Home » చర్చలకు సీఎంఓ నన్ను రమ్మన్నా.. వాళ్లు నాకు చెప్పలేదు

చర్చలకు సీఎంఓ నన్ను రమ్మన్నా.. వాళ్లు నాకు చెప్పలేదు

– ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారు
– నేనే గొప్ప అనే అహంకారం వల్లే అందరం కలవలేకపోతున్నాం
– ఇక్కడ ఏదీ శాశ్వతం కాదని అందరూ తెలుసుకోవాలి
– చిరంజీవి అండ్ కోపై మోహన్‌బాబు పరోక్ష విమర్శలు

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని నటుడు మోహన్‌బాబు విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రితో భేటీకి తనకు కూడా ఆహ్వానం ఉందని.. కానీ కావాలనే కొందరు తనని దూరం పెట్టారని మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ రిలీజ్ అయ్యింది.

చిత్ర పరిశ్రమ మొత్తం ఒకటే కుటుంబం అంటూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని నటుడు మోహన్‌బాబు విమర్శించారు. మూడేళ్ల తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. తాజాగా ఆయన ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో చోటుచేసుకున్న వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రితో భేటీకి తనకు కూడా ఆహ్వానం ఉందని.. కానీ కావాలనే కొందరు తనని దూరం పెట్టారని మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిశ్రమలో పలువురు ఆర్టిస్టులు భారీగా పారితోషికం తీసుకుంటున్నారనే వార్తలపై స్పందించమని విలేకరి కోరగా.. “ఇతర ఆర్టిస్టులు, వాళ్లు తీసుకుంటున్న పారితోషికాలపై కామెంట్‌ చేయను. నా గురించి మాత్రమే నేను మాట్లాడతాను. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారు. బయట రాజకీయాల మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఎవరికి వారే గ్రేట్‌ అనుకుంటున్నారు. నా దృష్టిలో ఎవరూ గొప్ప కాదు. మనం చేసే పనులన్నింటినీ పైన భగవంతుడు చూస్తున్నాడు”

“సినిమా టికెట్‌ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడటానికి అందరం కలిసి వెళ్దామని రెండు నెలల క్రితం బహిరంగ లేఖ విడుదల చేశాను. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నటీనటులు, జూనియర్‌ ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉన్నారన్నారు. బిజీగా ఉన్నప్పటికీ సమయం తీసుకుని చర్చించడానికి రావాలి. కానీ ఎవరూ స్పందించలేదు. ఎందుకంటే వాళ్లకు ఈగో. నిజం చెప్పాలంటే, నేనే గొప్ప అనే అహంకారం వల్లే అందరం కలవలేకపోతున్నాం. కానీ, గతంలో అలా ఉండేది కాదు.. అన్ని చిత్రపరిశ్రమలకు చెందిన స్టార్‌ హీరోలు, ఇతర నటీనటులందరం కలిసి ఒకే చోట కూర్చొని ఎన్నో విషయాలపై మాట్లాడుకునేవాళ్లం”

“ఇటీవల సినిమా టికెట్‌ ధరల విషయంపై పలువురు సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రితో చర్చించడానికి వెళ్లారు. సీఎంవో నుంచి నాకు కూడా ఆహ్వానం ఉంది. నన్ను కూడా చర్చలకు పిలవాలని వారికి ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ విషయాన్ని వాళ్లు నాకు చెప్పలేదు. నన్ను రమ్మనీ పిలవలేదు. వాళ్లు పిలిచినా, పిలవకపోయినా.. నాకంటూ ఒక చరిత్ర, గౌరవం, విలువ ఉంది. నా పని నేను చేసుకుంటున్నాను. ఎదుటివాళ్లకు చేతనైనంత సాయం చేస్తున్నాను. నా గురించి ఎవరో ఏదో అనుకుంటే అది వాళ్ల కర్మ. ఎదుటివాళ్ల మాటల్ని పట్టించుకోను. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదని అందరూ తెలుసుకోవాలి.” అని మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply