ఆళ్లకు గుంటూరు ఎంపీ.. చిలకలూరిపేటకు అంబటి?

-సత్తెనపల్లి సీటు కోసం మద్దాలి, గుబ్బా పోటీ

మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అక్కడ సీటు లేదని స్పష్టమయింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు మంగళగిరి సీటు ఖరారు చేశారు. వైసీపీ అధినేత జగన్‌పై అలిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఆళ్ల, మళ్లీ ఘర్‌వాపసీ వచ్చేశారు. అయితే ఆయనను గుంటూరు ఎంపీగా బరిలో దింపాలని నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ఆయనతో పార్టీ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా సతె్తనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబును చిలకలూరిపేట నుంచి బరిలో దింపాలని నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనీని గుంటూరుకు మార్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొద్దిరోజుల్లో ప్రకటన వెలువడవచ్చంటున్నారు.

అయితే సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైశ్య వర్గానికి చెందిన మద్దాలి గిరి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్ పోటీ పడుతున్నారు. వైశ్య వర్గానికి జిల్లాలో ఎక్కడా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో, సతె్తనపల్లి నుంచి తమకు అవకాశం ఇవ్వాలని వారిద్దరూ నాయకత్వాన్ని కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply