శిలాఫలకాలు తప్ప అభివృద్ధి ఎక్కడ ముఖ్యమంత్రి గారూ!

Spread the love

• కడపపై అంతశ్రద్ధ ఉంటే రెండేళ్లుగా స్టీల్ ప్లాంట్ ను ఎందుకు మూలనబెట్టారు?
• ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను మూలనబెట్టి కొత్తది మొదలెడతారా?
• రెండేళ్లలో రాష్ట్రం నుంచి తరలివెళ్లిన పరిశ్రమల విలువ రూ.10లక్షల కోట్లు
• మాజీమంత్రి ఎన్. అమర్ నాథ్ రెడ్డి

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కడప జిల్లా కొప్పర్తిలో నాలుగు షెడ్లు ప్రారంభించి, ఏవో నాలుగు చిన్నాచితకా పరిశ్రమలకు శిలాఫలకాలు వేసి బ్రహ్మాండమైన పారిశ్రామికాభివృద్ధి సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. రెండేళ్లక్రితం రూ.14,400 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామంటూ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్…ఇప్పటికీ అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. తొలుత లిబర్టీ స్టీల్స్ అనే సంస్థకు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతను అప్పగించగా, రెండేళ్లయినా అడుగు ముందుకుపడక పోగా ఆ కంపెనీ దివాలా తీసింది.

2020-21, 2021-22 బడ్జెట్ లో స్టీల్ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు కేటాయించి ఖర్చుచేసింది కేవలం రూ.50కోట్లు. తర్వాత ఎస్సార్ స్టీల్స్ అనే మరో సంస్థకు అప్పగించారు కానీ 2021-22 బడ్జెట్ లో 250 కోట్లు కేటాయించి ఎటువంటి ఖర్చు చేయలేదు.కడప స్టీల్ ప్లాంట్ ను తమ ఆప్తులైన పోస్కోకు కట్టబెట్టేందుకు ఒక పథకం ప్రకారం స్టీల్ ప్లాంట్ పనులను మూలనబెట్టారు.వాస్తవం ఇలావుండగా 2024నాటికి స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి బీరాలు పలుకుతున్నారు. వాస్తవానికి ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన కడప జిల్లా కన్యతీర్థం 3,148ఎకరాల భూసేకరణ తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తిచేశాం.

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మక చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై బురద జల్లి రెండున్నర లక్షలమంది విద్యార్థులను తీర్చిదిద్దిన 40 స్కిల్ డెవలప్ సెంటర్లను మూలనబెట్టిన ముఖ్యమంత్రి జగన్….తాజాగా పులివెందులలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లలో చేపట్టిన అవినీతి, విధ్వంసకర విధానాలతో పారిశ్రామికవేత్తలు భయభ్రాంతులకు గురై పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారు.

కనీసం రాజధాని కూడా లేని విభజిత ఆంధ్రప్రదేశ్ లో మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆహోరాత్రులు కష్టపడి వేసిన అభివృద్ధి పునాదులన్నింటినీ వైసిపి ప్రభుత్వం తన మూర్ఖపు విధానాలతో పెకలించివేసింది. చంద్రబాబునాయుడు పారిశ్రామికాభివృద్ధికి చేసిన అవిశ్రాంత కృషితో 2019లో అధికారం నుంచి వైదొలగేనాటికి పారిశ్రామికాభివృద్ధి రేటు సగటున 10.24కు ఉండగా, జగన్ రెడ్డి ప్రభుత్వం అవలంభించిన ఎసిబి, పిసిబి, జెసిబి విధానాల కారణంగా 2020-21లో -3.26కి చేరుకొంది.గత రెండున్నరేళ్లలో రాష్ట్రం నుంచి 10లక్షలకోట్లరూపాయల విలువైన పరిశ్రమలు పొరుగురాష్ట్రాలకు తరలిపోయాయి.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలను మూసివేస్తూ వేలాదిమంది కార్మికుల బతుకులను రోడ్డుకీడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ రాజకీయ, వ్యాపార ప్రత్యర్థులకు చెందిన అమర్ రాజా బ్యాటరీస్, జువారీ సిమెంట్స్ ను కాలుష్యం సాకుతో నోటీసులు ఇచ్చి మూతవేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకున్న ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలు జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా తమ ప్రతిపాదనలు విరమించుకున్నాయి.

ప్రకాశం జిల్లాలో 24వేల కోట్లరూపాయల విలువైన ఆసియన పల్ప్ అండ్ పేపర్ మిల్, విశాఖపట్నంలో నెలకొల్పాలని భావించిన అదానీ డాటా సెంటర్ (రూ.70వేల కోట్లు), చిత్తూరు రిలయన్స్ ఎలక్ట్రానిక్ పరికరాల పరిశ్రమ (14వేల కోట్లు), లులు గ్రూప్ (రూ.2వేల కోట్లు), ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బిఆర్ షెట్టి సంస్థలు (రూ.12వేల కోట్లు), ట్రైటాన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ యూనిట్ (రూ.2,100కోట్లు), సింగపూర్ స్టార్టప్ సంస్థలు (రూ.50వేల కోట్లు) వంటివి రాష్ట్రం నుంచి తరలిపోయాయి. ఇప్పటికైనా అభూతకల్పనలతో ప్రజలను మభ్యపెట్టడం మాని ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో అభివృద్ధిపై దృష్టిసారించాలి.

Leave a Reply