Suryaa.co.in

Political News

చంద్రబాబు ఈ దేశ సంపద.. బాబు ఒక బ్రాండ్

మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం , 407 స్థానాలు సాధిస్తాం అని బీరాలు పలికిన బి.జె.పి ఎన్నికల ఫలితాలు రోజు చతికిల పడింది. దానితో షేర్ మార్కెట్ కుప్పకూలి మదుపర్ల ఆస్తి 31 లక్షల కోట్లు ఆవిరయ్యింది. మరుసటి రోజు బాబు అభయ హస్తం అందించడంతో ఒక్క సారిగా సూచీ పెరిగి, అది 51 లక్షల కోట్ల మేర లాభపడింది. అదే బాబు గారి సత్తా.

బాబు ఎక్కడుంటే అభివృద్ధి చెంతనే వుంటుంది. బాబంటే ఒక బ్రాండ్. బాబు ఈ దేశపు ఆస్తి , సంపద. తెలంగాణా దేదీప్యమానంగా వెలుగొంటున్నది అంటే దానికి కారణభూతుడు చంద్రబాబు. ఆయన వేసిన అభివృద్ధి అనే విత్తు నేడు మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించింది. తెలంగాణాను ఆర్థికంగా నిలబెడుతున్నది హైద్రాబాద్. అదే హైద్రాబాద్ అభివృద్ధికి బాబు కల్పించిన మౌలిక సదుపాయాలు కారణం.

తల్లి పిల్లల ఆకలి కడుపును ఎలా చూస్తుందో , నాయకుడు రాష్ట్ర, దేశ భవిష్యత్తును గమనిస్తూ ముందుచూపుతో వ్యవహరించాలి. రాబోయే కాలానికి 5,10,20,30 సం.లకు తగిన ప్రణాళిక వేసుకుని ఒక విజన్ తోటి ముందుకు సాగాలి. అలా ముందుకు సాగే నాయకుల్లో భారత్ లో ఒకే ఒక్కడు ఉన్నాడు , వారే చంద్రబాబు. హైద్రాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం కోసం కొండలు , గుట్టలు చదును చేసి నిర్మాణాలు కడుతుంటే అంతా ఎగతాళి చేశారు. ఐ.టి రాబోయే కాలాన్ని ఎలా శాసిస్తుందో ముందే ఊహించ గలిగాడు చంద్రబాబు. అలా రేపు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ప్రపంచాన్ని శాసించ బోతోందని కూడా తరచూ చెబుతున్నాడు.

ఒక దార్శనికుడి ఆలోచన భవిష్య తరాల గురించి ఆలోచిస్తుంది. ఎందుకు పనికిరాని నాయకుడే కులం , మతం , వర్గం అంటూ చీలికలు తెచ్చి పబ్బం గడుపుతూ వుంటాడు. తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచదేశాలకు ఐ.టి నిపుణులు వెళ్లి సేవలందిస్తున్నారు. అనేక ప్రసిద్ధ కంపెనీలకు సి.ఇ.ఓ లు అవుతున్నారు. వారు ఆర్థికంగా బలపడుతూ , ఆయా దేశాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తున్నారు. ఇదంతా ఒక దార్శనికుడి స్వప్నం. మానవాళిపై ఆయనకున్న నమ్మకం. అదే నేడు నిజమవుతున్నది.

మారుతున్న కాలాన్ని బట్టి ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వడం ఆయనకొక వ్యసనం. టెక్నాలజీని అన్ని రంగాల్లో ప్రవేశపెట్టడం , సేవలను చౌకగా అందుబాటులోకి తీసుకు రావడం ఆయన వృత్తి. రాజకీయ రంగమే తీసుకుంటే ఏ శాఖమీదయినా ఆయనకు పట్టు ఉంటుంది. దేనికెంత ఎంత బడ్జెట్ ఇచ్చామో , భవిష్యత్తులో ఎంత అవసరమో అన్నీ నోటి లెక్కలుగా చెప్పగలడు. ఇక పార్టీ పరంగా కొన్ని వేల మందిని పేర్లు పెట్టి పిలవగలడు.

ఏ నాయకుడూ నూటికి నూరు మందిని సంతృప్తి పరచలేడు. కులాల , ప్రాంతాల లెక్కల్లో కొందరిని పక్కన పెట్టక తప్పదు. దానితో కొందరు శత్రువులుగా మారతారు. టి.డి.పి అంటేనే ఒక రాజకీయ శిక్షణాలయం. రాజకీయ వేత్తలను తయారుచేసే ఒక పాఠశాల. దానికి ప్రిన్సిపాల్ చంద్రబాబు. కేంద్రంలో ఎన్నో కూటములు కట్టాడు. అనేక ప్రభుత్వాలను ఏర్పరచి, ప్రధానులుగా అందలం ఎక్కించాడు. తన శిష్యులు మంత్రులు , ముఖ్య మంత్రులయ్యారు. ఎంత చేసినా తన పరిధిలోనే తానుంటాడు.

