Suryaa.co.in

Andhra Pradesh

అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం

– అసైన్డ్ భూముల లబ్ధిదారులైన పేదలకు సర్వహక్కులు
– జగన్‌ హయంలో దేశం మెచ్చే మేలైన భూసంస్కరణలు
– పేద రైతుల హోదాను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
– 20 ఏళ్లు నిండిన అసైన్డ్‌భూములపై ఆంక్షలు ఎత్తివేత
– ప్రైవేటు భూమిపై ఆ యజమానికి ఉండే హక్కులన్నీ అసైన్డ్ రైతులకూ లభిస్తాయి
– ఆరుగాలం శ్రమించిన రైతు హోదాను పెంచే మహత్తర నిర్ణయమిది
– రాష్ట్ర జీడీపీని పెంచే భూసంస్కరణలివి
– గతంలో ఏ ముఖ్యమంత్రీ తీసుకోని గొప్ప నిర్ణయాలివి..
– మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడి

స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి భూ హక్కుల సంస్కరణ
భూమి యాజమాన్యానికి సంబంధించి మార్పులు, సంస్కరణలు, ప్రయోజనకరమైన నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని మనవి చేస్తున్నాను. స్వాతంత్య్రం రాకముందు ఈ దేశంలో భూమిలేని నిరుపేదలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటే.. ఆనాడు వ్యవసాయం మాత్రమే ఉపాధిమార్గంగా ఉండేది. కనుక.. ఇలాంటి నిరుపేదలకు భూమిని పంపిణీ చేసి వారికి జీవనమార్గం చూపేందుకు అనేక చట్టాలు అమల్లోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ చట్టాల అమలు ద్వారా నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు.

అంటే, స్వాతంత్య్రానికి పూర్వం ఇక్కడ ఎవరికీ వ్యవసాయ భూములు ఉండేవి కావు. ఆ తర్వాత అమల్లోకొచ్చిన చట్టాల ద్వారానే నిరుపేదలకు భూములొచ్చాయి. మొదట్లో వ్యవసాయం తప్ప మరొక ఉపాధిమార్గం ఉండేది కాదు. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక 20 ఏళ్లుగా తమకిచ్చినటువంటి భూమిపై సాగుచేసుకుంటున్న వ్యక్తికి ఆ భూమిపై అన్నిరకాల హక్కుల్ని కల్పించింది ఈ ప్రభుత్వం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి మహత్తర గొప్ప నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేస్తున్నాను.

20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు
1977లో ఏపీ శాసనసభ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ (పీఓటీ)–1977 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏ నేపథ్యంలో వచ్చిందంటే, ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసిన పెద్దలు, ప్రభుత్వం.. బీదలకు ఇస్తున్న భూమి జమీందార్లకు, భూస్వాములకు అమ్మకం చేస్తున్నారని.. తద్వారా వారికి ఉపాధికల్పించడానికి ఇచ్చిన భూమి వారి వద్ద లేకుండా పోతుందనే విషయాన్ని గ్రహించారు.

దీంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటున్న నేపథ్యంలో 1977 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి 40 ఏళ్లు దాటాయి. దేశంలోనూ సమాజంలోనూ అనేక మార్పులు వచ్చాయి. నిరుపేదల్లో అక్షరాస్యత పెరిగింది. గ్రామాల్లో భూస్వాములు, జమీందార్లు లేకుండా.. అందరికీ అనేక ఉపాధిమార్గాలు అందుబాటులోకొచ్చాయి. ఈనేపథ్యంలో ఒక మేజర్‌ సంస్కరణ తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేశారు.

ఆ ఆలోచనే.. మొన్న ఏపీ కేబినెట్‌లో తీర్మానించినట్టుగా, 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపైనున్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. అంటే, ఒక ప్రయివేటు భూమిపై వ్యక్తులకున్న హక్కులన్నీ… నేటికి 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్‌భూమి రైతులకు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.

రైతుహోదాను పెంచే మహత్తర నిర్ణయమిది
ప్రభుత్వం ఇలాంటి మహత్తర సంస్కరణ నిర్ణయం తీసుకురావడంపై కొందరు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. భూముల్ని అమ్ముకోవడానికి హక్కు అని అంటున్నారు. ఇది మంచి అభిప్రాయం కాదంటున్నాను. అసైన్డ్ భూములు పొందిన వారి కుటుంబ జీవనానికి, వారికి ఎలాంటి ఉపాధిలేనప్పుడు సాగు కోసం భూమిని అందజేస్తే, 50ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకుని రైతులు పంట పండిస్తున్నాడు.
సాగుకు యోగ్యంకానటువంటి భూముల్ని సైతం సాగుకు అనుకూలంగా మార్చుకుని.. వ్యవసాయం చేసి తద్వారా తమ జీవనశైలిని మార్చుకుని సమాజంలో ఒక స్థాయికి వచ్చాడు. ఆ స్థాయికి వచ్చినప్పటికీ అతనికి తాను సాగుచేసుకుంటున్న భూమిపై ఎలాంటి హక్కుల్లేవు. ఏదైనా తన అత్యవసర సమయంలో అదొక విలువైన ఆస్తిగా ఉండదు. కనుకనే, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి మంచి సంస్కరణకు శ్రీకారం చుట్టారు.

ఒక ప్రయివేటు వ్యక్తికి తనకున్న ఆస్తిపై ఉన్న హక్కుల మాదిరిగానే.. 20 ఏళ్లపాటు అనుభవంలోవున్న అసైన్డ్ భూమిపై కూడా సాగుచేసే రైతులకు అవే హక్కులు కల్పిస్తూ క్యాబినెట్ లో తీర్మానం చేశారు. దీనర్ధం ఇదేదో అమ్ముకోవడానికి ఇచ్చిన హక్కు కాదు. రైతుకు తన భూమిపై హక్కు ద్వారా తన హోదాను పెంచే నిర్ణయంగా భావించాలి.

ఈ నిర్ణయం వెనక అనేక ప్రయోజనాలు
సమాజంలో తనకంటూ విలువైన ఆస్తిగల భూమిని కలిగి ఉన్నానని చెప్పుకునే హోదా తెచ్చుకోవడం మొదటిది. అంతేకాకుండా, తనకు అవసరమైనప్పుడు.. తన కుటుంబంలో ప్రయోజకులైనటువంటి వారు ఇతర రంగాల్లో అభివృద్ధిలోకొచ్చి స్థిరపడటానికి ఈ భూమి అవసరమైనప్పుడు ఉపయోగపడటం రెండోదిగా చెప్పుకోవాలి. పరిశ్రమలు స్థాపించుకోవడానికి, ఇతరత్రా వ్యాపారాల్ని పెట్టుకోవడానికి, వాటిని విస్తరించుకోవడానికి విలువైనటువంటి ఆస్తిని చూపెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి ప్రయోజనాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక దాగిఉన్నాయని అందరూ తెలుసుకోవాలి.

రైత్వారీ పట్టాపొందిన వారికే ఆ భూమిపై హక్కు
చట్టాలు తెలియక, లేదంటే అన్యాక్రాంతం చేసినా, లేక ఇప్పటికే భూములు అమ్ముకున్నట్లైతే.. వాటిని కొనుగోలు చేసిన వారికి మాత్రం పీఓటీ చట్టంలో రిలీఫ్‌ లేదు. చట్టంలో దాని స్థాయి యథారీతిగానే ఉంది. ఆ భూమిపై హక్కు అప్పట్లో ఒరిజినల్‌ రైత్వారీ పట్టా పొందిన రైతుకు మాత్రమే చెందుతుందని స్పష్టంచేస్తున్నాం. కనుక, ఇప్పటికే సదరు అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసుకున్నవారికి హక్కులు ఉండవని అందరూ అర్ధం చేసుకోవాలి. అసైన్డ్ భూమి పొంది, 20 ఏళ్లకు పైబడి సాగుచేసుకుంటున్న భూమిపై సంబంధిత రైతుకు పూర్తిహక్కుల్ని ఈ ప్రభుత్వం కల్పించిందని నేను స్పష్టంచేస్తున్నాను.

15.21 లక్షల మంది రైతులకు లబ్ధి
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల… రాష్ట్రంలో సుమారుగా 15.21లక్షల మంది అసైన్డ్ రైతులు లబ్ధిపొందుతున్నారు. అంటే, 20 ఏళ్లుదాటి ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నవారి సంఖ్య ఇది. ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 33.29 లక్షల ఎకరాల్ని రైతులకు అసైన్డ్‌ చేయగా 19.21 లక్షలమంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే వీటిల్లో 27.41 లక్షల ఎకరాల భూమిపై ప్రస్తుతం కేబినెట్‌ నిర్ణయంతో ఆంక్షల్ని ఎత్తివేయడం జరుగుతుంది.

భూ రీసర్వే ద్వారా ఇప్పటికే 19 లక్షల మ్యుటేషన్లు
భూమిపైన, భూ వివాదాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం పెట్టినటువంటి శ్రద్ధ మరే ప్రభుత్వం పెట్టలేదని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఉదాహరణకు భూసర్వే విషయానికొస్తే.. గత ప్రభుత్వాలు సర్వే గురించి ఆలోచన చేసి మధ్యలోనే వివిధ కారణాలతో ఆగిపోయిన పరిస్థితి ఉంది. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక భూసర్వే శరవేగంగా జరుగుతోంది. భూమి వినియోగదారులకున్న సమస్యలు, కలతలు, హింస, అశాంతి వంటివన్నీ భూసర్వే ద్వారా మాత్రమే పరిష్కరించబడుతున్నాయి.
ఈ సర్వే ప్రారంభించాక ఇప్పటికే 19 లక్షల మ్యుటేషన్స్‌ జరిగాయి. భూ రికార్డులన్నీ అప్‌డేషన్‌ జరుగుతున్నాయి. దీన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్తున్నాం. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా మనం చేసే భూసర్వేను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మనం అనుసరిస్తున్న విధానాల్నే ఇప్పుడు కేరళ రాష్ట్రం కూడా అనుసరిస్తున్న పరిస్థితిని మనమందరం గమనించాలి.

