Suryaa.co.in

Andhra Pradesh

కంటైనర్ టెర్మినల్ మూత ముమ్మాటికీ నిజం

-జనవరి నెలాఖరుకు చిట్టచివరి నౌక..అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి కంపెనీలకు అధికారికంగా ఈ మెయిల్
-ఫిబ్రవరి 1 నుంచి పూర్తిగా నిలిచిపోనున్న కార్యకలాపాలు
-కాకాణీ..రాజీనామా నువ్వు చేస్తావా..మీ సీఎం కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తాడా
-నీ అక్రమ వసూళ్ల కారణంగానే టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతోంది
-తమిళనాడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన బొగ్గు, బూడిదకు సంబంధించిన బల్క్ కార్గోకే ఇక పోర్టు పరిమితం
-దుడ్లు మీకు..దుమ్ము మా ముత్తుకూరు ప్రజలకా?
-మంత్రి గోవర్ధన్ రెడ్డి కారణంగా సర్వేపల్లితో పాటు రాష్ట్రానికి జరుగుతున్న భారీ నష్టాన్ని వెలుగులోకి తెస్తే నన్ను బూతులు తిడుతున్నాడు
-ధనదాహంతో కంటైనర్ టెర్మినల్ ను తరిమేస్తున్న ఆయనే తిరిగి పోరాటం చేస్తాననడం హాస్యాస్పదం
-కంటైనర్ టెర్మినల్ తరలింపు విషయం ఆషామాషీ కాదు. అఖిలపక్షంతో కలిసి పోరాటం చేపట్టబోతున్నాం
-నెల్లూరులో మీడియాతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఈ నెలాఖరుకు మూతపడుతోంది. చిట్టచివరి వెజల్ ఈ నెల 26న రావల్సింది. 29న వచ్చి కంటైనర్లను దించబోతోంది. జనవరి 31 నుంచి ఇక్కడ కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని, ఎగుమతులు, దిగుమతులు ఎన్నూరు, కాటుపల్లి పోర్టుల నుంచి జరుపుకోవాలని అదానీ కార్యాలయం నుంచి కంపెనీలకు ఈ మెయిల్స్ పంపారు. కృష్ణపట్నం పోర్టుకు 2020-21లో 334947 కంటైనర్లు వచ్చాయి. 2021-22లో వచ్చిన కంటైనర్ల సంఖ్య 1.44 లక్షలు, 2022-23లో 99 వేలు, 2023-24లో 99287 కంటైనర్ల రవాణా మాత్రమే జరిగింది. ఈ లెక్కలన్నీ కృష్ణపట్నం పోర్టు ఇచ్చినవని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చూపించినవే.

2019 నాటికి ఏడాదికి 6 లక్షల కంటైనర్ల రవాణా జరిగింది. అది క్రమేణా 4 లక్షలకు పడిపోయింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రైవేటు టోలుగేటు తెరిచి లారీకి ఇంత, కంటైనర్ కు ఇంత అని వసూళ్లకు తెరలేపిన తర్వాత కంటైనర్ల సంఖ్య 90 వేలకు పడిపోయింది.ఈ కారణాలతో ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి అదానీ కంపెనీకి అవకాశం దొరికింది. నెలాఖరుకు ఏకంగా మూతపడిపోతోంది. కాటుపల్లి, ఎన్నూరు పోర్టుల నుంచి వ్యాపారం కొనసాగించి బూడిద, బొగ్గుకు సంబంధించిన బల్కో కార్గోకు పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు. మట్టి మషానానికి సంబంధించిన బల్క్ కార్గో 38 లక్షల టన్నుల నుంచి 48 లక్షల టన్నులకు పెరిగిందని కాకాణి గొప్పగా చెప్పుకుంటున్నారు.

కాకాణి ధనదాహంతో కంటైనర్ టెర్మిన్ వెళ్లిపోవడం ఖాయమైపోయింది.. ఇక బూడిద, బొగ్గు, మట్టిమషానంతో ముత్తుకూరు నాశనం కావడమే.కృష్ణపట్నం పట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఇక్కడి నుంచి వెళ్లిపోతుందనే వాస్తవాన్ని బయటపెట్టినందుకు కాకాణి నోరుపారేసుకున్నాడు. కాకాణి అక్రమ వసూళ్లతో జరుగుతున్న నష్టాన్ని వెలుగులోకి తెచ్చినందుకు అత్యంత జుగుస్సాకరమైన భాషతో తిట్టాడు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు టెర్మినల్ ను ఇక్కడి నుంచి తరలిస్తే పదవిలో కొనసాగే ప్రసక్తే లేదన్నాడు. రాజీనామా చేసిపడేస్తానని ప్రగల్భాలు పలికాడు. ఇప్పటికే ఆయన అక్రమాలు, అవినీతి, దోపిడీకి సంబంధించి ఎన్నో విషయాలు ఆధారాలతో సహా బయటపెట్టినా అడ్డమైన కూతలు కూస్తూ దాటవేసుకుంటూ పోతున్నాడు.ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుండటం ఆషామాషీ విషయం కాదు.

రాయలసీమ, కోస్తా ప్రాంతానికి సంబంధించిన ఓ గేట్ వే ఇది. పోర్టు కోసం 2500 ఎకరాలు, ఎస్ఈజెడ్ కోసం మరో 6000 ఎకరాల భూములను రైతులు త్యాగం చేస్తే ఏర్పడింది. మరో 2 వేల ఎకరాలను పోర్టు ఆధారిత కిసాన్ సెజ్ కోసం త్యాగం చేశారు. ఇప్పుడు కంటైనర్ టెర్మినల్ మూతపడుతుండటం నెల్లూరు జిల్లాకే కాదు..రాష్ట్రానికే అవమానం.రాష్ట్రానికి కొత్త పోర్టులను సాధించుకోవాల్సిందిపోయి ఉన్న పోర్టులను తరిమేస్తున్న దుస్థితి.

బల్క్ కార్గో కార్యకలాపాలను తమిళనాడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆదాయం ఎక్కువ వచ్చే కంటైనర్ టెర్మినల్ ను అక్కడికి తరలించి దుమ్ము, ధూళి మన ముఖాన కొడుతున్నారు. రైతులు పండించే బియ్యం, పత్తి, పొగాకు, చేపలు, రొయ్యలు తదితర ఉత్పత్తుల ఎగుమతులపై కంటైనర్ టెర్మినల్ తరలింపు తీవ్ర ప్రభావం చూపనుంది. కంటైనర్ టెర్మినల్ తరలింపు కుట్రలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధం లేకపోతే ఇక్కడే కొనసాగేలా చర్యలు తీసుకోవాలి.

అసలు ఈ పరిస్థితి కారణమయ్యేలా వసూళ్ల దందాకు తెరలేపిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. కాకాణి టోల్ వసూళ్లను నిలిపివేస్తామని, ఇకపై ఎలాంటి అక్రమ వసూళ్లను ఉపేక్షించబోమని అదానీ సంస్థకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇస్తే కంటైనర్ టెర్మినల్ ఇక్కడే కొనసాగే అవకాశముంది. లేదంటే భూములిచ్చిన రైతులతో పాటు కంటైనర్ టెర్మినల్ పై ఆధారపడి ఆకలితీర్చుకుంటున్న 10 వేల మంది గోస్ట సీఎంకి, మంత్రి కాకాణికి తప్పదు.

స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కారణంగా ప్రజలకు ప్రయోజనాలు చేకూరాల్సిందిపోయి భారీ నష్టం జరుగుతుండటం దురదృష్టకరం. కంటైనర్ టెర్మినల్ వెళ్లిపోవడానికి ప్రధాన కారకుడైన కాకాణి గోవర్ధన్ రెడ్డే దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాననడం హాస్యాస్పదం.వేల కోట్లకు అధిపతులైన అదానీలు కృష్ణపట్నం పోర్టులో జరుగుతున్న కాకాణి దందా కారణంగా కంటైనర్ టెర్మినల్ ను మూసివేయడం కరెక్ట్ కాదు. ఇక్కడి రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొనసాగించాలని అదానీలను విన్నవిస్తున్నాం.

కంటైనర్ టెర్మినల్ తరలింపు సమస్య ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానిది కాదు. స్టేట్ ఇష్యూ ఇది. చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసిన తర్వాత జనసేన, సీపీఎం, సీపీఐ, బీజేపీలతో కలిసి అఖిలపక్షంగా ఏర్పడి పోర్టుకు వెళతాం. కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులకు మా ఆవేదనను విన్నవించి కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించాలని ప్రాధేయపడుతాం. ఆ తర్వాత తదుపరి కార్యాచరణ చేపడతాం.

LEAVE A RESPONSE