కాంగి‘రేసు’ … కిస్సా కుర్సీకా

– కాంగ్రెస్‌కు 80 సీట్లు దాటే అవకాశంపై భారీ అంచనాలు
– సీఎం రేవంతా?భట్టినా?
– ఇద్దరూ పాదయాత్రికులే
-ఇద్దరూ కాంగ్రెస్‌కు ఊపరిపోసిన నేతలే
– అందరి అంచనాలూ రేవంత్‌పైనే
– రేవంత్ వచ్చాకనే కాంగిరేసు వేగం పెరిగిందన్న భావన
– రేవంత్ ఉంటేనే బీఆర్‌ఎస్ భూస్థాపితం అవుతుందన్న విశ్లేషణ
– అదే జరిగితే భట్టికి డిప్యూటీ సీఎం ఇస్తారన్న ప్రచారం
– కానీ కాంగ్రెస్ లెక్కలు వేరంటున్న సీనియర్లు
– కర్నాటకలో కష్టపడిన డికెకు సీఎం ఇవ్వలేదని విశ్లేషణ
– వ్యక్తుల కంటే విధేయత, సీనియారిటీకే పట్టం కట్టే కాంగ్రెస్
– భట్టికి కలసిరానున్న దళిత కార్డు
– సీనియారిటీ, విధేయతలో ముందున్న భట్టి
– భట్టికి సీఎం ఇస్తే దళితులు కాంగ్రెస్ వైపు వస్తారన్న అంచనా
– అదే జరిగితే రేవంత్‌కు డిప్యూటీ సీఎం, కీలక శాఖలు?
(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ఎన్నికల్లో కాంగి‘రేసు గుర్రాని’దే పై ‘చేయి’ అని దాదాపు అన్ని సర్వే సంస్థలూ ఘోషిస్తున్న నేపథ్యంలో.. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, సీఎం ఎవరన్న చర్చ కూడా ముందస్తుగానే తెరపైకి వచ్చింది. దానితో సహజంగా కాంగ్రెస్‌లో కిస్సా కుస్సీకా రాజకీయాలపై ఆసక్తి మొదలయింది. అందులో భాగంగా సీఎం సీటు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ, ఇంటా-బయటా కనిపిస్తోంది. ఆ ప్రకారంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇద్దరి పేర్లే చర్చలోకి వచ్చింది.

మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితం ఊపిరిపోసుకోనుంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ వచ్చిన సర్వే సంస్థల ఫలితాలు, పోలింగ్ సరళి, స్థానిక పరిణామాల ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని స్పష్టమవుతోంది. మ్యాజిక్ ఫిగర్ 60 అయినప్పటికీ, వివిధ జిల్లాల్లో ఊపు-ఉత్సాహం పరిశీలిస్తే, అంచనాలకు మించి కాంగ్రెస్‌కు 80 సీట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

అంటే కాంగ్రెస్‌కు ఓట్లు సునామీలా పోలయ్యాయని అర్ధమవుతోంది. ఖమ్మం-నల్లగొండ వంటి జిల్లాలు బీఆర్‌ఎస్‌ను ఊడ్చిపెడతాయన్న నివేదికలు, వివిధ సర్వే సంస్థల నుంచి అందుతున్నాయి. గతంలో బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సర్వే నిర్వహించిన ఆరా సర్వే సంస్థ సైతం.. కాంగ్రెస్‌ను విజేతగా ప్రకటి ంచడాన్ని విస్మరించకూడదు. ఆరా సర్వే సంస్థకు ఎన్నికల సర్వేలో విశేష అనుభవం-విశ్వసనీయత ఉందన్నది గమనార్హం.

ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ గెలిస్తే, సీఎం ఎవరు అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజం. కాంగ్రెస్‌లో చాలామంది సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు- సమీకరణలు నిశితంగా పరిశీలిస్తే.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇద్దరి పేర్లే ప్రధానంగా చర్చకు రావటం విశేషం. గతంలో పీసీసీ అధ్యక్షులు- సీఎల్పీ నేతగా ఉన్న వారికి, సీఎం పదవులు వచ్చిన సందర్భాలు కాంగ్రెస్‌లో లేకపోలేదు. ఆ కోణంలో పరిశీలిస్తే.. రేవంత్-భట్టి ఇద్దరూ ఆ పదవికి అర్హులేనన్న భావన ఏర్పడటం సహజం.

