గుడివాడ అక్రమ క్యాసినోపై గవర్నర్ హరిచందన్ కు చంద్రబాబు లేఖ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ క్యాసినో నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు గవ ర్నర్‌ను కోరారు. ఇందులో మంత్రి కొడాలి నాని హస్తం ఉన్నందున, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. ఆ మేరకు ఆయన గవర్నర్ హరిచందన్‌కు లేఖ రాశారు. లేఖను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజా, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, పిల్లి మాణిక్యరావు తదితరులు గవర్నర్‌కు అందించారు.

చంద్రబాబు లేఖ సారాంశం ఇదీ..
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు దిగజారుతున్న పాలనపై లేఖ రాయాల్సి రావడం చాలా బాధగా ఉంది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలపై దాడులు, హింసాత్మక సంఘటనలతో పాటు డ్రగ్స్ వ్యవహారంలో రాష్ట్రం సైతం జాతీయ వార్తలలో నిలిచింది.

ఈ పరంపరలో తాజాగా 2022 జనవరి 14 నుంచి 16వ వరకు కృష్ణా జిల్లా గుడివాడలో పట్టపగలే అక్రమంగా క్యాసినో నిర్వహించారు.జూదం, బెట్టింగ్‌లతో ప్రజలను ప్రోత్సహించి తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలను మంటకలిపారు.అంతేకాకుండా మహిళల చేత అసభ్యకరంగా నగ్నంగా, అశ్లీల నృత్యాలు చేయించినట్లు తెలిసింది. 17 జనవరి 2022న దాదాపు 13 మంది మహిళలను రాష్ట్రం వెలుపలి నుంచి తీసుకొచ్చి చట్టవ్యతిరేక క్యాసినోలో పని ముగించుకుని తిరిగి గోవాకు పంపినట్లు సమాచారం.అక్రమా ‘క్యాసినో’లో రూ. 500 కోట్లు నల్లధనం చేతులు మారాయి.

అదేవిధంగా అక్రమంగా విదేశీ మద్యం సమ్మ్లింగ్ చేసి క్యాసినోలో ఏరులై పారించారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు మార్పిడి జరగడం నల్లధనంపై భారత ప్రభుత్వం చేస్తున్న పోరాట స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.అధికార వైసీపీ నేతలు, ప్రత్యేకించి గుడివాడకు చెందిన మంత్రి పర్యవేక్షణలోనే ఇదంతా జరిగింది. అక్రమ క్యాసినో వార్త తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆరుగురు సీనియర్ నేతలతో నిజనిర్ధారణ కమిటీ నియమించింది. ప్రజలపై క్యాసినో దుష్ప్రభావం, క్యాసినో ఏర్పాటును నిరోధించడంలో పాలకులు, పోలీసుల వైఫల్యానికి సంబంధించిన వాస్తవాలను నిర్ధారించే బాధ్యతను కమిటీకి అప్పగించడం జరిగింది.

2022 జనవరి 21న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నిజాలు నిగ్గు తేల్చేందుకు గుడివాడకు వెళ్లుతుండగా మార్గంలో పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గురించి గుడివాడ పర్యటనపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా వారు సరైన రీతిలో స్పందించకపోవటం బాధాకరం.అనేక అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా కమిటీ గుడివాడలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుంది.

అక్కడి నుంచి కమిటీ ముందుగా దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ‘కేసినో’ నిర్వహించిన- కె కన్వెన్షన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ, టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుని అక్రమంగా నిర్బంధించారు.అనంతరం వారిని వాహనంలోకి ఎక్కించి పామర్రు పోలీస్ స్టేషన్‌ కు తరలించి అక్రమంగా నిర్బంధించారు. అధికార వైసీపీ గూండాలు టీడీపీ నాయకుల వాహనాలపై దాడి చేసి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు కారును ధ్వంసం చేశారు.

గుడివాడ టిడిపి కార్యాలయంపై కూడా దాడి చేసి ముళ్లపూడి రమేష్ ను, టిడిపి కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచారు. గతంలో డ్రగ్స్ పై ప్రశ్నించినప్పుడు సైతం టిడిపి సెంట్రల్‌ పార్టీ కార్యాలయంపై అధికార వైసీపీ గూండాలు దాడి చేశారు. నేడు అక్రమ క్యాసినో అంశాన్ని లేవనెత్తిగా గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై అధికార వైసీపీ గూండాలు దాడి చేయడం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు.

అధికార పార్టీ ఇటువంటి హింసాత్మక దాడులకు పదేపదే పాల్పడుతూ భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తోంది.ప్రభుత్వంపై అసమ్మతి తెలిపిన వారిపై హింసాత్మక దాడులకు పాల్పడుతూ, తప్పుడు కేసులు బనాయిస్తూ అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.గుడివాడలో విధ్వంసానికి పాల్పడిన వైసీపీ గూండాలపై పోలీసులు చర్యలు తీసుకోకుండా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. వలస పాలన లాంటి బ్రిటీష్ రాజ్‌ను గుర్తుకు తెచ్చే గూండా రాజ్‌ తో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఒక స్పష్టమైన నిదర్శనం.

