దారుణమైన బూతులు తిడుతున్నారు.. ఇది కరెక్టేనా?

– డ్రగ్స్‌ ఏపీ అంటూ గోబెల్స్‌ ప్రచారం
– తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దు
– సీఎం జగన్‌
‘‘నేరాల్లో కొత్త కోణం కనిపిస్తోంది. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఆలయాల రథాలను తగలబెట్టారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియాన్ని అడ్డుకున్నారు. చివరకు ముఖ్యమంత్రిని కూడా దారుణమైన బూతులు తిడుతున్నారు. ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఆలోచించండి. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇది అనైతికం.. అధర్మం.. పచ్చి అబద్ధం’’ అన్నారు .
పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు.
‘‘పథకం ప్రకారం.. అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడటం సమంజసమేనా. అధికార పార్టీ పాలన మెచ్చుకుంటూ ప్రజలు అన్ని ఎన్నికల్లో గెలిపించారు. తనవాడు గెలవలేదని రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ రాష్ట్రంలో నేరాలు చేసేందుకు యత్నిస్తున్నారు. డ్రగ్స్‌తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ, డీఆర్‌ఐ చెప్పినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్‌ ఏపీ అంటూ పచ్చి అబద్ధాలను గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. కొందరు రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారు. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలని చూస్తున్నారు’’ అన్నారు.
‘‘రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ అతి ముఖ్యమైన విషయం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలీసులు ఎక్కడా రాజీ పడొద్దు. తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దు. చట్టం ముందు నిలబెట్టండి. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు, బలహీన వర్గాల విషయంలో రాజీ పడొద్దు. రాజకీయ నేతల్లో కూడా అసాంఘిక శక్తులను చూస్తున్నాం. అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు’’ అని సీఎం సూచించారు.
‘‘పోలీసుల బాగోగుల గురించి ఆలోచించి.. దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీఆఫ్‌ ప్రకటించిన ప్రభుత్వం మనదే అని తెలుపుతున్నాను. కోవిడ్‌ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయాం. ఇప్పుడు వైరస్‌ ప్రభావం తగ్గింది కనుక నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నాం.దేశవ్యాప్తంగా నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతాం. కోవిడ్‌ వల్ల చనిపోయిన పోలీసులకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశాం. కరోనా బారిన పడిన పోలీసులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాం. హోంగార్డుల ప్రత్యేక వేతనాన్ని కూడా పెంచాం. గత ప్రభుత్వం పోలీసుశాఖకు బకాయి పెట్టిన 1500 కోట్ల రూపాయలు విడుదల చేశాం’’ అన్నారు.
కోవిడ్‌ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10 లక్షల రూపాయల చెక్కులను అందజేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అమరులైన కుటుంబాలకు సీఎం చెక్కులను ra అందజేశారు.

Leave a Reply