దానికి సంబంధించి కూడికలు-తీసివేతలు పరిశీలిస్తే.. సహజంగా అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సీఎం పదవి దక్కాలన్నది.. కాంగ్రెస్‌లో యువకులు, మెజారిటీ నేతల భావన. నిండా గాయాలతో ఆసుపత్రిలో చేరి.. వైకల్యంతో బయటపడిన కాంగ్రెస్‌ను పంచకల్యాణి గుర్రంలా పరిగెత్తించిన ఘనత, రేవంత్‌రెడ్డిదేనన్నది మనం మనుషులం అన్నంత నిజం. రేవంత్ ఇమేజ్‌ను రాహుల్-ప్రియాంక-ఖర్గే కళ్లారా చూశారు కూడా.

రేవంత్ చేసిన పాదయాత్ర పార్టీ శ్రేణులను కదిలించింది. బీజేపీ నేత సంజయ్ దూకుడు-ఉధృతితో.. కాంగ్రెస్‌ను దాదాపు మర్చిపోయిన జనాలను, రేవంత్ తన పాదయాత్రతో కాంగ్రెస్ వైపు మళ్లేలా చేయగలిగారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌కు, ఊపిరిలూదిన యువనేత రేవంత్ అన్నది నిష్ఠుర నిజం. మెడమీద తల ఉన్న ఎవరైనా అంగీకరించాల్సిన నిజమిది. ఆ కోణంలో చూస్తే రేవంత్‌రెడ్డికే సీఎం ఇవ్వాలన్నది కాంగ్రెస్ శ్రేణుల వాదన.

ఇక కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి కాపు కాస్తున్న, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సామర్థాన్నీ తక్కువ చేయడం అసలు కుదరదు. భట్టి పోషించిన పాత్ర అలాంటిది మరి! ఆయన పాదయాత్ర కూడా కాంగ్రెస్‌ను జనంలోకి తీసుకువెళ్లింది. బీఆర్‌ఎస్-బీజేపీ మధ్యనే పోటీ ఉందనుకున్న ఆ సమయంలో, భట్టి తన పాదయాత్ర ద్వారా, రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా ఉందని చాటేందుకు ఆయన పాదయాత్ర దోహదపడింది. ఇక శాసనసభలో కాంగ్రెస్ సంఖ్యాబలం స్వల్పమే అయినప్పటికీ, బలమైన గళమే వినిపించడంలో భట్టి సక్సెస్ అయ్యారు.

సభలో భట్టిది దాదాపు ఒంటరి పోరాటమే. అధికార పార్టీ మందబలంతో, విపక్షాల నోటికి తాళం వేసినప్పటికీ.. కేసీఆర్ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టి, ప్రజా సమస్యలు-సర్కారు వైఫల్యాలను ఏకరవు పెట్టడంలో భట్టి విజయం సాధించారు. ఆ ప్రకారంగా భట్టికే సీఎం పదవి ఇవ్వాలన్నది, కాంగ్రెస్‌లో మరొక వాదన. పైగా దళితుడు, పార్టీకి విధేయుడైన భట్టికి సీఎం పదవి ఇవ్వడమే సరైనదన్నది వారి విశ్లేషణ.
సీఎం సీటుపై అటు రేవంత్-ఇటు భట్టి అనుకూల వాదనలు ఎలాగున్నా… సీఎం ఎవరన్నది నిర్ణయించాల్సింది కాంగ్రెస్ నాయకత్వమే. ఎవరి లెక్కలు వారికున్నా.. కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు సెపరేటు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన ఘనత, డికె శికుమార్‌దే అన్నది మెడ మీద తల ఉన్న ఎవరైనా అంగీకరించి తీరాల్సిందే.

