Suryaa.co.in

Andhra Pradesh

న్యూటెక్‌ బయోసైన్స్‌కు శంకుస్థాప‌న చేసిన సీఎం జ‌గ‌న్‌

ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కరం.. ఇందుకోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలుగా రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పులివెందుల, వేంపల్లిలో అభివృద్ధి పనులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు. పులివెందులలో ఏపీకార్ల్‌ వద్ద న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, ఆర్బీకేలు, రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. రసాయనాలతో కూడిన ఆహారం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తున్నాయ‌ని, ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాల‌న్నారు. ప్రకృతి వ్యవసాయమే ఈ రోజుల్లో అన్నివిధాలా శ్రేయస్కరమ‌ని చెప్పారు. ఏపీలో ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు.

వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై మరింత దృష్టిసారించాల‌ని, గ్రామస్థాయి నుంచి శిక్షణ అవసరమ‌న్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలని కోరారు. ఆర్బీకేల ద్వారా ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవసరమైన శిక్షణ అందిస్తున్నామ‌ని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర‌ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తరఫున పలు చర్యలు చేపడుతున్నామ‌న్నారు. విత్తనం నుంచి విక్రయం వరకూ వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా కేంద్రాలు రైతుల‌కు అండగా నిలుస్తున్నాయ‌ని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు.

LEAVE A RESPONSE