2.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్య తీర్చాం
ఇక, చుక్కల భూముల విషయానికొస్తే… రాష్ట్రంలో 2.06 లక్షల ఎకరాల భూముల్ని నిషేధిత జాబితా 22(ఏ) నుంచి తొలగించి ఆయా భూ యజమానులకు సర్వహక్కుల్ని కల్పించాం. మరి, ఇలాంటి గొప్ప భూ సంస్కరణలు, నిర్ణయాలను గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయని ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడో వందేళ్లనాడు జరిగిన భూసర్వేలో అప్పట్లో రికార్డులు సరిగ్గా సమర్పించుకోలేని.. సర్వేసమయంలో అందుబాటులో లేని రైతుల భూముల్ని చుక్కల భూములుగా చూపుతూ.. వాటిని నిషేధిత జాబితా 22(ఏ)లో పెట్టారు.
దీంతో లక్షల మంది రైతులు తమ భూములకు సంబంధించి సరైన రికార్డులు లేకుండా.. కోర్టువివాదాల్ని పరిష్కరించుకోలేక నానాయాతన పడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు దీనిపై సానుకూలమైన ఆలోచన చేసి చుక్కల భూముల వివాదాన్ని సునాయాశంగా పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జగన్‌ ప్రభుత్వంలో అనేక భూసంస్కరణలు
అదేవిధంగా బ్రిటీషు కాలంలో షరతులతో కూడిన పట్టాల్ని ఇచ్చిన సుమారు 33,428 ఎకరాలకు సంబంధించి భూముల్ని రైతుల పేరిట రికార్డుల్లోకి నమోదు చేయించాం. ఇల్లులేని నిరుపేదలకు నివాసం నిమిత్తం గతంలో ఇచ్చిన ఇంటిపట్టాల్ని రెగ్యులర్‌ చేస్తూ వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌లు చేయించాం.పేదలకు అసైన్డ్‌ చేసి 10 ఏళ్లు నిండిన ఇంటి నివేశన స్థలాలపై సర్వహక్కులు కల్పించాం.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు లబ్ధిపొందాయి. అదేవిధంగా ఇప్పటికే పట్టాలు పొంది అనుభవంలో ఉన్న సర్వీసు ఈనాం భూములు, లంకభూములును సైతం చట్టబద్ధంగా వాటిని ఇప్పటికే సాగుచేసుకుంటున్న రైతుల పేరిట రికార్డుల్లో చేర్చి వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించడమైంది. లంకభూములకు సంబంధించి 9600 ఎకరాలకు పట్టాల్ని మంజూరు చేశాం. ఇన్నిరకాల భూసంస్కరణల్ని గతంలో ఏ ప్రభుత్వమూ అమల్లోకి తేలేదని గర్వంగా చెబుతున్నాను.

రాష్ట్ర జీడీపీని పెంచే భూసంస్కరణలివి
విలువలేకుండా ఉన్న భూములపై ప్రభుత్వ ఆంక్షలు తొలగించి వాటిపై అనుభవదారులకు సర్వహక్కుల్ని కల్పించడంతో పాటు, వారి సామాజిక హోదాను పెంచడం అనే విషయాల్ని ఈ ప్రభుత్వం ఒక సిద్ధాంతంగా పెట్టుకుంది. ప్రభుత్వ ఆస్తులు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆస్తుల్ని వేర్వేరుగా రికార్డుల్లో చేర్చి.. వివాదాలను పరిష్కరించడంతో, తద్వారా భూముల విలువ పెరిగి రాష్ట్ర జీడీపీ సైతం పెరుగుతోంది.

ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించిన విషయంగా అధ్యయనకారులు చెబుతున్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులను మా జగన్‌గారు ధైర్యంగా చేపట్టి పూర్తిచేస్తున్నారు. కొన్ని లక్షల కుటుంబాల స్థితిగతుల్ని మార్చే ప్రయత్నంగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయాలు పనిచేస్తున్నాయని స్పష్టంచేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్‌ ఇన్ని మహత్తర నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో … రెవెన్యూమంత్రిగా నావంతు పాత్ర నేను దిగ్విజయంగా పోషిస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉన్నానని మనవిచేసుకుంటున్నాను.

LEAVE A RESPONSE