చైర్మన్ గారూ.. జే మద్యం బ్రాండ్లపై చర్చకు అనుమతి ఇవ్వండి

Spread the love

– ఏపీ కౌన్సిల్ చైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీల లేఖ
– సారాక్షసి, జే బ్రాండ్ల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శాస‌న‌మండ‌లిలో ప్రభుత్వం చర్చకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ కి లేఖ రాసిన టిడిపి ఎమ్మెల్సీలు
– జే బ్రాండ్లలో ప్రజలు ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టులు ఛైర్మన్ కి అందజేసిన టిడిపి ఎమ్మెల్సీలు

ఏపీని కుదిపేస్తున్న జే బ్రాండ్ మద్యం బ్రాడ్ల నాణ్యత, అవి తాగితే ప్రాణాలకే ప్రమాదకరమంటూ వచ్చిన ల్యాబ్ రిపోర్టు నివేదిక నేపథ్యంలో.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా దానిపై చర్చకు అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌కు లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం..

గౌరవనీయులు
శ్రీ మోషేన్ రాజు గారు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్
అమరావతి

విషయం: సారాక్షసి, జే బ్రాండ్ల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శాస‌న‌మండ‌లిలో ప్రభుత్వం చర్చకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని మనవి.

అధ్య‌క్షా!
మ‌న రాష్ట్రంలో ఇటీవ‌ల క‌ల్తీ సారా, జే బ్రాండ్ల కారణంగా మ‌ర‌ణాలు విప‌రీతంగా సంభ‌విస్తున్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలోనే వారం రోజుల్లో 28 మందికి పైగా సారా తాగేవాళ్లు మృతి చెందారు. ఏలూరు ప్రభుత్వ ఆస్ప‌త్రిలోనూ జే బ్రాండ్ ప్ర‌మాద‌క‌ర మ‌ద్యం తాగిన వారు చికిత్స పొందుతున్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.

మ‌ద్య‌నిషేధం హామీతో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం వ్యాపారం ఆరంభించ‌డం, ఈ ఏడాది ఏకంగా సుమారు రూ.24,000 వేల కోట్ల రూపాయ‌లు మ‌ద్యంపై ఆదాయం రాబ‌డుతోంది. పిచ్చిమ‌ద్యం అత్య‌ధిక ధ‌ర‌ల‌కి అమ్ముతుండ‌డంతో నిరుపేద‌లు సారాకి అల‌వాటు ప‌డి ప్రాణాలు తీసుకుంటున్నారు. వేల కుటుంబాల‌లో చీక‌ట్లు నింపుతోన్న క‌ల్తీసారా, జే బ్రాండ్ ప్ర‌మాద‌క‌ర మ‌ద్యం మ‌ర‌ణాల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని 4 రోజులపాటు సభలో మా స‌భ్యుల‌మంతా క‌లిసి నిల‌బ‌డే పోరాడిన సంగ‌తి త‌మ‌రు చూశారు.

ప్ర‌భుత్వం స‌హ‌జ మ‌ర‌ణాలంటూ చ‌ర్చ నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తోంది. సారా విక్ర‌య‌దారుల‌పైనా, త‌యారీదారుల‌పై ఓ వైపు కేసులు పెడుతూ …మ‌రోవైపు అస‌లు సారాయే లేద‌ని చెప్ప‌డం స‌భ‌ని
tdp-mlcsత‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మేన‌ని మేము భావిస్తున్నాం. సారాసురుల ధ‌న‌దాహానికి సామాన్యులు బ‌లైపోతుంటే, మ‌హిళ‌ల పుస్తెలు తెగుతుంటే మాన‌వ‌త్వం లేకుండా స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారే అవి సాధార‌ణ మ‌ర‌ణాలంటూ సూత్రీక‌రించ‌డంతో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

సారా, జే బ్రాండ్ల మ‌ద్యం మృతుల పోస్ట్ మార్టం నివేదిక‌లు వెల్ల‌డించాల‌ని, మృతుని కుటుంబానికి 25 ల‌క్ష‌లు చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని, సారా, జే బ్రాండ్ల మ‌ర‌ణాల‌పై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాల‌ని మేము స‌భ‌లో డిమాండ్ చేశాం. ప్ర‌జ‌ల ప్రాణాలు, ల‌క్ష‌ల కుటుంబాల జీవితాల‌ను దృష్టిలో పెట్టుకుని త‌మ‌రు ద‌య‌తో చ‌ర్చ‌కి అవ‌కాశం ఇవ్వాల‌ని విన్న‌విస్తున్నాము. క‌ల్తీ సారా, జే బ్రాండ్ల ప్ర‌మాద‌క‌ర మ‌ద్యంతోనే మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌నే అన్ని ఆధారాలు మేము సభ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాము.

ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధి చూపిస్తే…డేంజ‌ర్ లిక్క‌ర్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు ప్ర‌తిప‌క్షంగా మేమూ స‌హ‌క‌రిస్తాం. శాస‌న‌స‌భ‌లోనూ, శాస‌న‌మండ‌లిలోనూ సారా మ‌ర‌ణాల‌పై మేము చ‌ర్చ‌కి ప‌ట్టుబ‌ట్టిన త‌రువాత

10వ తేదీ నుంచి 14వ తేదీ వ‌ర‌కూ ఐదురోజుల‌పాటు స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిపిన దాడుల్లో సారా విక్ర‌యం, త‌యారీపై 1129 కేసులు న‌మోదు చేసి 677 మంది నిందితులని అరెస్టు చేశారంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో త‌మ‌రు దృష్టి సారించాల‌ని కోరుతున్నాము.
ఎస్ఈబీ దాడుల్లో 5,76,710 లీట‌ర్ల బెల్లం ఊట ,13,471 లీట‌ర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారంటే రాష్ట్రంలో సారా ఏరులై పారుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ముఖ్యమంత్రి జగన్ గారి సొంత ఊరు పులివెందుల నియోజకవర్గంలో 2021 జనవరి నుండి ఇప్పటి వరకూ సారా విక్రయదారులపై 300 కేసులు నమోదయ్యాయి అంటే సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయాన్ని మీ ద్వారా సభకి, రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలని అనుకుంటున్నాం.

ప్రజా హితం కోరి ఒక సామజిక కార్యకర్త బయటపెట్టిన వాస్తవాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్ముతున్న జే బ్రాండ్స్ కి చెందిన సెలబ్రిటీ, గ్రీన్ ఛాయస్, రాయల్ సింహ, ఛాంపియన్, ఓల్డ్ టైమర్ అనే ఐదు బ్రాండ్లను పేరుగాంచిన చెన్నైకి చెందిన ఎస్జిఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డీప్ కెమికల్ అనాలిసిస్ చేయించగా విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి. వోల్కెనెనిన్(Volkenin) అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనంతో పాటు బెంజోక్వినోన్, స్కోపరోన్, పైరోగల్లోల్, డైమెథాక్సిసిన్నమికాసిడ్ లాంటి ఇతర ప్రమాదకరమైన రసాయనాలు గుర్తించినట్టు తేలింది.

సైనైడ్ గా మారే అత్యంత ప్రమాదకరమైన వోల్కెనెనిన్(Volkenin) అనే రసాయనం అన్ని జే బ్రాండ్ల లో ఉండటం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అతి పెద్ద స్కామ్ ని బయటపెడుతోంది. వోల్కెనెనిన్(Volkenin) రసాయనం ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ప్రమాదకర రసాయనం వలన అసాధారణ స్థాయిలో గుండె కొట్టుకోవడం, అల్ప రక్తపోటు, వేగవంతమైన శ్వాస, వాంతులు, కడుపునొప్పి, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని రిపోర్టుల ద్వారా అర్ధమవుతున్నాయి.

సైనైడ్ గా మారే వోల్కెనెనిన్(Volkenin) అనే రసాయనం తీవ్ర ప్రభావం చూపించి ఆఖరికి మనిషి గుండెపోటుతో చనిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా అన్ని రిపోర్టులను మీ ముందు ఉంచుతున్నాం. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా, ల‌క్ష‌లాది కుటుంబాల్లో చీక‌ట్లు నింపుతున్న సారా, జే బ్రాండ్ల మ‌ద్యం స‌మ‌స్య‌పై శాస‌న‌మండ‌లిలో చ‌ర్చ‌కి త‌మ‌రు అనుమ‌తి ఇవ్వాల‌ని విన‌య‌పూర్వ‌కంగా కోరుతున్నాము.

ఇట్లు
తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు

Leave a Reply