇతర ముందస్తు నిర్మాణ పనుల ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని రైల్వేశాఖ నిర్దేశించింది.

పరిపాలన, నిర్వహణ అవసరాలతో పాటు ఇతరత్రా హేతుబద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడున్న దక్షిణమధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్‌, ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది’అని రైల్వేమంత్రి తెలిపారు.

2013-14లో రూ.110 కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయింపులను తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.178.35 కోట్లు కేటాయించి రూ.171.2 కోట్లు ఖర్చుచేసినట్లు వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం 7 ఎకరాల భూసేకరణలో ఆలస్యం చేయడం వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందన్నారు. ఆ భూమిని గత ఏడాది నవంబరులో రైల్వేకి అందించినట్లు వెల్లడించారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ వల్లా పనులు తీవ్రంగా ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఎప్పటికప్పుడు ఇక్కడ ఓవర్‌హాలింగ్‌ చేయనున్నట్లు వెల్లడించారు.

దక్షిణ మధ్య రైల్వేలో నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలు 16,878, గెజిటెడ్‌ ఉద్యోగాలు 34 ఖాళీగా ఉన్నట్లు రైల్వేమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3,01,414 నాన్‌గెజిటెడ్‌, 2,519 గెజిటెడ్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.

LEAVE A RESPONSE