జగన్ ది మాటల ప్రభుత్వమే కానీ, చేతల ప్రభుత్వం కాదు

-మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి

జగన్… పచ్చి అబద్ధాలు, తప్పుడు హామీలు, వాగ్దానాలు, ప్రజల్ని మభ్యపెట్టి, మోసపుచ్చి, ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి వచ్చారు. జగన్ ది మాటల ప్రభుత్వమేకానీ, చేతల ప్రభుత్వం కాదని అందరికీ స్పష్టమైంది. ఏరుదాటేంతవరకు బోటుమల్లప్ప, ఏరు దాటాక బోడి మల్లప్ప అనే చందంలో మాట మార్చాడు, మడమ తిప్పాడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని గాలికి వదిలేశాడు. నేడు రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలతో ఎప్పుడూ కనీ వినీ ఎరగని రీతిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పరిపాలనా వ్యవస్థ అంతా అతలకుతలమైపోయింది. పేదల సంక్షేమాన్ని గాలికొదలి తన సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎలా ధనార్జన చేయాలి? కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి? ఈ డబ్బుతో వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి అనే ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. ప్రజల బాధలు, కష్టాలు, సమస్యలు జగన్ కి పట్టవు. ప్రజా క్షేమం వైపు ఆలోచన చేయడంలేదు. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు వీటన్నింటిని అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను ఉచితంగా ఇచ్చేవారు. నేడు ఇసుక మాఫియాతో ఈ మూడేళ్లు దాదాపు పది కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారు. ఉచిత ఇసుక ఎక్కడా దొరకడంలేదు. 15వందలు ఉండిన ట్రాక్టర్ ఇసుక నేడు దాదాపు 15 వేలు అయింది. చిన్న కార్యకర్త మొదలుకొని మంత్రి వరకు ఈ ఇసుక వల్ల ధనార్జన చేస్తున్నారు. 250 రూపాయలు ఉండిన సిమెంటు బస్తా నేడు 450 రూపాయలు అయింది. భారతీ సిమెంటు వల్లనే సిమెంటు రేట్లు పెరిగాయి. 12వందల కోట్ల ఆదాయం జగన్ కు సిమెంటు వల్ల వస్తోంది. బెల్ట్ షాపులు తీసేస్తాను, మద్యనిషేధం పెడతాను అని అనేక ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన జగన్ నేడు మద్యంతో విజయసాయిరెడ్డి బ్రాండ్, జగన్ బ్రాండ్ లను తయారుచేసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. దాదాపు 20 వేల కోట్ల రూపాయలు ఒక్క మద్యంలోనే వస్తోంది. ఈ డబ్బంతా జగన్ జేబులోకే పోతోంది. ఇండ్ల పట్టాలు ఇస్తామని ల్యాండ్ మాఫియాకు తెరలేపారు. చిన్న చిన్న స్థలాలను తక్కువ రేట్లకు కొని దాదాపు 7 వేల కోట్లు కాజేశారు.

ప్రస్తుతం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ గతంలో టీడీపీ ప్రభుత్వం చేసినవే. ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు టీడీపీలో ఇచ్చినవే. కొత్తగా ఇచ్చినవేమీ లేవు. పెన్షన్ మూడు వేలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ మూడు వేలు ఇవ్వలేదు. మూడు వేలు చూపించాడు అంటే పంగనామాలు పెడుతున్నానని ప్రజలు గ్రహించలేకపోయారు. ఒక్కరికి కూడా పెళ్లికానుక ఇచ్చిన పాపానపోలేదు. చంద్రన్న సంక్రాంతి సరుకులు, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుకలను రద్దు చేశారు. విదేశీవిద్య, కార్పొరేషన్స్ లోన్స్, దుల్హన్ పథకాలను రద్దు చేశారు. 40 సంవత్సరాలు పైబడినవారికి పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. రైతులనూ మోసం చేశారు. ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడెవరంటే జగనే. అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. కోవిడ్, తుఫాన్లు, భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా ఈయనపని ఈయనదే. ఇసుక, సిమెంటు, స్టీలు, గ్యాసు, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువులు, కాయగూరల ధరలు ఆకాశాన్నంటాయి. ఉద్యోగస్థుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయింది. అన్ని విధాలుగా అవినీతే ధ్యేయంగా భావిస్తున్నారు.

రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితులు వచ్చాయి. నరకం ఎక్కడో లేదు రాష్ట్రంలోనే ఉంది. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు ఎవరూ సుఖంగా లేరు. వైసీపీవారు ఏం సాధించారని ప్లీనరీలు పెడుతున్నారు? రాష్ట్రంలో అభివృద్ధి నిల్.. సంక్షోభం ఫుల్. ఇసుక, మట్టి, మద్యం, ల్యాండ్ మాఫియాల భరతం పట్టాలి. టీడీపీ, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, వారిని పీడించడం మానాలి. జగన్ రాజప్రాసాదం నుంచి బయటికి వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. ప్రజల ఆగ్రహావేశాలకు వైసీపీ కొట్టుకుపోతుందని మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి విమర్శించారు.

Leave a Reply