Suryaa.co.in

Andhra Pradesh

ఆడబిడ్డను దూషిస్తే చరిత్ర హీనులవుతారు

– దిగజారుడు రాజకీయాలకు వేదికగా అసెంబ్లీనా…??
– వైసీపీ నేతల వ్యాఖ్యలపై మహిళాలోకం భగ్గు
– మాజీ ఎమ్మెల్యే జీవీ సతీమణి గోనుగుంట్ల లీలావతి స్పందన
వినుకొండ: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా అసెంబ్లీలో వైసీపీ నేతలు ప్రవర్తించారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు తూలనాడటం… చంద్రబాబు కంటతడి పెట్టడంపై ఆమె శనివారం ఒక ప్రకటనలో స్పందించారు. ఏపీలో దిగజారుతున్న తాజా రాజకీయ విలువలకు నిన్నటి ఘటన అద్దం పడుతోందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమైన నందమూరి ఆడబిడ్డను దూషిస్తే చరిత్ర హీనులవుతారన్నారు. మహిళలను అసభ్యంగా అవమానిస్తే భవిష్యత్తులో ఏ ఆడబిడ్డ రాజకీయాల్లోకొస్తుందని ప్రశ్నించారు.
మహిళలు రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలనేది వైసీపీ కుట్రగా ఆమె చెప్పారు. సుదీర్ఘ కాలం రాజకీయ దిగ్గజంగా ఉన్న చంద్రబాబు నాయుడు కంటనీరు చూసిన ప్రతి కంటిలోనూ నీరుగారిందన్నారు. ఆయన గద్గద స్వరం విన్న ప్రతి మనసూ విలపిస్తుందన్నారు. కుటుంబం కంటే యావత్తు తెలుగు జాతికి, దేశానికి చంద్రబాబు చేసిన సేవలు గుర్తుకొచ్చి..నేడు ఆయన కంటే ఎక్కువగా ప్రతి మనసు గాయపడిందని లీలావతి తెలిపారు. ధర్మం తప్పిన సభలో వారించలేని సభాపతి.. ఉన్మాద నవ్వులతో వెకిలిగా ప్రవర్తించిన సీఎం తీరుకు ఆంధ్రరాష్ట్రమంతా విచారం వ్యక్తం చేస్తుందన్నారు.
వైసీపీ దిగజారుడు రాజకీయాలకు వేదికగా అసెంబ్లీని మార్చరారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కౌరవుల్లా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలపై కక్షను రాజకీయంగా తీర్చుకోవాలని.. ఇంట్లో మహిళలను కూడా వదలకుండా వ్యక్తిగత దాడి చేయడం సిగ్గుచేటన్నారు. మళ్లీ గెలిచాకే అసెంబ్లీలో అడుగుపెడతా, ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారంటే ఎంత ఆవేదనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థమవుతుందన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమని తెలిపారు.
రాష్ట్ర ప్రజలు వైసిపి చేస్తున్న అరాచకాలను నిశితంగా గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీని గెలిపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి, సగౌరవంగా శాసనసభకు పంపవలసిన అవసరం ఉందని గోనుగుంట్ల లీలావతి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE