నిస్తేజ స్థితిని పౌరసమాజం అధికమించాలి

ప్రజలు అందించిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వారి పక్షాన గొంతెత్తాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉంది. పౌర సమాజం అంటే ప్రజలే. స్వాతంత్య్రం ముందు నుంచీ పౌర సమాజం తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రజలందరూ  మెరుగైన పౌర సమాజం ధ్యేయంగా ప్రగతిశీల వైపు మళ్లేలా చేయడం ప్రధాన లక్ష్యంగా పౌర సమాజం పని చేయాలి. రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన మానవ హక్కులు, పని హక్కు, జీవించే హక్కు వంటి వాటి విషయంలో ప్రభుత్వాలు ఉల్లంఘనలకు పాల్పడకుండా చూసే వ్యవస్థ పౌర సమాజం. బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలు వెన్నుదన్నుగా నిలవడం, దగాపడిన ప్రజలకు అండగా ఉండటం; వీరి హక్కులను కాపాడడం కూడా పౌర సమాజం లక్ష్యంగా ఉంటుంది. ప్రగతిశీల సమాజం కోసం ప్రజా సంఘాలు, భావస్వరూప్యత కల్గిన పౌర సంఘాలు  భుజం భుజం కలిపి నడవాలి.

పౌరసమాజంలో  అన్ని వర్గాల ప్రజలు చెరోవైపు నిలుస్తున్నారు. అధికారంలోని వారు హక్కులను కాలరాయడం, పత్రికా స్వేచ్ఛపై దాడి చేసి  భావ స్వేచ్ఛను బజారుకీడిస్తున్నాయి. ప్రభుత్వం దాడి కన్నా ప్రమాదకరమైన ధోరణి పెట్టుబడిదారీ వ్యవస్థతో పొంచి ఉన్నది, అదే పౌరసమాజాన్ని  శాసిస్తోంది. మెజారిటీ ప్రజల భావాలను, మైనారిటీ గా ఉన్న పెట్టు బడిదారులు శాసించే స్థాయికి చేరింది.  దేశంలో ఎదుగుతున్న పౌర సమాజాన్ని క్రమంగా నిర్వీర్యం చేసే ఎత్తుగడలూ, వ్యూహాలూ శరవేగంగా అమలులోకి వస్తున్నాయన్న గుర్తింపు నేటి అవసరం. ప్రజా బాహుళ్యానికి చెందిన సర్వ విభాగాలను ఈ స్పృహ ఆచరించవలసిన సమయమిది. అసలు పౌర సమాజం నిరంతరం జాగరూకం అయి  ఉండవలసిన అవసరం.   ప్రజలు ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం గానే ఉద్యమకారులపై కేసులు బనాయించి ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వం చెబుతున్నదే అభివృద్ధి అని, కాదని ధిక్కరిస్తే ఆగ్రహానికి గురి కావాల్సిందేనని తీరుగా పాలకులున్నారు.

ప్రజల పక్షాన నిలబడి, పాలకులు స్వీయ లబ్దికోసం చేసే పనులను ప్రజలు సమూహంగా ప్రశ్నించాలి. దేశం లో సమస్యలు పెరిగాయి,  ప్రజలను తట్టి లేపాల్సిన సమయం వచ్చింది.  ప్రజా సమస్యల పరిష్కారంపై  ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు,  వైరుధ్యాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, దేశ సమగ్రత, మహిళా సాధికారత, పర్యావరణం అన్నీ  నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ ల ప్రయోజనాలకు కు దేశాన్ని తాకట్టు పెట్టారు. ప్రభుత్వాలు పత్రికలు, మీడియా తమ చెప్పుచేతల్లో ఉండాలనే కోరుకుంటాయి. వాటి లక్ష్యాలు వేరు. ప్రజలు దీన్ని గుర్తించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో  పౌరసమాజం-పత్రికలు కలిసి పని చేయాలి. గాలి జనార్దన్‌రెడ్డి, విజమాల్యా, లలిత్‌మోడీ, నీరవ్ మోడీ వంటి వ్యక్తులు ప్రభుత్వ విధానాల వల్లే పుట్టుకొచ్చారు. కులవివక్ష, మతోన్మాదం, విలువల విధ్వంసం,  దళితులపై హింస జరుగుతున్నది. వీటిని వెలికి తీసి ప్రజాక్షేత్రంలో నిలబెట్టాల్సిన బాధ్యత  పౌరసమాజంపై ఉన్నది. సోషల్‌ మీడియాలో ప్రజల పాత్ర పెరగాలి. అపద్ధాలు, అభూత కల్పనలు, అవాస్తవాలు, అస్లీలత, అహింస కల్పిత వార్తల ద్వారా  సమాజంలో  చీలికలు తెస్తారు.

