భారత్ ను చూస్తే వీరికి ఎందుకంత అసహనం?

– భారత్ ను తప్పుగా చూపించే ప్రయత్నం
– పాకిస్థాన్ లో కిలో గోధుమపిండి 170 రూపాయలు ఉంది, గ్యాస్ సిలెండర్ ధర 4500 రూపాయలు

ఏదైనా దేశం తమ దేశం కంటే ఎక్కువగా ఎదుగుతున్నట్లు కనిపిస్తే కొన్ని ప్రపంచ దేశాలు ఓర్వలేవు. ఎప్పటికి తమ ఆధిపత్యమే చెల్లాలనే అహంకారంతో అణచివేసే ప్రయత్నం చేస్తాయి. అధికార బలంతో సాధ్యపడకుంటే కుట్రలకు తెర లేపుతాయి. గూఢచర్య కార్యకలాపాలకు జోరందిస్తాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి దేశాల కనులకు కంటగింపుగా మారింది.

తమ దేశాలకంటే కూడా భారత్ ఎదుగుతూ ఉండటం ఆయా దేశాలు ఓర్వలేకపోతున్నాయి. అందుకే తమకు అనుగుణంగా ఉంటే అనుయాయులు, వారి అనుబంధ సంస్థలతో సర్వేలు, రిపోర్టులు అంటూ కొత్త వాస్తవ దూరమైన ప్రచారానికి తెరలేపాయి. అందులో భాగంగానే దేశంలో ఆకలి కేకలు అంటూ తమ చేయించాలతో చప్పుడు చేయిస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు ఆజ్యం పోస్తున్నాయి. ఆయా కుట్రల్లో భాగమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై మొసలి కన్నీరు. నిత్యావసర ధరలపై, పీపీపీ విధానంపై అవగాహనలేని ప్రేలాపనలు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం. ఇప్పుడు ఐ.ఎఫ్.పి.ఆర్.ఐ రూపంలో అంతర్జాతీయంగా దేశాన్ని బద్నాం చేసే టూల్ కిట్ సిద్ధమైంది. జర్మనీ కాశ్మీర్ పై మాట్లాడటం మొదలు పెట్టింది. కోవిడ్ సమయంలో దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి అండగా నిలిచిన దేశానికే కీడు చేయాలని తలుస్తున్నాయి పెద్దన్న దేశాలుగా చెప్పుకునే కుటిల బుద్ది కలిగిన దేశాలు. వీటిపై అవగాహ కోసం అసలు ఐ.ఎఫ్.పి.ఆర్.ఐ ఏమిటి, అసలెందుకు అలా దుష్ప్రచారం చేస్తోంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

ఐ.ఎఫ్.పి.ఆర్.ఐ అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసర్చ్ ఇనిస్టిట్యూట్. జీహెచ్ఐ అంతర్జాతీయ ఆకలి సూచీ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు, పోషకాహార లోపంతో ఎంత మంది బాధపడుతున్నారో వారి శాతం ఎలా ఉందో, దాన్ని ఏవిధంగా అరికట్టాలి అన్న అంశాలపై ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలను అలర్ట్ చేయాలన్న ఆశయంతో 1975 లో అమెరికా ఇంటర్నేషనల్ ఫుడ్ పోలోసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేసింది. IFPRI ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC లో ఉంది. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇక దక్షిణాసియాలో ఢిల్లీ కేంద్రంగా దీని ప్రాంతీయ కార్యాలయం ఉంది.

