వర్షాల పరిస్థితులపై సీఎం మరోమారు సమీక్ష

Spread the love

అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో మరోమారు సమీక్షించారు. ఈఉదయం ఒకసారి కలెక్టర్లతో మాట్లాడిన సీఎం, మరోమారు ఫోన్లో వారితో మాట్లాడారు. మొదటిరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు మాట్లాడిన సీఎం, సమావేశం ముగిసిన తర్వాత మరోసారి వారితో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు.
కురుస్తున్న వర్షాలు, ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్‌తో సీఎం మాట్లాడారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను తెరవాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు. సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ. వేయి రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైనంతమేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా రాజీపడాల్సిన అవసరంలేదని సీఎం స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని, ఏం కావాలన్న వెంటనే కోరాలని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని సీఎం స్పష్టంచేశారు. లైన్‌ డిపార్ట్‌మెంట్లకు చెందిన శాఖాధిపతులు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ… తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రప్పించుకుని సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

Leave a Reply