విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నూతన సంవత్సరం సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు తో పాటు హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. ముందుగా అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులందరికీ న్యూ ఇయర్ విషెష్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు వివరించారు. ఈ ఏడాది అన్నింటా శుభం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ ఆదాయం పెరిగి, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.