త్యాగరాజు పాట..నీ నోట..!

(నేడు త్యాగరాజు జయంతి)
ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు..
సంగీత ప్రపంచంలో
ఎందరెందరు మహానుభావులున్నా
త్యాగయ్య..
ఓ పరంపర..
కీర్తనల తామర తంపర..
అజరామర!

పూవు పుట్టగనే..
అన్నట్టు చిరుప్రాయంలోనే
రాముని పట్టి విడువలేదు..
వాల్మీకి వలె మరా మరా
అని గాక రామా రామా
అనుచు తొంబది ఆరుకోట్ల
రామనామ జపం..తపం చేసి
సాక్షాత్తు ఆ రామునే
సాక్షాత్కారం చేసుకున్న
నాదబ్రహ్మ..ఈ త్యాగబ్రహ్మ!

నిధి చాలా సుఖమా..
రాముని సన్నిధి సుఖమా…
పాట..బ్రతుకు బాట
రామనామమై..
ఆ నామమే
జపమై..తపమై..
జీవమై…జవమై..
తన మనసే రాముని ఆరామమై..
రాముని దర్శనం
సాధించనే మనసా..
దుడుకు గల నన్నే పరీక్షిస్తావా..
పదేపదే జానకీపతిని
వేడి..కొనియాడి..
పాడి.. భక్తసులభుని
రప్పించి మెప్పించి
బంటు రీతి కొలిచిన
కృతి కర్త..
అంతటి రామయ్యే
కృతి భర్త!

తంజావూరులో జననం..
వింజామరతో గమనం..
రాముడే జీవనం..
ఆయనలోనే లీనం..
నిరంతరం అంతర్లీనం..
త్యాగయ్య కీర్తనల భాండాగారం..
దొరకునా ఇటువంటి సేవ..
నారదుడే చూపిన త్రోవ..
సాక్షాత్తు రామచరితము
రాసిన వాల్మీకి కోవ!

మధురానగరిలో చల్లలమ్మబోయి..
యదునందనుకే
గంధము పూసి..
తిలకము దిద్ది..
బంగారు చేలము కట్టి..
ముత్యాల ఆరతులెత్తి
రాజిత త్యాగరాజ వినుతునికి పూజలు చేసిన
కవిరాజు..మన త్యాగరాజు..
కీర్తనల వరదరాజు..!

జగమంతా ఆలపించే జగదానందకారక..
త్యాగయ్య విరచిత
తారకం..
అంతేనా..
ఈరోజున నువ్వూ..నేనూ..
మనందరం..
వచ్చినా..రాకున్నా పాడుకునే
కీర్తన..ఆ కవిరాజు ప్రేరకం..
భక్తి భావనల ఉత్ప్రేరకం..
త్యాగయ్య..తన్మయం..
చిదానందమయం…
ఆయన ప్రతి కృతి
రాముని సన్నుతి..
ఆదుకొమ్మని వినుతి..
మానవుని నిరతి..
రామయ్యకు హారతి..!
నీరాజనాలతో..

సురేష్ కుమార్
9948546286

Leave a Reply