హైదరాబాద్: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ లేఖపై సమీక్షలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ లేఖ పంపించారు. లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు సీఎం వివరించారు. ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి… ప్రాజెక్టువారీగా అనాలసిస్ చేసి పూర్తిస్థాయి నివేదికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని డ్యామ్ లపై స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశిస్తూ, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపైనా చర్చించారు. బ్యారేజీల రిపేర్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులవారీగా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా… తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.