Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు విలపించడం ఒక హైడ్రామా

– ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు విలపించడం ఒక హైడ్రామా అని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంతంగా జరుగుతున్న శాసనసభలో తొలుత టీడీపీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ని ఉద్దేశించి తల్లి – చెల్లి, బాబాయ్‌ – గొడ్డలి అంటూ కేకలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని వారించాల్సింది పోయి చూస్తూ ఉండిపోయారన్నారు.
సభలో భార్యను అవమానించారని చంద్రబాబు అంటున్నదే నిజమైతే అక్కడే చంద్రబాబు వెంటనే రియాక్ట్‌ అయ్యేవారని, సభలో నుంచి వాకవుట్‌ చేస్తూ చంద్రబాబు ఏమన్నారో వారి ఎమ్మెల్యే తీసిన వీడియో ద్వారా బయటకు వచ్చిందని తెలిపారు. అందులో ఆయన ఏమన్నాడు? తాను ముఖ్యమంత్రి అవుతానన్నాడు., అయితేనే సభలో కాలు పెడతానన్నాడు., అంటే చంద్రబాబుది అధికారానికి సంబంధించిన బాధ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు భార్య పేరును మా పార్టీవారు ఎవరూ ప్రస్తావించలేదని, గతంలో తన మామ ఎన్టీఆర్‌ను ఉపయోగించుకుని, చివరికి ఆయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ పదవి లాక్కున్న నైతికత చంద్రబాబు నాయుడిదని మండిపడ్డారు.
ఇప్పుడు సాక్షాత్తు తన భార్య భువనేశ్వరి పేరును వాడి, ఆమెను ఎవరో ఏదో అన్నారని డ్రామా ప్రారంభించింది చంద్రబాబు అని, బహుశా దేశ చరిత్రలో ఇలాంటి దుర్మార్గానికి ఇంతవరకు ఏ నాయకుడూ దిగజారి ఉండడని చెప్పారు. ఆధారాలు ఉంటే చూపాలని సవాల్‌ చేశారు. భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదని, మహిళలను గౌరవించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఆయన తెలియజేశారు.

LEAVE A RESPONSE