కాలం దాటినా కనికరించని చిట్ ఫండ్ కంపెనీలు

ఒకవైపు చిట్ ఫండ్ మరోవైపు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో నిండా మునిగిన ఖాతాదారులు.
కోర్టు కేసులతో తెల్లారని ఖాతాదారుల బ్రతుకు

తొంభై శాతం అసంఘటిత రంగంలో ఉన్న ప్రజలు తమ ఆర్థిక అవసరాలను చిట్స్ ద్వారా తీర్చుకుంటున్నారు. పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా చిట్స్ వ్యాపారం పై మక్కువ చూపడం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో చాల చిట్ కంపెనీలు బోర్డు తిప్పేసిన వార్తలు వింటున్నాము.

తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది చిట్టీలు కడుతుంటారు. అయితే చాలా సంస్థలు చిట్టీలు కట్టించుకొని, కొన్నేళ్ల తర్వాత బోర్డు తిప్పి చేతులు ఎత్తేస్తుంటాయి. ఇలా జరిగినప్పుడల్లా వేల మంది బాధితులు అవుతున్నారు. వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బంతా చిట్టీలపాలై కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రజలు ఆర్థిక అవసరాలకోసం, అత్యవసర పరిస్థితులలో ఉపయోగ పడతాయని చిట్స్ లో చేరడం జరుగుతుంది.

కానీ చాల చిట్ కంపెనీలు వీరి బలహీనత ను ఆసరా చేసుకొని ప్రజలను నిండా ముంచడం జరుగుతున్నది. చిట్ ఎత్తిన మూడు నాలుగు నెలలకు డబ్బు ఇవ్వడం లేదు, జీఎస్టీ పేరుతో మూడు వేల నుండి పది వేల వరకు డిడక్ట్ చేయడం, వెరిఫికేషన్ చార్జీల పేరుతో అదనంగా వెయ్యి రూపాయలు తగ్గించడం జరుగుతున్నది. పోనీలే కనీసం నెల తరువాత అన్నా డబ్బు వస్తుందన్న గ్యారంటీ లేదు. హెడ్ ఆఫిసులో చెక్ ఉండి పోయింది అని సమాధానం, ఆఫిసుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరగడం కస్టమర్ల పనైపోయింది. జీఎస్టీ చెల్లించరు, చెల్లించినా రిసిప్ట్ ఇవ్వరు. ఏ ఖాతాకు జమ చేశారో తెలుపరు.

అలాగే చాల చిట్ ఫండ్ కంపెనీలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటున్నారు. బలవంతంగా ఖాతాదారులు పెట్టిన డబ్బును అటు వైపు మార్చడం. చిట్ ఫండ్ ఖాతాదారులకు తమ స్థలాలను బలవంతంగా అంటగట్టడం జరుగుతున్నది. చాల కంపెనీలు మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీలు గా అవతారం ఎత్తాయి. కోఆపరేటివ్ సొసైటీ లో పెట్టిన పెట్టుబడులకు తక్కువ వడ్డీ ఉంటుంది, ఎప్పుడైనా అవసరం కోసం నగదు ఉపసంహరించుకుంటే రెండు శాతం కోత విధిస్తున్నారు.

ఉదాహరణకు నాలుగు లక్షలు ఫిక్సెడ్ చేస్తే మూడు సంవత్సరాల తరువాత విత్ డ్రా చేస్తే ఖాతాదారుడికి వచ్చేది కేవలం 392000/-. నవంబర్ 4 వ తారీఖు డబ్బు జమచేసిన తేదీ అయితే నవంబర్ 24 వ తారీఖు చెక్ ఇవ్వడం జరుగుతుంది. రెడెంషన్ సంబంధించి ఎక్కడ సర్టిఫికెట్ మీద ప్రచురించారు. ఇక ఖాతాదారులు అధిక వడ్డీకి ఆశపడి పెట్టిన డబ్బు గాలి లో దీపం చందంగా మారింది. అవసరము ఉండి డబ్బు కావాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సిందే. ఇక ప్రైవేటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సహారా ఇండియా పలు కంపెనీల కింద కోటాను కోట్లు వసూలు చేసి దొంగకు తేలుకుట్టిన చందంగా వ్యవహరిస్తున్నది.

2018 నుండి ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సంవత్సరానికి ఒక సారి సుబ్రతో రాయి గారు ప్రజలకు పత్రికల ద్వారా సందేశం తప్ప డబ్బు ఎప్పుడు ఇస్తాడో తెలుపడు. ఎంబార్గో ఉంది, సెబీ ఉంది, రిజర్వ్ బ్యాంకు ఉంది అని కట్టు కథలు చెపుతున్నారు. మీ డబ్బులు ఎక్కడికి పోవు, వాటికి ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా వడ్డీ ఇస్తాము అంటున్నారే తప్ప ఎప్పుడు ఇస్తారు అనే సమాధానం లేదు. సామాన్య ప్రజలు ఒకటి లేదా రెండు శాతం అధిక వడ్డీకి ఆశపడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు భూమి మీద నూకలు చెల్లక ముందే తమ డబ్బు తమకు వస్తే చాలని అనుకుంటున్నారు.

వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమిస్తే సహకార రంగం, ఆర్థిక రంగం పుంజుకునే అవకాశం ఉంది లేకపోతే ఆర్థిక రంగం కూలిపోయే ప్రమాదం దగ్గరలోనే ఉన్నది. ఒకసారి మోసపోతారు కానీ దొంగ చిట్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇలా ప్రజలను మోసగిస్తే ప్రజలకు పొదుపు పై నమ్మకం పోతుంది. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించక కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ప్రజల అవసరాలను దృష్టి లో ఉంచుకోవు. పాతిక సంవత్సరాలు వ్యాపారం చేసిన తరువాత క్రికెట్, హాకీ టీం లకు దుస్తులు ఇవ్వడం, ప్రచారం చేసుకోవడం తరువాత ఖాతాదారులకు నిండా శఠగోపం పెడుతున్నారు. వందల్లో కేసులు ఉన్నాయి ఎప్పుడు తెగి తెల్లారుతాయో తెలియని పరిస్థితి.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక