– విజిలెన్స్ కళ్లుకప్పి కొండపైకి వెళ్లిన క్రైస్తవ వాహనం
– ఆల్టోకారు వెనక అద్దంపై జీసస్ బొమ్మ
– అయినా అలిపిరిలో నిద్రపోయిన నిఘా
– కొండపై భక్తులు ఫిర్యాదు చేస్తే తప్ప గతిలేని వైనం
– టీటీడీ పరువు తీస్తున్న విజిలెన్స్
– భద్రతావైఫల్యంపై సమీక్ష ఏదీ?
– సోషల్మీడియాలో వీడియో హల్చల్
( మార్తి సుబ్రహ్మణ్యం)
తిరుమలలో ఎప్పటికప్పుడు భద్రతా వైఫల్యం వెక్కిరిస్తున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. ఇటీవల కొండపైన క్వార్టర్స్ వద్ద మద్యం బాటిళ్లు పట్టుపడిన వైనం మరువకముందే.. తాజాగా అన్యమతానికి సంబంధించిన, మరో భద్రతా వైఫల్యం టీటీడీ పరువు తీసింది. క్రైస్తవ మతం గుర్తున్న కారు ఒకటి, భద్రతా సిబ్బంది కళ్లు కప్పి వెళ్లిన వైనం ఇప్పుడు సోషల్మీడియాలో విమర్శలకు గురవుతోంది.
పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో, తిరుమలకు సైతం నిఘా వర్గాలు హెచ్చరికలు పంపాయి. దానితో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కళ్ల ముందే.. క్రైస్తవమత గుర్తు ఉన్న శిలువ బొమ్మతో ఉన్న కారు, వారిని దాటి తిరుమలకు వెళ్లిపోయింది.
తమిళనాడుకు చెందిన టిఎన్ 74ఎం 7092 ఆల్టో కారు వెనుక అద్దంపై జీసస్ బొమ్మ కనిపిస్తూనే ఉంది. డ్రైవర్ ముందు కూడా జీసస్ ఉన్న స్టాండ్ బొమ్మ బయటకు కనిపిస్తూనే ఉంది. తిరుమల క్వార్టర్స్ వద్ద ఆ కారును చూసిన భక్తులు, ఆ సమాచారాన్ని విజిలెన్స్ అధికారులకు చేరవేశారే తప్ప, వారంతట వారు తనిఖీ చేయకపోవడమే ఇక్కడ ఆశ్చర్యం. అధికారులు వచ్చి కారు వెనుక ఉన్న జీసస్ బొమ్మను తొలగించారు. మరి భద్రతను వెక్కిరిస్తూ, విజిలెన్స్ సిబ్బందిని ధిక్కరిస్తూ కొండకు చేరిన ఆ కారు యజమానిపై.. ఏం చర్య తీసుకుంటారో చూడాలి.
నిజానికి కింద అలిపిరి నుంచే కార్లను భద్రతా సిబ్బంది నిశితంగా పరిశీలించి, పైకి అనుమతిస్తుంటారు. అనుమానం వచ్చిన వాహనాలు ఆపుతుంటారు. కానీ క్రైస్తవ మతం గుర్తయిన శిలువ బొమ్మ ఉన్న కారును చూసినా, పోలీసులు పట్టించుకోకుండా వదిలేయడమే ఆశ్చర్యం.
ఇటీవలి కాలంలో టీటీడీ విమర్శలకు కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో.. విజిలెన్స్, స్ధానిక పోలీసులతో టీటీడీ అధికారులు, ఇప్పటివరకూ సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం,.. భక్తుల సంఖ్యకు అనుగుణంగా తనిఖీ సిబ్బంది సంఖ్యను పెంచకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం నిఘా వర్గాల కళ్లు కప్పి పోయిన కారుకు సంబంధించిన వీడియో, సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది.