నీ మైదానంలో నిదానమెక్కడ..!?

217

( పరిగెత్తే చలం కలం ఆగిన రోజు..04.05.1979)
నేనెరిగిన చలం..
జేబులో సొమ్ము లేకున్నా వివాదాలు
కొనితెచ్చుకునే వాడు..
ఏ విషయంపైనైనా మొహమాటం లేక చేతివాటం చూపే రాతగాడు
కష్టాలు కట్టలు తెంచుకుని
చుట్టుముట్టినా తన భావాల
పట్టాలు దాటక వాటితోటే
చెట్టాపట్టాలేస్తూ చరిత్రపుటల్లోకి ఎక్కిన గజఈతగాడు..!

కవితలు రాసే సిరా ఇలా..
శ్రీశ్రీ కలంలో ఎరుపు..
విశ్వనాథ ఘంటంలో తెలుపు..
దేవులపల్లి పెన్నులో
వలపు..
గురజాడదేమో మలుపు..
కాని..చలం కలంలో బలుపు!
అదో అర్థం కాని తెగింపు..
తనని అర్థం చేసుకోని
సమాజంపై ఏవగింపు!

తన ఆలోచనల మైదానంలో తానుగానే విహరించిన పిచ్చివాడు..
అతడి ప్రతి రచన
పిచ్చోడి చేతిలో రాయి..
కాని..కలికితురాయి..!
అలాంటి పిచ్చి ఆలోచనల
సంకలనం మ్యూజింగ్స్..
ఒకనాటి సమాజంలో
జన సమూహంలోని వికారాలకు
మాచింగ్స్..
వాటిని ఎండగడుతూనే
సాగింది అతగాడి ఇన్నింగ్స్!

ఎవరి పిచ్చి వారికి ఆనందం
కాని..చలం పిచ్చి
సాహితీ అభిమానులకు
బ్రహ్మానందం..
తన పిచ్చి చలాన్ని
ఒక్కోసారి దైవం వైపుగా..
మరోసారి దూషణం దిశగా..
ఇంకోసారి విపరీత భాషణం..
మొత్తంగా ఆయన కలం
మండే నిప్పు కణం!

స్త్రీని పుట్టించిన బ్రహ్మ కూడా
అర్థం చేసుకోనంత దగ్గరగా
చూసాడా అన్నట్టు..
స్త్రీమూర్తి కోసం
చలం స్వరం అంత బిగ్గరగా..
ఆయన కలంలో
ఆడది ఓ కలకలం..
స్వేచ్ఛామూర్తిగా వెలిగిపోవాలి కలకాలం..
ఆ కథల్లో ఆడదే హీరో..
సగం కథల్లో మగాడు జీరో..
అప్పుడప్పుడు నీరో కూడా!
చూస్తుండగానే
ఎదిగిపోయే స్త్రీ..
చేసేస్తుంటే పురుషుణ్ణి ఇస్త్రీ..
ఎంత సంబరపడిపోతాడో
ఈ కధల మేస్త్రీ..!

ఇలా ఉంటాయా ప్రేమలేఖలు
చలం పుట్టించిన
సీతాకోకచిలుకలు..
ఒక్కోటి ఒక్కో రకం..
చదవకపోతే నరకం..
చదువుతుంటే
అదోలాంటి తమకం..!
బూతా..
అలా అనుకోడమే బూతు..
అబ్బో..చలాన్ని
చదవాలంటే దడ..
చదవకపోతే అదో బెడద..
ఇలాంటి గడబిడ నడుమ
తలగడే కదా చలం
పుస్తకాలకు నీడ..
అటకే లైబ్రరీ..
దొరికిపోతే
అదో కాంట్రవర్సరీ!
మొత్తానికి
అవి ఓ ట్రెజరీ..
చాలా వరకు ట్రాజెడీ!!

మొండితనమే చలం..
మూర్ఖత్వమే బలం..
కష్టాల్ నష్టాల్ బాధల్..
వెలివేతల్.. వెలికితీతల్…
ఎన్ని ఎదురైనా
చలం అచంచలం..
ఇందుకు సాక్షి అరుణాచలం..
సేచ్చగా ప్రవహించే
గోదారి జలం..!!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286