ఇంతకీ ఈ సంస్థ ఏం చేస్తుందంటే, ప్రతీ సంవత్సరం వివిధ దేశాలలో చిన్నపిల్లల మరియు పెద్దల పౌష్టికాహారము ఎంత తీసుకుంటున్నారో సర్వే చేస్తుంది. దాని ప్రకారం వివిధ ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. సర్వే కూడా ఏ దేశంలో సర్వే చేయాలనుకుంటుందో ఆ దేశంలో నాలుగు మూలలా తిరిగి పేదలు ఉండే చోటుకి వెళ్ళి రోజూ ఎంత ఆహారం తీసుకుంటున్నారు? మీరు తీసుకునే ఆహారంలో ఎలాంటి పదార్ధాలు ఉంటాయి ? ఇలాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతుంది. దాని ప్రకారం ఒక మూడువేల మందితో సర్వే చేస్తుంది. సమాధానాలని క్రోడీకరించి ఆయా దేశాల ర్యాంకులని నిర్ణయిస్తుంది.

హంగర్ ఇండెక్స్ అంటే పౌష్టికాహార లోపం అని అర్ధం కానీ దీనికి వాళ్ళకి అనుకూలమయిన పారమీటర్స్ కి అన్వయించి ర్యాంకులు ఇస్తున్నది IFPRI. అసలు పౌష్టికాహారం అంటే ఈ అమెరికన్ ఏజెన్సీ దృష్టిలో రోజూ కోడి గుడ్లు తీసుకోవడం, రోజూ కనీసం 100 గ్రాముల కోడి మాంసం తీసుకోవడం లేదా వేరే జంతువుల మాంసం తీసుకోవడం లాంటివి అన్నమాట ! కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు తీసుకునే ఆహారంలో ఎంత శాతం ఉంటున్నాయో లెక్కగడుతుంది. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం కందిపప్పు తినడం వలన ప్రోటీన్లు శరీరానికి కావలసినంతగా అందవు. మరి మన భారత్ లో రోజూ కోడి మాసం, లేదా కోడి గుడ్లు లేదా ఇతర జంతు మాంసం తినేవారి సంఖ్య ఎంత ఉంది. అందునా పేదవాళ్లు రోజూ మాంసాహారం తినగలరా? మనదేశంలో శాకాహారులు కూడా ఉన్నారు కదా.

ఒక దేశంలో కేవలం రొట్టెలు తిని బ్రతుకుతారు అది వాళ్ళ అలవాటు. ఆ రొట్టెలలోకి పప్పు లేకపోతే మాంసాహారం కలిపి తింటారు. డబ్బులు లేని రోజున పప్పు లేదా జామ్ తో తింటారు. అంత మాత్రాన అది పౌష్టికాహార లోపం ఎలా అవుతుంది? అలా అయితే దక్షిణాది రాష్ట్రాలతో సహా ఒరిస్సా, బెంగాల్, అస్సాం లలో బియ్యం ప్రధాన ఆహారంగా ఉంటుంది అంటే ఇది పౌష్టికాహార లోపమా? అలా నిర్ణయించలేరు కదా.

ఇక శ్రీలంక దేశ జనాభా శ్రీలంక జనాభా 2 కోట్ల 19 లక్షలు. ఆఫ్ఘనిస్థాన్ జనాభా 3 కోట్ల 89 లక్షలు. పాకిస్థాన్ జనాభా 23 కోట్ల 67 లక్షలు. పాకిస్థాన్ జనాభా మన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభాతో సమానంగా ఉంది. శ్రీలంక జనాభా కేరళ రాష్ట్రమంత కూడా లేదు. ఆఫ్ఘనిస్థాన్ జనాభా తెలంగాణ జనాభాతో సమానంగా ఉంది. మొత్తం యూరోపు జనాభా వచ్చేసి 74,86,75,003 కోట్లు. అంటే మన దేశ జనాభా తో పోలిస్తే సగానికి సగం ఉంది.

