భారత కమ్యూనిస్టు పార్టీ, పూర్వ ప్రధాన కార్యదర్శి కా. సురవరం సుధాకర్ రెడ్డిగారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. కా.సుధాకర్ రెడ్డిగారితో నాకు దశాబ్దాల ఉద్యమానుబంధం ఉన్నది. నేను అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ లో చేరే నాటికే సుధాకర్ రెడ్డిగారు ఏఐఎస్ఎఫ్, జాతీయ ప్రధాన కార్యదర్శి (1966~69)గా బాధ్యతలు నిర్వహించారు.
అమరజీవి కా.సి.కె. చంద్రప్పన్ గారితో కలిసి కా. సుధాకర్ రెడ్డిగారు అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ నాయకులుగా ఉన్న కాలంలో (1977) నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా, 18 సం.లకు ఓటు హక్కు కల్పించాలన్న ప్రధానమైన డిమాండ్స్ తో డిల్లీలో నిర్వహించిన విద్యార్థి ~ యువజన మహా ప్రదర్శనలో పాల్గొన్నాను.
కా. సుధాకర్ రెడ్డిగారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో నేను రాష్ట్ర పార్టీ నాయకత్వంలో భాగస్వామిగా ఉండి, పలు బాధ్యతలు నిర్వహించాను. 2000 సం.లో విద్యుత్ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ ఉద్యమం సందర్భంగా బషీర్ బాగ్ లో పోలీసు కాల్పులు మా కళ్ళ ముందే జరిగాయి.
కాల్పులకు ముందు మాతో పాటు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు కా.గుమ్మడి నరసయ్య, కా.వేములపల్లి వెంకట్రామయ్య, కా.గుర్రం విజయకుమార్, కా.పశ్యపద్మ, మొత్తం 23 మందిని అరెస్టు చేసి, పోలీస్ వ్యాన్ లో నిర్బంధించారు. ఆ దృశ్యాలన్నీ నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఉద్యమానుభవాలు, స్మృతులు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
కా. సురవరం సుధాకర్ రెడ్డిగారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, కా.విజయలక్ష్మిగారికి, నిఖిల్, కపిల్, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా.
టి. లక్ష్మీనారాయణ