Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ అంటే అవినీతి… అవినీతి అంటే కాంగ్రెస్

-బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగ పార్టీలు
-తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ
– బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్

ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ కి పెరుగుతున్న ఆదరణను చూసి, దేశంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారనే అక్కసుతో I.N.D.I అలయెన్స్ గా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీలు.. కూటమి నుంచి ఒక్కొక్కటిగా చెల్లాచెదురవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అది కూటమి కాదని.. ఘమండియా ఘట్ బంధన్ గా అభివర్ణించారు. దేశంలో కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందని తెలిపారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశవాద రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గ్యారంటీలు, ఉచిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించి అవినీతి సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామన్న కాంగ్రెస్ నాయకుల గొంతులు మూగబోయాయనన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి సిఫార్సులు లేకుండా తెలుగు తేజాలకు పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేయడం గర్వకారణమని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్ , సునీతా రెడ్డి , రాణి రుద్రమ , రచనా రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడిన ముఖ్యాంశాలు :
ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఆకర్షితులై బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.అయితే, మూడోసారి కూడా మోదీ గారు ప్రధాని అవుతారనే అక్కసుతో కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు I.N.D.I. అలయెన్స్ గా ఏర్పడ్డాయి. అది కూటమి కాదు.. ఘమండియా ఘట్ బంధన్. కూటమి గా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీలకు ఒక ఎజెండా లేదు.. ఆ పార్టీల నాయకులకు నీతి లేదు, ప్రధాన నేత లేరు.

నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావొద్దనే అక్కసు తప్పితే I.N.D.I కూటమి పార్టీలకు దేశ ప్రజల పట్ల పట్టింపు లేదు. అందుకే ఆ కూటమి నేడు బీటలువారి చెల్లాచెదురవుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటూ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్, ఢిల్లీలో కాంగ్రెస్ తో సంబంధం లేదని చెప్పింది. యూపీలో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ప్రభావం ఎంత అంటూ విభేదించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ‘I.N.D.I అలయన్స్’నుంచి బయటకొచ్చారు. కుటుంబ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి నేడు అదే కూటమి ముక్కలవుతోంది.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వంశపారపర్య రాజకీయాలకు చెల్లుచీటి పాడాలని.. బుజ్జగింపు, అవినీతి, కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, గాంధీ కుటుంబం కోసమే పనిచేస్తుంది.పేదల సంక్షేమం కోసం చిట్టచివరి వ్యక్తి వరకు సంక్షేమం దరిచేర్చేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా 32 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సామాజిక న్యాయం కోసం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంతో కుల, మత వర్గాలకు అతీతంగా నరేంద్ర మోదీ పాలన అందిస్తున్నారు.

అణగారిన ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడి, రెండు పర్యాయాలు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరి ఠాకూర్ గారికి నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతరత్నతో గౌరవించడం గర్వకారణం. బడుగుబలహీన వర్గాల ప్రజల కోసం సేవలందించిన కర్పూరీ ఠాకూర్ గారిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు.

శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో భవ్యమైన మందిర నిర్మాణం చేసి 140 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ప్రధాని మోదీ గారు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటే… కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం, మైనారిటీలను బుజ్జిగించే ధోరణితో విమర్శలు గుప్పిస్తోంది. స్వాతంత్ర్యం అనంతరం సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రధాని నెహ్రూ ని ఆహ్వానిస్తే తిరస్కరించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే … తెలంగాణలో సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయంటూ రెచ్చగొడుతున్నారు. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే భయంతో వణుకుతున్నారు. కాంగ్రెస్ అంటే అవినీతి… అవినీతి అంటే కాంగ్రెస్. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితాలు, గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతుబంధు ఇవ్వకుండా రైతులను, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది.

కేసీఆర్ కుటుంబం అవినీతి, అహంకారం పట్ల ఆక్రోశానికి గురైన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించారు. అది కాంగ్రెస్ విజయం కాదు.అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ నాయకుల అవినీతి కక్కిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు.. అధికారంలోకి వచ్చాక గొంతులు మూగబోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించి సొమ్మును రికవరీ చేసి ప్రజలకు పంచుతామన్న గొంతులు నేడు మూగబోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నారు.

అవినీతి ఆరోపణలున్న అధికారులతోనే కాంగ్రెస్ మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం సిగ్గుచేటు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగ పార్టీలు.బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం.. కాంగ్రెస్ నెహ్రూ, గాంధీ కుటుంబం కోసం పనిచేసే పార్టీలు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 412 పైగా హామీలను ఇచ్చి.. ఒకటి రెండు మాత్రమే అమలు చేసి మోసం చేయాలనుకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గ్యారంటీలు తేలిపోయాయి. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు సాంత్వన కల్పించారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లతో మహిళలకు పెద్దపీట వేశారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు మహిళల శక్తిని ప్రదర్శించాయి, నారీశక్తి ప్రధానవేదికగా నిలిచింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఎన్నికల ముందు వార్తల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నారు. గొరిల్లా గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఎందుకు తమిళనాడుకు తరలిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలంగాణ సంపదను దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ వంశపారపర్య రాజకీయాలను, అవినీతిని ఎదుర్కొనగలిగేది కేవలం బీజేపీ మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తున్నారు.

అధికారం కోల్పోయిన తర్వాత మతిచలించిన కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో 10 మందికి పైగా ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం. బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ని అవమానించిన పార్టీ కాంగ్రెస్. ఎవరి సిఫారసు లేకుండా తెలుగు తేజాలకు పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేయడం గర్వకారణం.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయం. కాంగ్రెస్ ను సైతం ప్రజలు విస్మరిస్తారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ గారి అభివృద్ధిని చూసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నాను.

LEAVE A RESPONSE