– ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్న విషయం తెలిసినా, ప్రెస్ క్లబ్లో చర్చకు పిలిచి నాటకమాడారు
– మీడియా స్పేస్ కోసం భారతీయ జనతా పార్టీని ఇబ్బందిపెట్టేలా బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు కుట్రలు
– మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు
హైదరాబాద్ : నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్ అనే విధంగా బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వివిధ అంశాలపై చర్చల పేరుతో చేసుకుంటున్న సవాళ్లు, ప్రతిసవాళ్ల పంచాయితీ రాజకీయ నాటకంలో భాగమే.
ఈ నాటకాన్ని తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదిక శాసనసభ లేదా పార్లమెంట్. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకపోవడం, మా మెదక్ పార్లమెంట్ ప్రజల ఘన విజయం, గర్వకారణం. బీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడే కార్యక్రమాన్ని దుబ్బాకలో బిజెపి కార్యకర్తలు మొదటగా ప్రారంభించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ను ఓడించారు.
గజ్వేల్, సిద్దిపేట లాంటి తమ గడపలుగా చెప్పుకునే నియోజకవర్గాలున్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రజలు నన్ను గెలిపించడం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకానికి ఫుల్స్టాప్ పెట్టారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, మీడియా స్పేస్ కోసం భారతీయ జనతా పార్టీని ఇబ్బందిపెట్టేలా బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. కానీ బీజేపీ కార్యకర్తల ధైర్యం, లక్ష్యం ముందు ఇతర రాజకీయ పార్టీలు నిలబడలేవన్నది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ గెలుపే నిదర్శనం.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. ట్రాక్టర్లకు డీజిల్, గ్రామ పంచాయతీలకు కరెంట్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడుతూ, నిధుల మళ్లింపులు చేస్తూ, ఇటీవల ‘రైతు భరోసా’ పేరుతో కొంతమందికి మాత్రమే కొంతమేర నిధులు విడుదల చేసింది. ఇది పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసమే.
ఉనికి కోసం, గుర్తింపు కోసం బీఆర్ఎస్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. వాటిలో భాగంగానే నిన్న కేటీఆర్ ఆడిన నయా డ్రామా. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్న విషయం తెలిసినా, ప్రెస్ క్లబ్లో చర్చకు పిలిచి నాటకమాడారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు, జీహెచ్ఎంసీలో నిలిచిపోయిన పనులు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల అంశాలపై చర్చ జరపాలి.
బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర శాసనసభ సమావేశాలను ప్రారంభించి ప్రజా సమస్యలపై చర్చించాలి. ప్రజలను మభ్యపెట్టేలా ప్రెస్ క్లబ్ లేదా ఇతర వేదికల్లో చర్చల పేరుతో నాటకాలు వేయొద్దని కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలకు హితవు చెబుతున్నాం.
మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా మారుతోంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బిజెపి జయకేతనం ఎగురుతోంది. అందుకు నిదర్శనం భారతీయ జనతా పార్టీలో పెద్దఎత్తున జరుగుతున్న చేరికలే.