ఇప్పటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 50 వేల నుండి 1 లక్ష లోపు మెజారిటీ వచ్చిన వారు 30 మంది , 20 – 50 వేల వరకు మెజారిటీ వచ్చిన వారు 94 మంది ఉన్నారంటే ఇది ఎలాంటి విజయమో అర్థం చేసుకోవచ్చు. అలాగే 10 – 20 వేల వరకూ మెజారిటీ వచ్చిన వారు 23 మంది ఉన్నారు. 5 – 10 వేల లోపు మెజారిటీ వచ్చిన వారు 12 మంది వున్నారు. వెయ్యి నుండి 5 వేల లోపు మెజారిటీ వచ్చిన వారు ముగ్గురు మాత్రమే వున్నారు. వెయ్యి లోపు వారు ఇద్దరంతే ఇద్దరు మాత్రమే ఉన్నారు. తక్కువ మెజారిటీ మడకశిర ( sc ) నుండి టి.డి.పి అభ్యర్థి ఎం.ఎస్. రాజు 351 ఓట్లతో గెలవగా , అత్యధిక ఓట్ల మెజారిటీ గాజువాక నుండి టి.డి.పి అభ్యర్థి పల్లా శ్రీనివాస రావు 95, 235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

ఇదంతా బాబును చూసే ఓట్ల వర్షం కురిపించారు. ఒక కసితో ఓట్ల సునామీ వెల్లువెత్తింది. బాబయితేనే రాష్ట్ర పాలనను గాడిలో పెట్టగలడు , ఇక ఎవరు వచ్చినా ఈ రాష్ట్రాన్ని రక్షించలేరు అనే ఒక భావన అందరిలో వచ్చింది. పైగా బి.జె.పి , జనసేన పొత్తు కూడా లాభించింది. కేంద్రంలో ఈసారి కూడా బి.జె.పి వస్తుంది అనే ప్రచారం చేసుకున్నా ఆంధ్రా ప్రజలు విశ్వసించలేదు.

6,7 % జనసేన ఓటర్లు మాత్రం అగ్నికి ఆజ్యం పోసినట్లు తోడయ్యారు. జనసేన విడిగా పోటీచేస్తే ఓట్లు 2 -3 % కు పడిపోయేది. కూటమిగా ఎన్నికల బరిలో నిలబడడంతో కొత్త శక్తి వచ్చినట్లయ్యింది. అదే జనసేన పీటీ చేసిన 21 + 2 గెలవడానికి కారణం. విడిగా పోటీచేస్తే మరలా పాత ఫలితాలే వచ్చేవి. గత 2019 ఎన్నికల్లో ఒకే ఒక్కసారి అంటున్నాడని , వై.ఎస్.ఆర్ పాలను గుర్తుచేసు కుని ఓట్లు కుమ్మరించారు. తరువాత గానీ వారికి పూర్తి సినిమా కనిపించింది.

బటన్లు నొక్కి డబ్బు పంపుతున్నా ఆ డబ్బు కనబడడం లేదు. డబ్బంతా ఎక్కడికి పోతున్నదో కూడా తెలియకుండా మాయం అవుతోంది అని మదనపద సాగారు. అదే జగన్మాయ అంటే. పది రూపాయలు ఇచ్చి వంద లాక్కోవడం. తాకట్టు పెట్టు కోవడానికి ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోతున్నాయి.

ఇక ప్రైవేటు ఆస్తులపై కన్ను పడిందని ప్రజలు భావించారు. ప్రతి వ్యక్తికీ సొంత భూమి మీద మమకారం ఉంటుంది. దాన్ని తన్నుకు పోవాలని చూసే ప్రయత్నాలు జరుగుతుంటే ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంతో ప్రజల్లో ఒక అభద్రతా భావం ఏర్పడింది. రేపు నివాస స్థలాలు , ఇళ్లను కూడా తాకట్టు పెట్టుకుంటారేమో అనే భయం సామాన్య ప్రజల్లో కలిగింది. అదే ఓట్ల రూపంలో ప్రజ్వరిల్లింది.

ప్రతి రోజూ పని పని అని చంద్రబాబు చావ గొడతాడు , హాయిగా ఉమ్మడి రాజధానిగా 10 సం.లు హైద్రాబాద్ వుంటే ఇక్కడకు తీసుకువచ్చి కూలిపని చేయిస్తున్నాడని 2014 నాటి ఉద్యోగులు భావించారు. ఎంత అడిగితే అంత ఫిట్ మెంట్ , ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చినా వారికి అవేమీ కనిపించ లేదు. తమ ఓట్లు కాక ఇతరుల ఓట్లుకూడా వై.సి.పి కి వేయించారు. కట్ చేస్తే , నేడు జీతం కూడా అడుక్కోవాల్సిన స్థితికి దిగజారిన పరిస్థితి. మింగలేక , కక్కలేక , ఎవరికీ చెప్పుకోలేక నరక యాతన అనుభవించారు.

