-నువ్వు వస్తావో.. నీ అయ్య వస్తాడో రండి
-మార్చి 2న మరో 6వేల ఉద్యోగాలు భర్తీ
-ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా?
-కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
– చేవెళ్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత మాది. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపించుకోవాలి. ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తాం. తెలంగాణ ప్రజలకోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసాం. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాం.
మార్చి 2న మరో 6వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఓర్వలేని బీఆరెస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై శాపనార్ధాలు పెడుతుండ్రు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా? బీఆరెస్ పాలనలో పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో దర్శనమిచ్చేవి. కానీ మా ప్రభుత్వం ఒక్కొక్క చిక్కుముడిని విప్పి ఉద్యోగాలు భర్తీ చేసింది. ఈ వేదికగా కేటీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా. మగాడివైతే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు. నువ్వు వస్తావో.. నీ అయ్య వస్తాడో రండి.
మేం అల్లాటప్పగాళ్లం కాదు.. నేనేమీ అయ్యపేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదు. ప్రజల కోసం అక్రమ కేసులు ఎదుర్కొని, లాఠీ దెబ్బలు తిని, చర్లపల్లి జైలుకు వెళ్లా. నిన్ను, మీ అయ్యను, నీ బావను బొందపెట్టి ప్రజలు మమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ కుర్చీ మా కార్యకర్తల పోరాటంతో వచ్చింది. సోనియమ్మ ఇచ్చిన మాట శిలాశాసనం. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.
గుజరాత్ మోడల్ అంటే హామీలు ఇచ్చి మోసం చేయడమా? ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపడమా? మళ్లీ మోదీని ప్రధానిని చేయాలని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు ప్రధాని పదవిలో ఉన్న మోదీ రాష్ట్రానికి ఏం చేశారు? ఇన్నాళ్లు కలిసి పనిచేసిన కేడీ-మోడీ.. ఇప్పుడు ఇద్దరూ తాము వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
పేదలకు ఇండ్లు కట్టివ్వలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు…ఇదేనా గుజరాత్ మోడల్? చేవెళ్ల పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతీ ఎకరానికి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.