– ‘గుంటూరు’ రైతన్న కుదేలు
– అసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డులో కన్నీళ్ళు
గుంటూరు : మిర్చి రైతుకు ప్రకృతి సహకరించినా గిట్టుబాటు ధర దక్కలేదు. దీంతో అసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు అయిన గుంటూరులో రైతన్న కన్నీటిపర్యంతమవుతున్నాడు. కాలం కలిసివచ్చినప్పుడు కూడా పండిన పంటకు ధరలు లేకపోవడంతో రైతులు కుదేలైపోతున్నారు. ప్రధానంగా గత ఏడాది కన్నా పంటదిగుబడి నేడు ఎక్కువగా రావడం ఒకవంతైతే… ఎగుమతులు లేకపోవడం పిడుగుపాటైంది. దీంతో ధర పతనావస్థకు చేరుకుంది.
మరీ ముఖ్యంగా గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గుంటూరు , కృష్ణా, ప్రకాశం జిల్లాలలో మిర్చి పంట సాగు ఎక్కువగా ఉండేది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డ్ స్థాపించి, ముఖ్యమైన పంటగా మిర్చికి ప్రాధాన్యం ఇవ్వడం గుంటూరులో పరిస్థితికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. పంటను పండించే రైతుకు కూలీల రేట్లు విపరీతంగా పెరగడం, ఎరువులు ధరలూ ఆకాశంలో ఉండటంతో పంటను పండించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.పండిన పంటను మార్కెట్ యార్డులో అమ్ముకోవడానికి వస్తే ఇక్కడా కూడా కాటా రేట్లు, ముఠా కూలి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని రైతన్న ఆవేదన చెందుతున్నాడు.
మరోపక్క వాహనాలలో మార్కెట్ యార్డుకు తీసుకురావడానికి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం మిర్చి పంటను పండించడానికి తహతహలాడుతున్నారు. ఇదీ ఒక కారణంగా ఉంటుందంటున్నారు. పండిన పంటను సరైన కాలంలో అమ్ముకోకపోతే తీవ్రంగా నష్టపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పండిన పంటను శీతల గిడ్డంగులలో దాచుకోవడానికి పోతే అక్కడా కూడా అద్దెల పేరుతో మోతమోగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శీతల గిడ్డంగుల పేరుతో రైతన్నల ఫేక్ ఆధార్, పాస్ పుస్తకాలు పెట్టి నకిలీ రుణాల పేరుతో టోకరా వేయడం పరిపాటిగా మారిందని, ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో దగా పడ్డ రైతన్నకు పాలక ప్రభుత్వం న్యాయం చేయాలని రైతు కుటుంబాలు కోరుతున్నాయి.