Suryaa.co.in

Editorial

సీనియర్లకు ఇక విశ్రాంతేనా?

– క్యాబినెట్‌పై లోకేష్ ముద్ర
– లోకేష్‌కు లైన్ క్లియర్ చేసిన బాబు
– కొత్త రక్తంతో పాత తరానికి విశ్రాంతి?
– సీనియర్లకు తప్పని నిరాశ
– వైసీపీనుంచి వచ్చిన వారికి పదవులు
– గతంలో మాదిరిగా నేతలను పిలిపించి మాట్లాడని బాబు
– ఇకపై ఇదే సంప్రదాయం కొనసాగుతుందా?
– టీడీపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీలో సీనియర్లకు ఇక విశ్రాంతి ఇచ్చినట్లేనా?.. భవిష్యత్తులో వారు ఇక పదవులపై ఆశ వదులుకోవలసిందేనా?..ఇక కొత్త రక్తంతో పార్టీని కొత్త మార్గం పట్టిస్తారా?..యువనేత లోకేష్ ముద్ర క్యాబినెట్‌పై స్పష్టంగా కనిపిస్తోందా?.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత బాబు.. యువనేత లోకేష్‌కు ఇప్పటినుంచే లైన్ క్లియర్ చేస్తున్నారా?.. తాజా క్యాబినెట్ కూర్పు అలాంటి సంకేతాలిస్తోందా?.. ఇదీ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్.

కొత్త క్యాబినెట్‌లో సీనియర్లకు మొండిచేయి చూపించిన నేపథ్యంలో.. పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షం లేని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, కొత్త వారితో ప్రయోగం చేశారన్న వ్యాఖ్యలు పార్టీలోని కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇది కొత్తవారి పనితీరుకు పెట్టిన పరీక్షగా వారు అభివర్ణిస్తున్నారు. ఎలాగూ బలమైన ప్రతిపక్షం లేదు కాబట్టి, సీనియర్లకు అవకాశం ఇవ్వడం కంటే, జూనియర్లకు అవకాశం ఇవ్వడం ద్వారా కొత్త తరాన్ని ప్రోత్సహించినట్లవుతుందని విశ్లేషిస్తున్నారు.

అయితే సీనియర్లను పూర్తిగా పక్కకుబెట్టడం మంచిదికాదని, అనుభవానికి పెద్దపీట వేయకపోతే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బలమైన ప్రతిపక్షం లేకపోయినా జిల్లాల్లో రాజకీయాలు చేయడం నిరంతర ప్రక్రియ అని, అందులో కొత్తవారు అప్పుడే పట్టు సాధించలేరని వాదిస్తున్నారు. సీనియర్లను పక్కనపెట్టారన్న భావన కింది స్థాయికి వెళితే, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ పనిచేస్తున్న సీనియర్లు కూడా, కాడికిందపడేసే ప్రమాదం లేకపోలేదంటున్నారు. కు రాజకీయాలతో నిండిపోయిన రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్లను అంత సులభంగా పక్కనపెట్టడం కూడా మంచిదికాదంటున్నారు.

కాగా ఈ మంత్రివర్గ కూర్పుపై.. అచ్చంగా యువనేత లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయాలు, పార్టీ పగ్గాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా లోకేష్‌కు బాటలు పరిచారన్న వ్యాఖ్యలు, సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. సీనియర్లకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి, వారి స్థానంలో యువకులైన కొత్తవారితో.. సొంత టీమ్ ఏర్పాటుకు కలసివచ్చిన వేదికగా సీనియర్లు అభివర్ణిస్తున్నారు.