మేమే ఎంతో మేధావులము , రాష్ట్రాన్ని ఒంటిచేత్తో నడుపుతున్నాం అనుకునే ఉద్యోగులు , అసలు తాము ఎలా మోసపోయాం , దేనికోసం మోసపోయాం అనేది వారికే అర్థం కాలేదు. వారిలో ఆవేశం , ఆక్రోశం కట్టలు తెంచుకుంది. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు పోలింగ్ సజావుగా నడిపించారు. ఒక్క ఓటు కూడా దొంగ ఓటు పోలవ్వకుండా చూశారు. బాలెట్ ఓట్లలో వారి ఓటింగ్ ప్రస్ఫుటంగా తెలిసింది.

ఇక పొత్తున్న బి.జె.పి చూస్తే అది రాజకీయాన్ని రాజకీ యంగానే చూస్తుంది. ఎత్తులు, జిత్తులు వేస్తుంది. ఆ విషయాన్ని బి.జె.పి పరివారం దాచుకోదు , బహిరంగంగానే చెబుతుంది. వాజ్ పాయ్ నాటి బి.జె.పి కాదిది. మోదీ బి.జె.పి ఇది. పక్తు రాజకీయ పార్టీ అని చెబుతారు. ఆవేశపరులు ఇంకొక అడుగు ముందుకు వేసి మోడీ ఉండగా పొత్తులే ఉండవు. సంకీర్ణ ప్రభుత్వాలు వుండవు. ఆ అవసరం , ఆ ఖర్మ మాకు లేదు అని ప్రకటిస్తారు. ఇక సోము వీర్రాజు లాంటి వారయితే చంద్రబాబును బి.జె.పి గడప తొక్కనివ్వం అని శపథం చేస్తారు.

ఇక ఇప్పటి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ లాంటి వారయితే 2019 లో మా ఓట్లన్నీ వై.సి.పి కి వేసాం అని ప్రకటిస్తారు. సిగ్గుండాలి ఇల్లాంటి మాటలు అనే చిత్తకార్తె నాయకులకు. ఒక్క శాతం ఓట్లు లేని బి.జె.పి , టి.డి.పి తో పొత్తు పెట్టుకుని టి.డి.పి ఓట్లతో ఎం.పి అయ్యి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యాక సోము వీర్రాజును వాటేసుకుని ఏడవడం కాదు , చంద్రబాబు కాళ్ళు కడిగి నీళ్ళు తలమీద జల్లుకోవాలి.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కే కాదు భారతదేశానికి ఒక ఆస్తి. భారతదేశం ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఎ.పి ప్రజలు కూడా ఆయన దార్శనికతను గుర్తించలేదు. ఎంతసేపూ ఎన్.టి.ఆర్ కు వెన్నుపోటు పొడిచాడు అంటూ ఆయన కారెక్టర్ ని డామేజ్ చేయడానికే చూశారు గానీ ఆయన ముందు చూపును , దేశం పట్ల ఆయనకు గల ప్రేమ , నిబద్ధత ను గుర్తించలేక పోయారు. ముఖ్యంగా 2019 లో ఎ.పి ప్రజలు ఆయన్ను ఓటమికి గురిచేయడం ఎ.పి ప్రజల దౌర్భాగ్యం.

ఒక ఉత్తరాది అహంకారి సాయంతో ఒక ఆర్ధిక నేరస్తుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టారు. అసలు ఏ ఏ రంగాల్లో ఎంతెంత అవినీతి జరిగిందో తెల్సుకోవడానికే చాలా సమయం పడుతుంది. 12 లక్షల కోట్లు అప్పు , ఇవికాక కార్పోరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు తెలుసుకోవడం పెద్ద పని. ఎంత ఘోరంగా అప్పులు తెచ్చారంటే రాబోయే మద్యం అమ్మకాలను షూరిటీగా పెట్టి వేలకోట్లు అప్పులు తెచ్చారు. అలా ఇవ్వడానికి బ్యాంకులకు అధికారం ఎక్కడ వుంది ?

తక్షణం బాబు వాటిని కాన్సిల్ చేసి ఉద్యోగుల, రాజకీయ నాయకుల నుండీ వసూలు చేసుకోమని చెప్పాలి. అప్పుల చిట్టా అంతా బాబు ప్రజల ముందు ఉంచాలి. అప్పులు ఇప్పించడంలో బి.జె.పి కు భాగం ఉంది కాబట్టి అడ్డుకట్ట వెయ్యడానికి బి.జె.పి ప్రయత్నిస్తుంది. వై.సి.పి వారికి పైన మనవాడే ఉన్నాడులే , ఏమీ అవ్వదులే అనే ధైర్యంలో ఉన్నారు. వీటిపై బాబు రాజీపడితే 2029 కి మరలా బంగారు పళ్ళెంలో వై.సి.పి కి అప్పగించవల్సి వస్తుంది.

-వల్లూరి పల్లి ఎల్. ప్రసాద్.

LEAVE A RESPONSE