Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు “స్కిల్డ్” క్రిమినల్

– స్కిల్ డెవలప్మెంట్ పేరిట రూ.350 కోట్లు కాజేశాడు
– స్కిల్ స్కాం కేడీని ఈడీ పట్టుకోవాలి
-ః గుడివాడ అమర్నాథ్ డిమాండ్

చంద్రబాబుది చీకటి చరిత్ర
– ఐటీ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై చంద్రబాబు నాయుడు పొంతన లేని సమాధానాలు చెబుతూ, అసలు విషయాన్ని దాటవేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలకు చంద్రబాబు సమాధానం ఇవ్వడం లేదు. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టమవుతోంది.

అలాంటప్పుడు ఐటీ నోటీసులకు ఎందుకు సమాధానం ఇవ్వరు. వేదికలెక్కి ప్రజలకు నీతులు చెప్పే చంద్రబాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి కదా. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై ఇంతవరకు ఆయన స్పందించలేదు. చంద్రబాబుది ఒక చీకటి చరిత్ర. చంద్రబాబు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన తీరు అలాంటిది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందు ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత?

అవినీతి పునాదుల మీద చంద్రబాబు ఎదిగారు
చంద్రబాబు జీవితం అంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతి. చంద్రబాబు రాజకీయంగా అవినీతి చేసి, వేల కోట్లు ఆస్తులు సంపాదించాడు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడిపైన ఇన్ని స్కాంలు, ఆరోపణలు వచ్చి ఉండవు. ఏలేరు స్కాం మొదలు స్టాంపుల కుంభకోణం, నేటి అమరావతి వరకు చంద్రబాబు కుంభకోణాల చిట్టా చాలా పెద్దది. మొదట్నుంచి చంద్రబాబు బ్యాక్‌ డోర్ పొలిటిషియన్‌. మామని వెన్నుపోటు పొడిచి, అధికారం లాక్కుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులే చంద్రబాబువి. దర్జాగా ఒక నాయకుడిగా చంద్రబాబు ఎదిగిన సందర్భాలు లేవు. నారావారి పల్లె నుంచి జూబ్లీహిల్స్ ప్యాలెస్ వరకు అవినీతి పునాదుల మీద చంద్రబాబు ఎదిగారు.

పైకేమో.. చంద్రబాబు గొప్ప గొప్ప మాటలు, నీతి సూత్రాలు, ప్రవచనాలు చెబుతారు. రాజకీయాల్లో తనకంటే సీనియర్‌ దేశంలోనే లేరని అంటాడు. అమరావతి కాంట్రాక్టులకు సంబంధించి, లంచాల రూపంలో రూ.118 కోట్లు చంద్రబాబు తీసుకున్నారని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ చెబుతుంటే.. ఎందుకు నోరు మెదపటం లేదు. ఎందుకు తేలు కుట్టిన దొంగలా దాక్కున్నాడు. ఎందుకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన నోటీసులపై చంద్రబాబు స్పందించట్లేదు. ఐటీ డిపార్ట్‌మెంట్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాక్కొని తిరుగుతున్నారు.

చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి తప్పుడు పనులు
అన్నాహజారే వారసుడినంటూ చెప్పుకునే చంద్ర బాబు.. ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరు. నిత్యం ప్రజలకేమో శ్రీరంగనీతులు చెబుతారు. చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో చూశాం. వ్యవస్థల్ని మేనేజ్‌ చేయటంలో చంద్రబాబు నైపుణ్యం ఎవ్వరికీ రాదు. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని లేఖలు రాస్తున్నారు.

ఇది నేను చేయలేదని, తనకు సంబంధం లేదని ఎందుకు చంద్రబాబు చెప్పట్లేదు. బాబూ.. మీరు దొరికి పోయారని మీకు బాగా తెలుసు. ఇప్పటి వరకు బయటకు వచ్చింది తీగ మాత్రమే.. ఇక డొంక కదలాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నేళ్ళుగా ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. ఆదాయపు పన్ను శాఖ ఆగస్టు 4న చంద్రబాబుకు 46 పేజీల షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసు తీసుకోవటానికి చంద్రబాబు నిరాకరించారు.

LEAVE A RESPONSE