– ఖర్గే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ చదివారు
– శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్ .మధుసూదనా చారి
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలంగాణ లో అద్భుతమైన పాలన జరిగింది అని ఎల్ బి స్టేడియం లో అన్నారు. ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఖర్గే తో చిలక పలుకులు పలికించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది.
ఎస్సీ ,ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. తాను ప్రకటించిన డిక్లరేషన్ అమలు కాకున్నా కాంగ్రెస్ పాలన అద్భుతమని ఖర్గే ఎలా అంటారు ? సామాజిక న్యాయానికి సమాధి కట్టిందే కాంగ్రెస్ పార్టీ.
1970 ,1980 ప్రాంతం లో కేంద్ర ప్రభుత్వం లో సగం మంది మంత్రులు ఒకే సామాజిక వర్గం వాళ్ళే.. సీఎం లు గవర్నర్లు కూడా కాంగ్రెస్ లో ఒకే సామాజిక వర్గం వారు ఉండేవారు. రాష్ట్రం లో ఇపుడు కూడా సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది. మండల్ కమిషన్ ను తొక్కి పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మెజారిటీ ప్రజలకు అన్యాయం చేసిన పార్టి కాంగ్రెస్ పార్టీ.
ఖర్గే మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. కులగణన పై ఖర్గే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్రం లో జరిగిన కుల గణన పై ఖర్గే గొప్పలు చెప్పుకుంటున్నారు. తూతూ మంత్రంగా తప్పుల తడకగా కులగణన జరిగింది. బీసీ బిల్లును ఆమోదించి ఢిల్లీ పంపిన తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై చేయాల్సినంత ఒత్తిడి చేయడం లేదు.
కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మూడు నెలలైనా బీసీ రిజర్వేషన్ల బిల్లు పై అడుగు ముందుకు పడటం లేదు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారు .ఇపుడు ఖర్గే చేస్తున్నారు. ఖర్గే వాస్తవాలను ఓ సారి క్రాస్ చెక్ చేసుకోవాలి.
ప్రజలను మోసం చేయడం లో తెలంగాణ ను ఓ ప్రయోగశాల గా మార్చారు. హామీలు అమలవుతున్నాయని ఖర్గే చెప్పడం ప్రజలను వంచించడమే. రైతు భరోసా పై కూడా ఖర్గే అబద్దాలు చెప్పారు.సీఎం మాటలు మోసాలు కోటలు దాటుతున్నాయి ..ఆచరణ గడప దాటడం లేదు.
బీసీ లను రెండో శ్రేణి పౌరులుగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ బీసీ ల గురించి మాయ మాటలు చెప్పి కొత్త ఎత్తుగడ తో కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది .ప్రతి సారీ మోసం చేయడం కుదరదు. ఖర్గే రేవంత్ రెడ్డి ని ప్రశ్నిస్తారు అనుకుంటే ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివారు. కాంగ్రెస్ నయా నాటకాన్ని ప్రజలకు వివరిస్తాం.
ప్రెస్ మీట్ లో పల్లె రవి కుమార్ , ఆంజనేయ గౌడ్ , రామచంద్రు నాయక్ , ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.