17 జనవరి 2022న వర్ల రామయ్య, ఇతర టీడీపీ నాయకులతో కలిసి గుడివాడలో అక్రమ క్యాసినో పై కృష్ణా జిల్లా ఎస్సీ కి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై విచారించేందుకు నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)ని ఎస్పీ నియమించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.హాస్యాస్పదంగా, గుడివాడ డీఎస్పీపై నూజివీడు డీఎస్పీని నియమించారు. అక్రమ క్యాసినోపై విచారణకు అదే స్థాయి అధికారిని నియమించడంతోనే నిందితులతో పోలీసుల కుమ్మక్కున విషయం స్పష్టంగా తెలుస్తోంది. గుడివాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన అనంతరం జనవరి 22న టీడీపీ సీనియర్ నాయకులు ఏలూరు రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) కార్యాలయానికి వెళ్లి అక్రమ క్యాసినో పై, టీడీపీ నేతలపై చేసిన దాడులు, దౌర్జన్యాలపై, అధికార వైసీపీ గూండాలు విధ్వంసంపై ఫిర్యాదు చేశారు.

కానీ, డీఐజీ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయ సిబ్బందికి రిప్రజెంటేషన్ సమర్పించారు. పోలీసుల ప్రతిస్పందన లేకపోవడంతో 2022 జనవరి 22న కృష్ణా జిల్లా కలెక్టర్ కి ఒక వినతిపత్రం సమర్పించబడింది. దీని తర్వాత కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాం, కానీ అతను అందుబాటులో లేనందున అతనికి ఈ-మెయిల్ ద్వారా పంపడం జరిగింది. ఇంతమంది అధికారులకు నివేదించినా స్పందన లేకపోవడంతో 24 జనవరి 2022న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) అపాయింట్‌మెంట్ కోరడం జరిగింది. డీజీపీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోగా కమిటీ సభ్యులను నడి రోడ్డుపై నిలిపివేసి అక్కడే నివేదిక సమర్పించాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చారు.

గుడివాడ అక్రమ క్యాసినోపై సరైన, సమగ్రమైన విచారణ చేపట్టేందుకు పోలీసులు సిద్ధంగా లేరని తెలుస్తోంది. పోలీసుల అనుచిత నిర్లక్ష్యపు చర్యలను పరిశీలిస్తే… అక్రమ కాసినోను నడపడంలో, టిడిపి కార్యాలయంపై, నాయకులపై దాడి చేయడంలో అధికార వైసీపీ నాయకులతో ఒక వర్గం పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోంది.

‘క్యాసినో తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధం మాత్రమే కాదు, అది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నైతికతపై ప్రత్యక్ష దాడి.అక్రమ కాసినోకు సంబంధించిన పరికరాలు చట్టవిరుద్ధంగా సేకరించబడ్డాయి. ఇది ఆదాయపు పన్ను చట్టాలు, ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్, విదేశీ మారక ద్రవ్య చట్టాలకు వ్యతిరేకం.

ఇలాంటి హవాలా లావాదేవీలు దేశ భద్రతకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు కూడా పెను ముప్పు. అక్రమ కాసినో ఏర్పాటును నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగానే ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది.గుడివాడ క్యాసినోపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ 2022 జనవరి 25న నాకు ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం అక్రమ క్యాసినో నిర్వహణ వెనుక స్థానిక మంత్రి హస్తం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అక్రమ క్యాసినో నిర్వహించిన దోషులను వదిలిపెట్టకండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.చట్టాలను రూపొందించాల్సిన శాసనసభ్యులే ఆ చట్టాలను ఉల్లంఘించడం బాధాకరం. ఇవి ఇలాగే కొనసాగితే అవి మన సమాజం, రాజకీయాలపై చాలా దుష్ప్రభావాన్ని చూపుతాయి. అక్రమ క్యాసినో పై విచారణ సజావుగా జరగాలంటే సదరు మంత్రిని పదవి నుంచి తప్పించాలి.

తమరు రాష్ట్ర ప్రభుత్వాధినేతగా, గుడివాడలో అక్రమ కాసినో ఎపిసోడ్ పై, పోలీసులు, పాలకుల పాత్రపై, టీడీపీ నేతలు, కార్యకర్తలపై అధికార వైసీపీ గూండాలు పాల్పడిన హింసపై తగిన సంస్థ ద్వారా విచారణ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.పోలీసుల ఏకపక్ష చర్యలు భారత రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్య విలువలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది. కాబట్టి మీ సత్వర చర్యలు మాత్రమే తెలుగు వారి సంస్కృతిని రక్షించడంలో సహాయపడుతుంది. మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు మన దేశం సురక్షితంగా ఉండేలా చేస్తుంది.

Leave a Reply