సోనియా వద్ద పూర్తి స్వేచ్ఛ తీసుకుని, పీసీసీ చీఫ్‌గా సొంత వనరులతో పార్టీని గద్దెనెక్కించిన డికెకు సీఎం పదవి ఇవ్వకుండా.. చివరాఖరకు కాంగ్రెస్ హైకమాండ్ మొండి చేయి చూపింది. డికె శివకుమార్ తీహార్ జైల్లో ఉన్నప్పుడు, పార్టీ అధినేత్రి సొనియాగాంధీ ఆయనను పరామర్శించేందుకు స్వయంగా జైలుకు వెళ్లారు. తనకు అత్యంత సన్నిహితుడైన చిదంబరం సహా… దేశంలో ఎంతోమంది కాంగ్రెస్ నాయకులను బీజేపీ సర్కారు జైళ్లలో పెట్టినా, సోనియాగాంధీ జైలుకు వెళ్లి ఎవరినీ పరామర్శించిన దాఖలాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు.

అలాంటిది డికె శివకుమార్‌ను సోనియా పరామర్శించినప్పటికీ, సీఎం పదవి వచ్చేసరికి ఆయనకు బదులు, సిద్దరామయ్యకు ఇచ్చింది. కాకపోతే పేరుకు సిద్దరామయ్య సీఎం అయినప్పటికీ…కీలక శాఖలు అప్పగించి, పెత్తనమంతా డికెకే ధారాదత్తం చేశారు. అది వేరే విషయం. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కర్నాటకనే కాంగ్రెస్‌ను అన్ని విధాలా ఆదుకుంది. అది కూడా శివకుమార్ పుణ్యమేనన్నది బహిరంగ రహస్యం కాంగ్రెస్ రాజకీయాలు ఇలా ఊహించని విధంగానే ఉంటాయి. ఆ కోణంలో చూస్తే, రేవంత్‌కు సీఎం పదవి రావడం కష్టమన్నది కాంగ్రెస్ సీనియర్ల అంచనా.

ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం కర్నాటక ఫార్ములానే తెలంగాణలోనూ అమలుచేస్తే, రేవంత్‌కు సీఎం పదవి దక్కడం కష్టమన్నది సీనియర్ల విశ్లేషణ. కాకపోతే రేవంత్‌కు డిప్యూటీ సీఎంతోపాటు కీలక శాఖలు కట్టబెట్టి, డికె మాదిరిగా పూర్తి స్వేచ్ఛ అవకాశం లేకపోలేదంటున్నారు. అదే రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే.. భట్టికి డిప్యూటీ సీఎం ఇవ్వవచ్చన్నది వారి విశ్లేషణ.

అయితే.. లోక్‌సభ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున, ఆలోగా బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెట్టడం ద్వారా.. ఆ పార్టీని నిర్వీర్యం చేయాలంటే, రేవంత్ సీఎం అయితే సాధ్యమని పార్టీవాదులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రేవంత్.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బాధితుడు కాబట్టి, ఆయనకుండే సీరియస్‌నెస్ భట్టికి ఉండదన్నది వారి భావన. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేయాలంటే రేవంత్ వంటి దూకుడు-వ్యూహకర్త అవసరం అన్నది వారి అభిప్రాయం.

కానీ భట్టికి సీఎం పదవి ఇస్తే.. రాష్ట్రంలోని మాల-మాదిగ వర్గాలన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే, అది లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకే ఫాయిదా అన్నది మరికొన్ని వర్గాల విశ్లేషణ. ‘‘భట్టి అందరికీ అందుబాటులో ఉండే నేత-లౌక్యం ఉన్న నేతగా గుర్తింపు ఉంది. కానీ రేవంత్‌పై ఆ ముద్ర లేదు. ఆయన ఒక గిరి గీసుకుని ఆ మేరకు వ్యవహరిస్తారు. అందువల్ల అన్ని వర్గాలూ ఆయన వద్దకు వెళ్లలేరు’’ అని మెదక్‌కు చెందిన ఓ సీనియర్ నేత విశ్లేషించారు. పైగా డిప్యూటీ స్పీకర్, విపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉన్నందున.. భట్టికే సీఎం ఇచ్చే అవకాశాలు ఎక్కువన్నది వారి విశ్లేషణ. ఏదైనా.. కాంగ్రెస్ గెలిచి నిలిస్తే, రేవంత్ లేదా భట్టిలో ఒకరికి మాత్రమే సీఎం అయ్యే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.

Leave a Reply