Suryaa.co.in

Telangana

కాంగ్రెస్, బిజెపి నాయకులను గ్రామాల్లో తిరగబోనివ్వం

– బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ముఖ్యమంత్రి అమలు చేయాల్సిందే
– బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రంపై కాంగ్రెస్, బీజేపీ ఒత్తిడి తేవాలి
-గ్రామాల వారీగా కులాల వారీగా బీసీ జనాభా వివరాలు బయటపెట్టాలి
– బీసీల జనాభాను తగ్గించి… ఓసీల జనాభాను పెంచిన కాంగ్రెస్ సర్కార్
-ఇచ్చిన మాట ప్రకారం ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
-కామారెడ్డి బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కామారెడ్డి: రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే కాంగ్రెస్, బిజెపి నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. “కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ ఎక్కడైతే చేసిందో…అదే కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ చేస్తున్నాం… మాట తప్పితే కాంగ్రెస్ , బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వం. అవసరమైతే మేము కూడా ఢిల్లీ వస్తాం… బిజెపి పై పోరాటం చేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు” అని సూచించారు.

శనివారం నాడు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

“బీసీ బిల్లులు అసెంబ్లీ ఆమోదించిన తర్వాత చోటే భాయ్… బడే భాయ్ కి అప్పగించారు. కోర్టులకు వెళ్తారా… లేదా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కాళ్ల మీద పడతారా మాకు సంబంధం లేదు కానీ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తెలంగాణలో కంటే ఎక్కువ ఢిల్లీలోనే ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదు ? బీసీల విషయం వచ్చేసరికి ప్రధాని అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదు ?” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు.

తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ల తరహాలో తెలంగాణలో కూడా అమలు చేయడానికి ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ. 4,500 కోట్లు ఖర్చు చేసి 2011లో నిర్వహించిన నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదంటే కాంగ్రెస్ వద్ద సమాధానం లేదని, రూ 4500 కోట్లు గంగలో పోశారు కానీ లెక్కలు అయితే బయటకు ఇవ్వలేదనీ విమర్శించారు.

కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం అని తేలిందని, కానీ కాంగ్రెస్ చేసిన కుల సర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి.. ఓసీల జనాభాను పెంచారని విమర్శించారు. గ్రామాల వారీగా కులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టాలని, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు ? అని నిలదీశారు.

కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ తమ పోరాటం వల్ల దిగొచ్చిన ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ వేర్వేరు చట్టాలు చేసిందని తెలిపారు. ఇది తాము సాధించిన విజయమని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణలో రిజర్వేషన్లు 54 శాతం అమలవుతున్నాయని, అంటే సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితి మించిన రీత్యా కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశామని వివరించారు.

బీసీ నాయకత్వం బలపడడానికి ఐదుగురిని రాజ్యసభకు, 8 మందికి ఎమ్మెల్సీ,58 మందికి కార్పొరేషన్ చైర్మన్ల పదవిని ఇచ్చామని, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవి ఎప్పుడూ బీసీ బిడ్డలకు దక్కలేదని, మొట్టమొదటి సారి రవీందర్ యాదవ్ ను కేసీఆర్ వీసీ చేశారని, అడ్వొకేట్ జనరల్ గా బీసీ బిడ్డ అయిన ప్రసాద్ ను నియమించిన ఘనత కేసీఆర్ దని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రనంద్, మాజీ జెడ్పిటిసి, బాజిరెడ్డి జగన్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ , మాజీ జెడ్పిటిసి రాజేశ్వర్ రావు , యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివ ప్రసాద్ , జాగృతి నాయకులు నవీన్ ఆచారి , శ్రీధర్ రావు, సంపత్ గౌడ్ , నరాల సుధాకర్ , చింత మహేష్, యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ నాయకులు అలకుంటల హరి ,కొట్టాల యాదగిరి ,ఎత్తరి మారయ్య, గోపు సదనందు, విజేందర్ సాగర్ ,రాచమల్ల బాలకృష్ణ , డి కుమారస్వామి , సాల్వాచారి, డి నరేష్ కుమార్ , గురం శ్రవణ్, అశోక్ యాదవ్ ,లింగం శాలివాహన , పుష్ప చారి , మధు , విజయ్ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE