– మిర్చి రైతుల బాధలు అవస్థలు పట్టని ప్రభుత్వం
– తెగుళ్లతో రాష్ట్రంలో మిర్చి దిగుబడి తగ్గింది
– ప్రభుత్వ నిర్లక్ష్యంతో మద్ధతు ధర పడిపోయింది
– రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకు మద్ధతు ధర లేదు
– అయినా పట్టించుకునే నాధుడే లేడు
– గుంటూరు మిర్చియార్డులో మిర్చి రైతులను కలిసిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్
– మిర్చియార్డులో రైతులతో ముఖాముఖి. వారి సమస్యలు ఆరా
గుంటూరు: గుంటూరులోని మిర్చియార్డును మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించారు. యార్డులో మిర్చి రైతులను కలుసుకున్న ఆయన, వారి సమస్యలు, అగచాట్లు ఆరా తీశారు. ఒకవైపు రైతులు, మరోవైపు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో గుంటూరు మిర్చియార్డు క్రిక్కిరిసి పోయింది.
కష్టాల్లో ఉన్న తమను పరామర్శించేందుకు వచ్చిన వైయస్ జగన్‌ను చూసిన మిర్చి రైతులు, తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధలు చెప్పుకున్నారు. కష్టాలను మిర్చి రైతులు వివరించారు. వారి కష్టాలు, బాధలు సావధానంగా విన్న ఆయన, వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా వైయస్ జగన్ ఏమన్నారంటే..: రాష్ట్రంలో రైతుల కష్టాలను సీఎం చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదు. సచివాలయానికి, సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చియార్డులో రైతులు పడుతున్న అవస్ధలు చంద్రబాబునాయుడుకి అర్ధం కావడం లేదు. ఆయనకు రైతుల కష్టాలు కనిపించినా కళ్లు మూసుకున్నారు. వారిని మరిన్ని కష్టాల పాల్జేస్తున్నారు. గుంటూరు మిర్చియార్డులో ఇప్పుడు మిర్చి పంటకు కనీసం రూ.10 వేలు, రూ.11 వేల ధర కూడా రావడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు.
ఒకవైపు తెగుళ్ల తాకిడితో మామాలుగా 20 క్వింటాళ్లకు పైగా రావాల్సిన దిగుబడి కాస్తా ఇవాళ 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయింది. మరోవైపు గత ఏడాది వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.21 వేల నుంచి రూ.27 వేలు ధర పలికిన మిర్చిని ఇవాళ కనీసం రూ.10 వేల నుంచి రూ.11 వేలకు కూడా కొనే నాధుడు లేకుండా పోయాడు. రైతులకు పెట్టుబడి కింద కనీసం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు ఖర్చు అవుతుంది.
అటు తెగుళ్లతో తగ్గిన దిగుబడి. ఇటు రేటు లేక అమ్ముకోలేని పరిస్థితులతో రైతులు బ్రతుకు దుర్భరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కందులు, పెసర, మినుములు, టమోట, ప్రత్తి ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు రైతులను దళారీలకు అమ్మేశాడు. పంటలకు మద్దతు ధర రావడం లేదు. మరోవైపు వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల జీవితాల్లో వెలుగులు చూడ్డానికి ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు. గ్రామాల్లో ఆర్బీకే వ్యవస్థ, ఈ–క్రాప్ విధానం నిర్వీర్యం అయిపోయాయి. దీంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
ఆ రోజుల్లో ధాన్యం సేకరణకు ప్రభుత్వం రూ.65 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే ప్రయత్నం చేస్తే.. ఇవాళ ధాన్యం కొనుగోళ్లులో ఏ రైతుకూ కనీస గిట్టుబాటు రాలేదు. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రతి రైతునూ ఆదుకున్నాం.
ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలన్న ఆలోచన లేదు. ఒక నెంబరుకు ఫోన్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతులకు కనిపించడం లేదు. ఆర్బీకేలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లతో సహా ప్రతి వ్యవస్ధ నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ రైతులు ఎరువులు కొనాలంటే ప్రైవేటు డీలర్ల దగ్గర కొనాల్సి వస్తుంది. వాళ్లు కనీసం రూ.100 నుంచి రూ.400 అధికంగా బ్లాకులో అమ్ముతున్నారు. క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.
గతంలో ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మే పరిస్ధితి ఉంటే.. ఇవాళ నాణ్యమైనవేవీ రైతులకు రాకుండా పోతున్న పరిస్థితి నెలకొంది. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా ప్రభుత్వం తాము ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వకుండా రైతులను మోసం చేసింది. రైతులకు సున్నావడ్డీ కూడా రావడం లేదు.
చంద్రబాబునాయుడు ఇప్పటికైనా కళ్లు తెరిచి గుంటూరు మిర్చియార్డుకు రావాలి. రైతుల కష్టాలను తెలుసుకుని వారికి కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా చంద్రబాబునాయుడు నిలబడకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలుంటాయని రైతుల తరపున హెచ్చరిస్తున్నాను.
ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. కనీస పోలీసు భద్రత కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. నేను చంద్రబాబునాయుడుకి చెబుతున్నా.. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు చేస్తున్నది కరెక్టా? కాదా? ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.