– మంత్రులు, ఎమ్మెల్యేల తిరుగుబాటు
– అందుకే ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు
– రేవంత్ దోపిడీకి బీజేపీ అండదండలు
– రేవంత్ సర్కారు ఎన్ని స్కాములు చేసినా కేంద్ర విచారణ సంస్థలు పట్టించుకోవడం లేదు
– రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనేది స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేనే ఒప్పుకున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రజలను, చివరకు వాళ్ల పార్టీ అగ్ర నాయకులను కూడా మభ్యపెట్టే ప్రయత్నాల్లో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే.. పార్టీ అగ్ర నాయకులను మోసం చేద్దామని చూశారు. కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అందుకే.. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా పోయిందని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కు కూడా అర్థమైపోయింది.
అందుకే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వదిలేసింది. ఇక జీవితంలో మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదని ఢిల్లీకి కూడా తెలిసిపోయింది. అందుకే ఇక్కడ మీనాక్షి నటరాజన్ తో రేవంత్ రెడ్డికి సమాంతరంగా మరో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా అర్థమవుతోంది. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి.. ఈ వర్గం.. ఆ వర్గం అని లేకుండా..అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.
రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలు.. మాట్లాడుతున్న చిల్లర మాటలతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. రేవంత్ రెడ్డి పేరు వినబడితేనే ఛీ.. అనే పరిస్థితి వచ్చింది. రెండేళ్లలోనే ప్రజల నుండి ఇంత వ్యతిరేకత రావడంతో ఇక్కడ తమ పార్టీ పని అయిపోయిందని స్వయంగా ఖర్గేకే అవగతమైంది. ఇప్పుడు మిగతామూడేళ్లు కూడా ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ లోని మంత్రులు, ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కాంగ్రెస్ సర్కారు పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారింది.
అందుకే ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి.. అక్రమ సంపాదన మీద కాంగ్రెస్ నాయకులు ఫోకస్ పెట్టారు. కిందిస్థాయి నాయకుల నుండి ముఖ్యమంత్రి వరకు అందినకాడికి దోచుకుంటున్నారు. మళ్లీ అవకాశం రాదని.. ఇప్పుడే భారీగా సంపాదించుకోవాలని.. తెలంగాణను తెగనమ్ముతున్నారు.
అందుకే కావొచ్చు రేవంత్ రెడ్డి పూర్తిగా బీజేపీకి దగ్గరై, మోడీ ఆదేశాల ప్రకారం, మోడీ విధానాలను అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే రేవంత్ సర్కారు ఎన్ని స్కాములు చేసినా, ఆయన కేబినెట్ లోని మంత్రులు, వారి అనుచరులు ఎన్ని స్కాములు చేసినా కేంద్ర విచారణ సంస్థలు పట్టించుకోవడంలేదు.