130 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 3000 సాంపుల్స్ తీసుకొని వాటిని ప్రామాణికంగా ఎలా పరిగణిస్తారు ? అంటే రెండు కోట్ల జనాభా ఉన్న శ్రీలంక దేశంలో 3000 సాంపుల్ సర్వే చేసి ర్యాంక్ నిర్ణయిస్తారా ? అటువంటప్పుడు మన కేరళ తో పోల్చి శ్రీలంకకి ర్యాంక్ ఎంతో నిర్ధారించాల్సి ఉంటుంది కదా ? పాకిస్థాన్ జనాభాతో సమానం గా ఉన్న ఉత్తరప్రదేశ్ జనాభా ని పోల్చుతూ పాకిస్థాన్ ర్యాంక్ ఎంతో నిర్ధారించాల్సి ఉంటుంది కదా ? ఈ విషయంపైనే ఇంత మంది జనాభా ఉన్న దేశంలో కేవలం మూడువేల సాంపుల్ తో ఎలా సర్వే చేస్తారంటూ తాజా నివేదికపై భారత్ అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది.

ఆకలిని సరైన ప్రామాణిక సూచీలతో కొలువలేదనే అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. దీనిపై తాము తీవ్రంగా ఆవేదన చెందామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే కేంద్ర మహిళా శిశు సంక్షేమ, అభివఈద్ధి శాఖ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. పోషకాహార లోపాన్ని మూడువేల మందిని ఒక యూనిట్ గా భావించి లెక్కిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు, దీనివల్ల సరైన ఫలితాలు రావు, వాస్తవికత దెబ్బతింటుంది అంటూ ప్రకటించింది.

అంతేకాకుండా కోవడ్ సమయంలో జనాభాకు ఆహార భద్రత కల్పించేందుకు భారత ప్రభుత్వం పెద్ద మొత్తంలో చర్యలు తీసుకుంది. ఆ సమయం నుంచి ఇప్పటివరకు కూడా భారత ప్రభుత్వం దాదాపు 80 కోట్ల మందికి సరిపడా ప్రతినెలా వివిధ రాష్ట్రాలకు సబ్సిడీ మీద గోధుమలని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో 2020 నుంచి ఇప్పటివరకు దారిద్ర్య రేఖకు దిగువున్న ఉన్నవారు అనే ఒక ప్రాతిపదిక మీద దాదాపు 40 కోట్ల జనాభాకి ఉచితంగా రేషన్ ఇస్తోంది.. ఈ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో మూడు నెలలు పొడిగించింది!

ఇక గతంలో అంటే ఓ ఆరు నెలల క్రితం అత్యంత సంతోషంగా ఉండే దేశాల లిస్ట్ లో శ్రీలంక తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ లని చేర్చి వాటి కంటే దిగువన భారత్ ఉన్నట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ ల పరిస్థితి ఈ రోజున ఎలా ఉంది అన్నది మనందరికీ తెలుసు. శ్రీలంకకి మనం బియ్యం తో పాటు పెట్రోల్, డీజిల్, నోటు పుస్తకాలు ఇవ్వకపోతే రోజు గడవట్లేదు. ఇక మందుల సంగతి సరే సరి !

శ్రీలంక లో అయితే గత 10 నెలలుగా నిత్యావసర వస్తువులు దొరకక అల్లాడుతుంటే అక్కడ పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది ? ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి కూడా అంతే. పాకిస్థాన్ తాజాగా 5 కోట్ల దోమ తెరలు కావాలని భారత్ ని అభ్యర్ధించింది. మరి ఈ దేశాలు హంగర్ ఇండెక్స్ లో భారత్ కంటే ఎలా పైనా ఉన్నాయి ? పాకిస్థాన్ లో కిలో గోధుమపిండి 170 రూపాయలు ఉంది, గ్యాస్ సిలెండర్ ధర 4500 రూపాయలు అదీ బ్లాకులో కొనాల్సిన అగత్యం ఉంది అక్కడ ఇలాంటి ఆర్థిక అసమానతలు ఉన్న అక్కడ పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది.

ఇక ఇప్పుడు ఈ IFPRI రిపోర్ట్ రాగానే ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. భారత్ ను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్లందరికీ రెండు నెలలు ఆగితే ఇప్పుడు గొప్పదేశాలు అని వారు చెబుతున్న ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్,శ్రీలంక ల స్థితి ఎలా ఉండబోతుందో తెలసిపోతుంది.

(vsktelangana.org)

Leave a Reply