ఎంపి విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు 14 నెలల ముందు ప్రజల ఉనికిని, ప్రజాస్వామ్యంలో వారి పాత్రను గుర్తించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జరిగే ఏ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ గెలిచినా అది ప్రజా నిర్ణయం లేదా తీర్పు అవుతుందని చదువుకున్నాం. ఇందులో జనం గెలుపు లేదా ఓటమి అనేది ఉండదు. గెలుపోటములు ఎన్నికల్లో పోటీచేసే రాజకీయపక్షాలకు మాత్రమే ఉంటాయి గాని ప్రజలకు కాదు.
అలాంటిది 2024 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తేనే అది ప్రజా విజయం అవుతుందని ఈ పార్టీ నేత చెప్పడం హాస్యాస్పదం. తాను సీఎం పదవి చేపట్టాక ఎదురైన మూడు పరాజయాల తర్వాత (2004, 2009, 2019) కూడా ‘మైండ్ సెట్’, రాజకీయ దృష్టి మార్చుకోని చంద్రబాబు నైజాన్ని ఆయన నెల్లూరు జిల్లాలో చెప్పిన పై మాటలు గుర్తుచేస్తున్నాయి. ఇకపోతే, గత మూడు నెలలుగా ఆయన రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు (బీసీలు) కొత్త చుట్టంలా కనిపించడానికి తెగ ప్రయాసపడుతున్నారు.
బీసీలంతా ఇప్పుడు తన పార్టీ వైపునకు వచ్చేశారని, ఇప్పుడు వారు తన పార్టీ ఓటుబ్యాంకులేననే రీతిలో వయసు పెరిగి, ‘కాకలు తీరిన రాజకీయ నాయకుడు’ అని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్న నారా వారు మాట్లాడుతున్నారు. రాజకీయ చైతన్యం ఉన్న కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వంటి అన్ని సామాజికవర్గాలనూ ఏకకాలంలో బురిడీ కొట్టించడం తనకే సాధ్యమని ఆయన అనుకుంటున్నారు. అయితే, ఒకే సమయంలో అనేక కులాలు, మతాల ప్రజలు టీడీపీ అగ్రనేత చేతిలో మోసపోయే రోజులు ఎప్పుడో పోయాయి.
ఎన్ని కులాలను ఈ మాజీ ముఖ్యమంత్రి పేరుతో పిలిచి మభ్యపట్టే ప్రయత్నం చేసినా ఆయన ప్రయత్నాలు ఫలించవు. కుల, మత వివక్ష లేకుండా, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అన్ని ఆదాయ వర్గాల ప్రజలనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదుకుంటోంది. ‘నేనున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, మీకు అండగా ఉంటాను,’ అంటూ మాటల్లో, చేతల్లో జనం ముంగిట నిత్యం కనపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . ముఖ్యంగా, కులాలు, మతాలకు అతీతంగా తెలుగు మహిళలంతా ఆయనకు అండగా నిలబడుతున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడపడుచులకు ఆసరాగా ఉంటోంది. ఈ పరిస్థితులేవీ గమనించకుండా–వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే ప్రజా విజయం అవుతుందని సీఎం కుర్చీలో 14 ఏళ్లు కూర్చున్న అనుభవం ఉన్న చంద్రబాబు చెప్పడం ఆయన అధికార దాహానికి నిదర్శనం.