Suryaa.co.in

Telangana

గవర్నమెంట్ నడపడం చేతగాని ఓ చిల్లర సీఎం రేవంత్ రెడ్డి

– పడావు బడ్డ నేలను కోటి ఎకరాల సస్యశ్యామల మాగాణంగా మార్చినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా?
– ఇదే కాళేశ్వరం ప్రాజెక్టును వేరే దేశంలో కడితే కేసీఆర్ తో పాటు ప్రాజెక్టు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది
– కానీ మనదేశంలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుసంస్కారం, కుచ్చితమైన రాజకీయాలకు పావుగా మారింది
– కేసీఆర్ ను పిలిచి ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే
– రేవంత్ రెడ్డి అనే చిల్లర వ్యక్తికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు
– రేవంత్ రెడ్డి గురువునే కరకట్టకు తరిమేసిన కేసీఆర్ వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరంను వేరే దేశంలో కడితే కేసీఆర్ తో పాటు ఆ ప్రాజెక్టు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. బీజేపీ, కాంగ్రెస్ ల కుట్రపూరిత రాజకీయాల్లో పావుగా మారడమే విషాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను దాటిపోయేలా చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాళేశ్వరంను నాలుగేళ్లలోనే కట్టి తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకు నోటీసులు ఇస్తారా అని నిలదీశారు. కేసీఆర్ ను పిలిచి ఇరిగేషన్ గురించి అడగడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే అన్నారు. రేవంత్ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తికి వంద జన్మలెత్తినా కేసీఆర్ గొప్పతనం అర్థం కాదన్నారు.

కాళేశ్వరం కమీషన్ విచారణకు కేసీఆర్ హాజరైన నేపథ్యంలో బీఆర్కే భవన్ ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్, తనకు పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఓ ఐదు నిమిషాలు కూసొని కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటో తెలుసుకోవాలన్నారు.

తెలంగాణలోని వాగులు, వంకలు, నదులు, చెరువులపై కేసీఆర్‌కు ఉన్నంత సంపూర్ణ అవగాహన సమకాలీన రాజకీయాల్లో ఈ దేశంలో మరే నాయకుడికి లేదన్నారు కేటీఆర్. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాలను దాటిపోయేలా తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చి, భారతదేశంలో అగ్రభాగంలో నిలబెట్టినందుకు కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంను కేవలం నాలుగేళ్లలో నిర్మించినందుకు నోటీసులు ఇస్తారా అని నిలదీశారు.

కేసీఆర్‌ను ఇరిగేషన్ గురించి మాట్లాడమని పిలవడం “హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే” అన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుందన్నారు.

రేవంత్ రెడ్డి ది అసమర్థ నాయకత్వం, చిల్లర రాజకీయాలు

రేవంత్ రెడ్డి ఓ చిల్లర ముఖ్యమంత్రి, గవర్నమెంట్ నడపడం చేతగాని నాయకుడన్న కేటీఆర్, మంత్రులకు శాఖలు కేటాయించే అధికారం కూడా లేని ముఖ్యమంత్రిగా, ఢిల్లీకి వెళ్లి పోర్ట్‌ఫోలియోలు నిర్ణయించుకునే దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
రేవంత్ రెడ్డికి క్యాబినెట్ అంటే అర్థం కాదని, కేబినెట్ ఎలా పనిచేస్తుందో తెలియదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షసానందం, పైశాచిక ఆనందమే రేవంత్ రెడ్డికి ముఖ్యమని, ఆయన ఆలోచనలు విధ్వంసకరమైనవని విమర్శించారు. రేవంత్ రెడ్డి గతంలో “చిల్లర పనులు” చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టే, బీఆర్ఎస్ నాయకులను కూడా జైల్లో పెట్టాలనే వికృత ఆలోచనతో ఉన్నాడని ఆరోపించారు.

కాళేశ్వరం పై కుట్రలు – ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. 94 వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలివితక్కువ వాళ్లే అంటారని, రేవంత్ రెడ్డి భార్య గీత తండ్రి సూదిని పద్మారెడ్డి స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
తనకు పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఓ ఐదు నిమిషాలు కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలని సూచించారు. కాళేశ్వరం, ఫోన్ టాపింగ్, ఫార్ములా ఈ రేసింగ్ వంటి విషయాలను ముందుపెట్టి 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల దృష్టిని మరల్చలేరని స్పష్టం చేశారు.

త్వరలోనే కాంగ్రెస్ ను బజార్లో నిలబెడతాం

తమను ఎన్ని రకాలుగా వేధించినా వదిలిపెట్టమని, కాంగ్రెస్ పార్టీని “బొంద పెట్టేదాకా” వెంటాడుతామని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపైనే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ చిల్లర రాజకీయాలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో “బట్టలిప్పి నిలబెట్టే” విధంగా తమ కార్యాచరణ ఉంటుందని, రాష్ట్ర ప్రజలంతా దీనికి మద్దతు ఇవ్వాలని కోరారు.

కమీషన్ ముందు సమర్థవంతమైన సమాధానాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కమీషన్ ముందు అన్ని చర్చలు జరుగుతాయని, ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమర్థవంతమైన సమాధానాలు తమ నాయకులు ఇస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్‌తో కాంగ్రెస్, బీజేపీ నాయకుల “ఫీజులు ఎగిరిపోయాయని”, ప్రజలకు కూడా వాస్తవాలు అర్థమైపోయాయన్నారు. కొత్తగా చెప్పడానికి లేదా అడగడానికి ఏమీ లేదని, సాంకేతికంగా పిలవాల్సి వచ్చినందునే కేసీఆర్‌ను పిలిచినట్టు తాను భావిస్తున్నానని చెప్పారు.

రేవంత్ రెడ్డివి విధ్వంసకర ఆలోచనలు

రేవంత్ రెడ్డి కూలగొట్టడానికే వచ్చాడు, కట్టడానికి రాలేదని కేటీఆర్ విమర్శించారు. పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడం తప్ప, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మించడం ఆయనకు చేతకాదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆలోచనలు విధ్వంసకరమైనవని, రాజకీయ వేధింపులు, కక్షసాధింపులతో నడుస్తున్నాయన్నారు. వంద జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లర వ్యక్తికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదన్న కేటీఆర్, రేవంత్ రెడ్డి గురువునే కరకట్టకు తరిమేసిన కేసీఆర్ వెంట్రుక కూడా ఎవరూ పీకలేరన్నారు. నిజాలు బయటికి వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు.

 

LEAVE A RESPONSE