–మాట మార్చడం, ప్రజలనుఏమార్చడం రేవంత్ నైజం
–కేసీఆర్ పాలనలో రైతేరాజు, కాంగ్రెస్ రైతుకు పట్టిన బూజు
–గల్లీలో గప్పాలు కొడుతుండు, డిల్లీలో కప్పాలు కడుతుండు
-ఇక్కడి లగచర్ల నుంచి అక్కడి బనకచర్ల వరకు రేవంత్ ది కుట్రకోణ మే
-బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రైతాంగా నికి ఎవరేం చేశారో తేల్చుకుందామని సవాల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడకుండా ఢిల్లీకి పారిపోయిండ ని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సోమాజీగూడా ప్రెస్ క్లబ్లో మీడియా, ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రితో చర్చించడానికి ఆధారాలతో సహా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ కు భయపడి ముఖ్యమంత్రి ఢిల్లీకి పారిపోవడాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యా నించారు. మాట మార్చడం, ప్రజలను ఏమార్చడం రేవంత్ నైజం అని ఆయన విమర్శించారు. పచ్చి బూతులు మాట్లాడుతూ
రచ్చ చేయడం తప్ప, ప్రజాస్వామ్యబద్దంగా చర్చ చేయడం రేవంత్ కు తెలియదని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే కనీసం ఉప ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ చర్చకు రావాలని కేటీఆర్ కోరినా రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
అన్నూమిన్ను కానకుండా రంకెలు వేయడం, తొడలు గొట్టడం, పనికి మాలిన సవాళ్లు విసిరి పత్తాలేకుండా పారిపోవడం రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తెలిపారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులు రాజులుగా వెలుగొందారని ఆయన గుర్తు చేస్తూ కాంగ్రెస్ రైతులకు పట్టిన బూజు అని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ అవినీతికర, అవకాశవాద, అరాచక, దగాకోరు పాలనలో రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా రని జీవన్ రెడ్డి ఆరోపించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరతతో రైతాంగం సతమతమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శించారు. ఆధార్‌కార్డు మీద ఇచ్చే ఒక్క యూరియా బస్తా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాస్తున్న దృశ్యాలు చూస్తుంటే సమైక్యాంధ్ర పాలకుల రోజులు మళ్ళీ రాజుకొని వచ్చాయనిపిస్తోందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నిజంగానే పాత దుర్దినాలను మళ్లీ తెచ్చిందని, కరెంటు కోతలు, జనరేటర్ మోతలు, ట్రాన్స్ ఫార్మర్ల పేలుళ్ల రోజులు మళ్లీ వచ్చాయని ఆయన అన్నారు. తెలంగాణ అన్నదాతల చేతికి సున్నం పెడుతూ గురువు చంద్రబాబు కోసం కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి ధారాదత్తం చేస్తున్న రేవంత్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని ఆయన పేర్కొన్నారు.
ఇక్కడి లగచర్ల నుంచి అక్కడి బనకచర్ల వరకు రేవంత్ ది కుట్రకోణమేనని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగ సమస్యలపై చర్చకొస్తే కాంగ్రెస్ బండారం బయట పడేదని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ గల్లీలో గప్పాలు కొడు తుండు, డిల్లీలో కప్పాలు కడుతుండు అని ఆయన ఎద్దేవా చేశారు. పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పెద్దల చుట్టూ, కేసుల మాఫీకి బీజేపీ నేతల చుట్టూ తిరగడం రేవంత్ కు దినచర్యగా మారిందన్నారు. ఇదేనా రాహుల్ గాంధీ వద్ద రేవంత్ రెడ్డి చేసే ఉద్యోగం? అని ఆయన ప్రశ్నించారు. కాలం చెల్లిన కాంగ్రెస్ కనుమరుగయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రేవంత్ రెడ్డి మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.