ఇక అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు , కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, జీవీ ఆంజనేయులు,పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్, గద్దే రామ్మోహన్‌రావు, కాల్వ శ్రీనివాసులు, అమర్‌నాధ్‌రెడ్డితోపాటు.. గత ఎన్నికల ముందు జగన్ సర్కారుపై బహిరంగ యుద్ధం చేసిన రఘురామకృష్ణంరాజు వంటి వారికి, మంత్రి పదవులు లభించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

కొత్తవారికి అవకాశం కల్పించిన వారిలో..రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన పల్లా శ్రీనివాసరావు పేరు లేకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారథికి పదవులివ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అయితే పార్టీకి ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ ఎన్నికలో.. వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ, టీడీపీ అభ్యర్ధికి ఓటు వేసి గెలిపించిన కృతజ్ఞతతో, నాడు ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారంటున్నారు. కానీ ఎన్నికల ముందు చేరిన పార్ధసారథికి, ఏ ప్రాతిపదికన మంత్రి పదవి ఇచ్చారన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్రధానంగా.. రాష్ట్రంలో అందరికీ తెలిసిన అయ్యన్నపాత్రుడు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, బుచ్చయ్యచౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, రఘురామకృష్ణంరాజు, కన్నా లక్ష్మీనారాయణ, పరిటాల సునీత, చింతమనేని ప్రభాకర్ వంటి ప్రముఖులు క్యాబినెట్‌లో లేకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది.

వీరిలో గత జగన్ సర్కారు వేధించిన అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణంరాజు, చింతమనేని ప్రభాకర్ పేర్లు లేకపోవడం అసంతృప్తికి దారితీసింది. కృష్ణాజిల్లాలో బలమైన కమ్మ వర్గానికి అసలు ప్రాధాన్యం లేకపోవడం, పార్టీలో సీనియర్ అయిన వైశ్య ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు మంత్రి పదవి రాకపోవడం చర్చనీయాంశమయింది. ఆ వర్గం నుంచి కర్నూలు ఎమ్మెల్యే టిజి భరత్‌కు మంత్రి పదవి ఇచ్చినప్పటికీ, కోస్తాలోనే వైశ్యుల సంఖ్య ఎక్కువ ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

కేంద్రమంత్రిగా పనిచేసి, బలమైన బుగ్గన రాజేంద్ర నాధ్‌రెడ్డిని ఓడించిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డితోపాటు.. బాబు కుటుంబాన్ని దుర్భాషలాడిన కొడాలి నానిని ఓడించిన వెనిగండ్ల రాముకు, కొత్తవారి కోటాలో మంత్రి పదవులిస్తారని పార్టీ వర్గాలు ఆశించాయి.

పాత సంప్రదాయానికి భిన్నంగా బాబు..
ఈసారి క్యాబినెట్ కూర్పులో చంద్రబాబునాయుడు తన సహజశైలిని పక్కనబెట్టడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ మంత్రివర్గ కూర్పు లేదా విస్తరణ సందర్భంలో ఆశావహులను పిలిపించి, వారితో మాట్లాడే సంప్రదాయం ఉండేది.

‘‘ఫలానా అంశాలు, ఫలానా సమీకరరణల కారణంగా మీకు పదవి ఇవ్వలేకపోతున్నా. అర్ధం చేసుకోండి. నీకు నేనున్నా’’ అని నచ్చచెప్పేవారు. దానితో వారికి కొంత అసంతృప్తి ఉన్నా, బాబు తమను పిలిచి మాట్లాడారన్న తృప్తితో వెళ్లేవారు. బాబుపై చాలామందికి అసంతృప్తి ఉన్నప్పటికీ, ఇలాంటి ప్రజాస్వామ్యయుత ధోరణి మాత్రం వారిని మెప్పించేది. కానీ ఈసారి ఆ సంప్రదానికి తెరదించటమే పార్టీ వర్గాలను విస్మయపరిచింది.

ఈ విషయంలో ఆయన జగన్ దారిలో పయనించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి భవిష్యత్తులో పార్టీ-ప్రభుత్వానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కూడా, ఇదే తరహాలో ఉంటాయన్న చర్చ జరుగుతోంది.

LEAVE A RESPONSE