మాండాస్ తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలని, ధాన్యం రైతుల సమస్యలు పరిష్కరించాలని లేఖ
తేది : 15.12.2022
గౌ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : మాండాస్ తుఫాను ధాటికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ` తేమ శాతం నిబంధన పేరుతో మద్దతు ధరల్లో కోత ` మిల్లర్లకు మేలు చేసేలా ధాన్యం సేకరణ లక్ష్యంలో కోత ` ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ` బకాయిల చెల్లింపుల్లో జాప్యం ` రైతులను తక్షణమే ఆదుకోవడం, ధాన్యానికి మద్దతు ధర కల్పించడం కొరకు…
పంట చేతికందే సమయంలో మాండాస్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి అన్నదాతల కంట కన్నీరు మిగిలింది. తుఫాను కారణంగా 8 జిల్లాల్లో పంట నష్టం జరిగింది. అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో వరి పంట, అపరాలు, కడప, అన్నమయ్య జిల్లాలలో అరటి, బొప్పాయి, అపరాలు, నెల్లూరులో వరి నార్లు, ప్రకాశంలో పొగాకు, పప్పు శనగ, మిరప, ధాన్యం, ప్రత్తి, మినుము, గుంటూరులో వరి, మిరప, కృష్ణాలో వరి, అపరాల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పత్తి, మిరప, సెనగ, పొగాకు, మినుముతో పాటు ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. వేసిన విత్తనాలు కుళ్లిపోవడం, మొలకెత్తినచోట మొక్కలు కొట్టుకుపోవడం, దెబ్బతినడం జరిగింది. కోతకొచ్చిన వరి పంట నీటమునగడంతో పాటు ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ఈ తుఫానుతో రైతులకు వేల కోట్ల నష్టం జరిగింది. ఇటువంటి తీవ్ర పరిస్థితిలో కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది.
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో ఆశలతో అరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా చెల్లించడం లేదు. ధాన్యం సేకరణ లక్ష్యంలో భారీగా కోత విధించింది. ప్రభుత్వ ఆంక్షలు, కొత్త నిబంధనల కారణంగా పంటను సరైన ధరకు అమ్ముకునే పరిస్థితి లేక రైతులు నానా యాతన పడుతున్నారు. ఆర్‌బీకేలకు రైతులు ధాన్యాన్ని తీసుకువెళితే తేమ శాతం ఎక్కువ ఉందంటూ, ధాన్యం రంగు మారిందంటూ మద్దతు ధరల్లో పెద్ద ఎత్తున కోత పెడుతున్నారు. మరోవైపు గత ఏడాది జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు రైతులకు పూర్తిగా చెల్లింపులు జరగలేదు.
ధాన్యంలో తేమ 17 శాతం కంటే అధికంగా ఉంటే మద్దతు ధరలో కోత కోస్తున్నారు. తేమ శాతం తగ్గించుకునేందుకు రైతులు వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. 20 రోజులు పైగా ధాన్యాన్ని రోడ్లపై, కళ్లాల్లో ఉంచాల్సి వస్తోంది. ధాన్యం ఆరబెట్టడానకి బరకాలు, టార్పాలిన్లు, కూలీల ఖర్చు రైతుకు అదనపు భారంగా మారుతుంది. నాలుగు ఎకరాలు సాగుచేసే రైతు ఈ కారణంగా రూ.20 నుంచి 30 వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ధాన్యంలో తేమ త్వరగా తగ్గడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది అని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వం కేవలం 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొంటాను అని చెప్పింది. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం భారీగా తగ్గించడంతో ధాన్యం కొనేవారు లేక రైతులు భారీగా నష్టపోతున్నారు. ప్రభుత్వ చర్యలతో ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కై ధాన్యం మద్దతు ధరను తగ్గించి రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు పరిమితులు విధించి.. దళారులకు అమ్ముకోవాలని ప్రభుత్వమే సూచించడం సరికాదు. ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు క్వింటాకు రూ.500 నుంచి రూ.700 వరకు నష్టపోతున్నారు. ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ కూడా రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి.
వర్షాలకు తోడు వరి రైతులను గోనె సంచుల కొరత వేధిస్తోంది. ఆర్బీకేల చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నా దొరకని పరిస్థితి. ఒకవైపు తేమ శాతం తగ్గించుకునేందుకు, మరోవైపు ఆరిన ధాన్యాన్ని గోనె సంచులు లేక పొలాల పక్కనే ఆరబెట్టుకోవడంతో నేలలోని చెమ్మకు మొలకలు వస్తున్నాయి. తక్షణమే రైతులకు అవసరమైన గోనె సంచులను అందుబాటులో ఉంచాలి. రాయితీపై రైతులకు అందించే టార్పాలిన్ పట్టాలు, పిచికారీ యంత్రాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాల నుంచి నిలిపివేసింది. గతంలో 50% రాయితీతో ఇవి పంపిణీ చేయడం జరిగింది. ఈ టార్పాలిన్ పట్టాలు
ఉన్నట్లయితే వర్షం, మంచు నుండి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్‌యార్డులోని ధాన్యం ఆరబోత యంత్రాల నిర్వహణ కూడా సక్రమంగా లేదు.
ప్రభుత్వానికి గత ఏడాది ధాన్యం అమ్మిన రైతులకు నేటికీ చెల్లింపులు జరగలేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు చెల్లింపుల ప్రక్రియ కూడా మొదలుకాలేదు. అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.25 లక్షల ఎకరాల్లో పొగాకు రైతులు నష్టపోయారు. 80శాతానికి పైగా పొలాల్లో నీరు నిలిచి మొక్కలు ఉరకలెత్తుతున్నాయి. ఎకరాకు రూ.25 వేల వరకు నష్టపోయే పరిస్థితి. వీరిని ఉదారంగా ప్రభుత్వం ఆదుకోవాలి.
మూడున్నరేళ్లలో విపత్తుల కారణంగా రైతులు రూ.15 వేల కోట్లు నష్టపోయారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రైతు రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో వున్నది. సున్నా వడ్డీ 3 లక్షల పరిమితిని ఒక లక్షకే కుదించారు. ప్రభుత్వ చర్యలతో ఇప్పటికే ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇదే బాటలో మిగిలిన రైతులు వెళ్లే పరిస్థితి నెలకొంది.
టీడీపీ హయాంలో రైతు పండిరచిన ధాన్యాన్ని కల్లాల్లోనే కొనుగోలు చేసి రోజుల వ్యవధిలో చెల్లింపులు చేయడం జరిగింది. వర్షాలకు రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరిగింది. వర్షాలకు ధాన్యం పాడై బాతులు కూడా తినని ధాన్యాన్ని కూడా మద్దతు ధర చెల్లించి నాడు కొనుగోలు చేస్తే, నేడు రకరకాల నిబంధనలతో మద్దతు ధరలో కోత కోసి రైతులను వేధిస్తున్నారు. ఉద్యానవన రైతులను కూడా ప్రకృతి వైపరీత్యాల సమయంలో అన్నివిధాలా ఆదుకోవడం జరిగింది. నేడు అన్నివిధాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. దయనీయ స్థితిలో ఉన్న రైతులను ఆదుకోవడానికి, సత్వర సాయం అందించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరం. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టి వారికి అండగా నిలబడగలరు.
డిమాండ్లు
1. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు వెంటనే అన్ని జిల్లాల్లో ప్రారంభించాలి. ధాన్యం సేకరణ లక్ష్యం పొరుగు రాష్ట్రం దామాషాలో పెంచాలి.
2. వరి, అపరాలకు ఎకరానికి రూ.20 వేలు, వాణిజ్య, ఉద్యానవన పంటలకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి.
3. ఈ-క్రాప్ ఇతర నిబంధలు, ఆంక్షలు లేకుండా ఇన్యూరెన్స్ పరిహారం త్వరగా అందించాలి.
4. కౌలు రైతులకు నేరుగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
5. రైతులు పంట నూర్చిన వెంటనే అక్కడే కొనుగోలు చేసే విధానం తీసుకురావాలి.
6. ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా పంట అంతా కొనుగోలు చెయ్యాలి.
ధన్యవాదాలు…
మీ
(నారా చంద్రబాబునాయుడు)