ఎన్నికల ప్రకారం ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలైనా సక్రమంగా విజయవంతంగా పనిచేయాలంటే దేశంలో స్థిరమైన పౌర సమాజం ఒక అంకుశం మాదిరిగా నిరంతరం పనిచేయవలసి ఉంది. కానీ ఇప్పటికే ఏర్పడి, కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న పౌర సమాజ వ్యవస్థ (సివిల్‌ సొసైటీ) కార్యకలాపాలు, అటు ప్రభుత్వానికీ, ఇటు దేశ పౌరులకూ దిక్సూచిగా పనిచేయడానికి వీలైన వాతావరణం ప్రస్తుత పాలనా వ్యవస్థలో మృగ్యమైపోతోంది.  భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం, పౌర హక్కుల రక్షణ కోసం రాజ్యాంగం లిఖితపూర్వకంగా హామీ పడింది. అయితే వాక్, సభా స్వాతంత్య్రానికి భంగం కలిగించే రీతిలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు నోటి నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి.

ఈ ధోరణిని నాయకులు ఆచరణలో ప్రదర్శిస్తున్నారు. ఈ ధోరణులకు ముగుతాడు వేయాల్సిన బాధ్యత  పౌర సమాజ వ్యవస్థదే. అధికార, అనధికార, పాలక, ప్రతిపక్షాల నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు పారదర్శకంగా, జవాబుదారీతనంతో నడుచుకునే విధంగా చేయడంలో కూడా పౌర సమాజ వ్యవస్థదే కీలకపాత్ర. పౌర సమాజ సంఘాలు, పత్రికలు, మేధావులు  అభ్యుదయాన్ని కాంక్షించాలి. కానీ, నేటి పరిస్థితి, పాలకవర్గాల ధోరణులు దీన్ని మరో కోణంలో వాడుకుంటున్నాయి. ప్రజలను కులం, మతం, ప్రాంతం రొంపిలోకి దింపి  పబ్బం గడుపుకుంటున్నారు. ఇది ప్రమాదకర ధోరణి. ప్రజలలో చైతన్యం తీసుకు రాకుండా సివిల్‌ సొసైటీ నేడు వివిధ స్థాయిల్లో అదిరింపులు, బెదిరింపులు ఎదుర్కొంటోంది.

దేశం నలుమూలల్లో ప్రభుత్వ స్థాయిలో రహస్యంగా డజన్లకొద్దీ సామాజిక కార్యకర్తలను, మానవ హక్కుల పరిరక్షణా సంస్థల నాయకుల్ని, సివిల్‌ సొసైటీ కార్యకర్తల్నీ (డాక్టర్‌ పన్సారే, ప్రొఫెసర్‌ కల్బుర్గీ, దభోల్కర్, గౌరీ లంకేశ్, స్టాన్ స్వామి) హతమార్చిన హంతకుల ఆచూకీ తెలియకుండా పాలక వర్గాలు జాగ్రత్తపడ్డాయి. ఇంతకు ముందెన్నడూ లేనంత స్థాయిలో పాలక శక్తులు పౌర జీవనంలో ప్రతి కోణంలోనూ–ప్రజల ఆహార అలవాట్లు, మత విశ్వాసాలలో, వస్త్రధారణలో జోక్యం చేసుకునే విధానానికి తెరలేపి, సెక్యులర్‌ వ్యవస్థ మౌలిక ప్రయోజనాలనే దెబ్బతీస్తున్నాయని గ్రహించాలి. ఈ విషయంలో స్వామి వివేకానంద, పండిత మదన్‌ మోహన్‌ మాలవీయ సమతుల్యమైన ధోరణి ప్రస్తుత పాలనా విధానాలకు విరుద్ధంగా ఉందని చెప్పాలి. పౌర ప్రజా సంఘాల మధ్య కలిసి పోదాం కలుపుకు పోదాం అన్న ధోరణి ఉండాలి. భావ స్వరూప్యత కలిగిన వ్యక్తులు, సంఘాలు, సంస్థలు  పార్టీలు ఏకతాటిపైకి రావాలి.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక